iDreamPost
android-app
ios-app

VIDEO: ఒకే ఓవర్‌లో 4 సిక్సులు.. అందులో మూడు 100 మీటర్లపైనే..! ఇదీ పొలార్డ్‌ పవర్‌..!

  • Published Aug 28, 2023 | 2:16 PM Updated Updated Aug 28, 2023 | 2:16 PM
  • Published Aug 28, 2023 | 2:16 PMUpdated Aug 28, 2023 | 2:16 PM
VIDEO: ఒకే ఓవర్‌లో 4 సిక్సులు.. అందులో మూడు 100 మీటర్లపైనే..! ఇదీ పొలార్డ్‌ పవర్‌..!

విండీస్‌ వీరుడు కీరన్‌ పొలార్డ్‌ బ్యాటింగ్‌ గురించి కొత్తగా చెప్పాల్సింది ఏం లేదు. అతను ఎంతటి విధ్వంసకర ఆటగాడో ప్రపంచం మొత్తానికి తెలుసు.. అంతర్జాతీయ క్రికెట్‌లో వెస్టిండీస్‌ తరఫున అలాగే ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్‌ తరఫున అతని ఊచకోతను అంతా చూసి ఆనందించిన వారే. తన బ్యాటింగ్‌, బౌలింగ్‌తో క్రికెట్‌ అభిమానులను ఓ రేంజ్‌లో అలరించిన పొలార్డ్‌.. ఐపీఎల్‌ 2023 నుంచి ఆటగాడిగా తప్పుకుని బ్యాటింగ్‌ కోచ్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ముంబై ఇండియన్స్‌ జట్టుతోనే పొలార్డ్‌ తన జర్నీ కొనసాగిస్తున్నారు.

ఐపీఎల్‌లో ఆటకు గుడ్‌బై చెప్పినా.. తనలో ఇంకా సత్తా తగ్గలేదని పొలార్డ్‌ నిరూపిస్తున్నే ఉన్నాడు. యూఏఈ వేదికగా జరిగిన ఐఎల్‌టీ20 లీగ్‌లో, ఇప్పుడు తాజాగా కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌లో తన బ్యాటింగ్‌ పవరేంటో రుచిచూపించాడు. పొలార్డ్‌ సిక్స్‌ కొడితే ఎలా ఉంటుందో.. అది రేంజ్‌ దూరం వెళ్తుందో మరోసారి ప్రపంచానికి తనలోని విధ్వంసకర బ్యాటర్‌ను పరిచయం చేశాడు. ముఖ్యంగా ఆదివారం సెయింట్ కిట్స్ అండ్ నెవిస్ పేట్రియాట్స్ – ట్రిన్‌బాగో నైట్ రైడర్స్ మధ్య జరిగిన మ్యాచ్‌లో పొలార్డ్‌ పవర్‌ హిట్టింగ్‌తో చెలరేగిపోయాడు.

ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్‌ జట్టుకు కెప్టెన్‌గా వ్యవహరిస్తున్న పొలార్డ్‌.. 179 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో పెట్రియాట్స్‌ బౌలర్‌ నవీద్‌ వేసిన ఇన్నింగ్స్‌ 15వ ఓవర్‌లో ఆకాశమే హద్దుగా చెలరేగాడు. ఆ ఓవర్‌లో ఏకంగా నాలుగు సిక్సులు బాదాడు. అందులో తొలి మూడు సిక్సులు వంద మీటర్లకు పైగా దూరం వెళ్లడం విశేషం. నవీద్‌ వేసిన ఓవర్‌లో తొలి బంతిని టక్కర్‌ సింగిల్‌ తీసి స్ట్రైక్‌ పొలార్డ్‌కు ఇచ్చాడు. రెండో బంతిని పొలార్డ్‌ డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా 101 మీటర్ల సిక్స్‌ బాదాడు. తర్వాత బంతి నోబాల్‌కాగా, మూడో బంతికి రెండు పరుగులు తీశాడు. తర్వాతి మూడు బంతులను కూడా డీప్‌ మిడ్‌ వికెట్‌ మీదుగా వరుసగా.. 107, 102, 95 మీటర్ల భారీ సిక్సర్లు బాదాడు. మొత్తం మీద కేవలం 16 బంతుల్లో 5 సిక్సులతో 37 పరుగులు చేసి టీమ్‌ను గెలిచిపించాడు. 17.1 ఓవర్లలోనే నైట్‌ రైడర్స్‌ జట్టు 180 పరుగులు చేసి ఈ మ్యాచ్‌లో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో పొలార్డ్‌ కొట్టిన భారీ సిక్సులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: ఫుల్‌బాల్‌ తరహాలో రెడ్‌ కార్డ్‌! కరేబియన్‌ లీగ్‌లో తొలిసారి అమలు