Venkateswarlu
Venkateswarlu
మన మీద మనకు బలమైన నమ్మకం.. దృఢమైన సంకల్పం.. నిద్రపోనివ్వని ఓ కోరిక.. ఇవి ఉంటే చాలు ఆ మనిషి విజయ తీరాలకు చేరతాడు. కర్ణాటకకు చెందిన ఓ యువతి కూడా తనను తాను బలంగా నమ్మింది. అందుకే.. లక్షలు అప్పు చేసి జర్మనీలో జరుగుతున్న పోటీలకు వెళ్లింది. ఆమె కృషి, పట్టుదల, కార్యదీక్ష వృధా కాలేదు. ఆ యువతి ఏకంగా మూడు విభాగాల్లో మూడు పతకాలు గెలిచింది. అద్భుతమైన విజయాన్ని దేశానికి అందించి.. సగటు భారతీయుడు గర్వంగా తలెత్తుకునేలా చేసింది.
ఆ వివరాల్లోకి వెళితే.. కర్ణాటకలోని బెలగామ్, చిక్కనంది గ్రామానికి చెందిన మంజుల శివానంద్ గోరగుడ్డికి చిన్నప్పటి నుంచి ఆటలంటే చాలా ఇష్టం. అందుకే తనకిష్టమైన ప్రతీ ఆటలో నైపుణ్యం సాధించింది. ఆమె రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఎన్నో పతకాలను గెలిచింది. అంతటితో ఆమె ఆగలేదు. అంతర్జాతీయ స్థాయిలో భారత్ పేరు నిలబెట్టాలన్న బలమైన కోరికతో ఉండేది. అందుకు సరైన అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ నేపథ్యంలోనే జర్మనీలో జరుగుతున్న 8వ వరల్డ్ డ్వార్ఫ్ గేమ్స్ గురించి తెలిసింది.
ఎలాగైనా ఆ పోటీల్లో పాల్గొనాలని భావించింది. ఈ పోటీలకు వెళ్లడానికి కొందరు మంజులకు ఆర్థిక సాయం చేశారు. అయినా ఆ మొత్తం జర్మనీ ప్రయాణానికి సరిపోవని తేలింది. అయినప్పటికీ ఆమె నిరాశపడలేదు. తన మీద తనకు నమ్మకం ఉండటంతో అప్పు చేసైనా సరే జర్మనీ వెళ్లాలని భావించింది. అనుకున్నట్లుగానే 2.5 లక్షల రూపాయలు వడ్డీకి తీసుకుంది. కొద్దిరోజుల క్రితం జర్మనీ ప్రయాణం అయింది. మొత్తం మూడు పోటీల్లో ఆమె పాల్గొంది. షాట్‌పుట్‌లో బంగారం, వీల్ థ్రోలో వెండి, జావెలిన్ థ్రోలో రజత పతకాలను గెలుచుకుంది.
కేవలం మూడు రోజుల్లో 3 పతకాలు గెలిచి ఇండియా పేరు ప్రపంచ స్థాయిలో మారుమోగేలా చేసింది. పతకాలు గెలిచిన వెంటనే ఇంటికి వీడియో కాల్ చేసింది. తల్లిదండ్రులతో తన సంతోషాన్ని పంచుకుంది. మంజుల మాట్లాడుతూ.. ‘‘ ఈ విజయాన్ని నేను నా తల్లికి, నా మాతృభూమికి అంకితం ఇస్తున్నా. ఇంకొన్ని విజయాలు సాధించటానికి నాకు ఓ స్పూర్తి దొరికింది. నాకు సహాయ సహకారాలు అందించిన వారందరికీ కృతజ‍్క్షతలు’’ అని పేర్కొంది. మరి, అప్పు చేసి జర్మనీ వెళ్లి మూడు పతకాలు గెలిచిన మంజులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.