యాషెస్ సిరీస్ లో భాగంగా.. లార్డ్స్ వేదికగా జరిగిన రెండో టెస్ట్ లో 43 పరుగుల స్వల్ప తేడాతో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దాంతో ప్రతిష్టాత్మక సిరీస్ లో 2-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది ఆసీస్. అయితే రెండో టెస్ట్ ఆఖరి రోజు ఆటలో ఇంగ్లాండ్ ఆటగాడు జానీ బెయిర్ స్టో అవుట్ వివాదాస్పదంగా మారింది. ఈ ఔట్ విషయంలో ఆసీస్ ఆటగాళ్లు క్రీడాస్ఫూర్తికి విరుద్దంగా ప్రవర్తించారని సోషల్ మీడియా వేదికగా కొందరంటుంటే.. మరికొందరు రూల్స్ ప్రకారం అది కచ్చితంగా ఔటే అని వాదిస్తున్నారు. ఇక అవుట్ పై ఇరు జట్ల కెప్టెన్స్ స్పందించారు. ఈ క్రమంలోనే ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఆసీస్ పై సంచలన వ్యాఖ్యలు చేశాడు.
బెయిర్ స్టో ఔట్ పై ఇటు ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్.. అటు ఆసీస్ సారథి పాట్ కమ్మిన్స్ స్పందించారు. బెయిర్ స్టో అవుట్ ను కమ్మిన్స్ సమర్థించుకున్నాడు. క్రికెట్ రూల్స్ ప్రకారం అది కచ్చితంగా అవుటేనని చెప్పుకొచ్చాడు. ఇక ఈ విషయంపై ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ సంచలన కామెంట్స్ చేశాడు. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ..”ఓ ప్లేయర్ ను ఇలా ఔట్ చేయడం ద్వారా వచ్చిన గెలుపు మాకు అవసరం లేదు. ఒకవేళ ఇలాంటి అవకాశం మాకు వచ్చినా.. మేము వదిలేస్తాం. అయితే ఆసీస్ ది మ్యాచ్ విన్నింగ్ మూమెంట్ కావడంతో.. అలా చేసారనుకుంటా. ఈ పద్దతిలో వచ్చే గెలుపు మాకు అవసరం లేదు” అంటూ స్టోక్స్ ఆసీస్ ఆటగాళ్లపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
ఈ క్రమంలోనే రూల్స్ ప్రకారం బెయిర్ స్టో ఔటేనని స్టోక్స్ చెప్పుకురావడం గమనార్హం. కాగా.. చివరిరోజు ఆటలో బెయిర్ స్టో అవుట్ కావడం.. మ్యాచ్ కు టర్నింగ్ పాయింట్. ఇక స్టోక్స్ వీరోచిన ఇన్నింగ్స్ ఇంగ్లాండ్ కు విజయాన్ని ఇవ్వలేకపోయింది. రెండో ఇన్నింగ్స్ లో స్టోక్స్ 214 బంతుల్లో 9ఫోర్లు, 9 సిక్స్ లతో హీరోచిత బ్యాటింగ్ చేశాడు. కానీ మరో ఎండ్ లో అతడికి సహకరించేవారు లేకపోవడంతో.. లక్ష్యానికి చేరువగా వచ్చి 43 పరుగుల స్వల్ప తేడాతో ఇంగ్లాండ్ జట్టు ఓడిపోయింది.