iDreamPost
android-app
ios-app

బుమ్రాకు సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది!

  • Author singhj Published - 12:38 PM, Mon - 11 September 23
  • Author singhj Published - 12:38 PM, Mon - 11 September 23
బుమ్రాకు సర్​ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చిన పాక్ బౌలర్ షాహీన్ అఫ్రిది!

ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్​లను వరుణుడు వదలనంటున్నాడు. ఆసియా కప్-2023లో భాగంగా ఈ రెండు జట్ల మధ్య జరిగిన లీగ్ మ్యాచ్​ను రద్దు చేయించిన వర్షం.. ఆదివారం సూపర్-4 మ్యాచ్​కు కూడా అడ్డుపడింది. ఈ మ్యాచ్​లో టాస్ గెలిచిన పాకిస్థాన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్​కు దిగిన భారత్ 24.1 ఓవర్లలో 147/2తో ఉన్న దశలో వాన వల్ల ఆట ఆగిపోయింది. ఆ తర్వాత వర్షం కొంచెం తగ్గినా మైదానం ఆటకు అనువుగా లేకపోవడంతో రిజర్వ్ డే అయిన సోమవారానికి మ్యాచ్​ను పోస్ట్​పోన్ చేశారు. ఆదివారం ఎక్కడైతే ఆట ఆగిందో అక్కడి నుంచే రిజర్వ్ డే నాడు మ్యాచ్ కొనసాగనుంది.

పాక్​తో సూపర్​-4 మ్యాచ్​లో టీమిండియా ఓపెనర్లు శుబ్​మన్ గిల్ (58), రోహిత్ శర్మ (56) అదరగొట్టారు. ఈ జోడీ జట్టుకు మెరుపు ఆరంభాన్ని అందించింది. ముఖ్యగా గిల్ అయితే చెలరేగిపోయాడు. పాక్​ స్పీడ్​స్టర్ షాహీన్ షా అఫ్రిదీని టార్గెట్ చేసుకొని బౌండరీల మీద బౌండరీలు కొడుతూ స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. అతడికి తోడుగా కెప్టెన్ రోహిత్ కూడా ఫోర్లు, సిక్సులతో రెచ్చిపోవడంతో దాయాది జట్టు బౌలర్లకు ఏం చేయాలో పాలుపోలేదు. అయితే వీళ్లిద్దరూ స్పల్ప వ్యవధిలోనే వెనుదిరగడంతో భారత్ డిఫెన్స్​లో పడింది. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ (8 నాటౌట్), కేఎల్ రాహుల్ (17 నాటౌట్) క్రీజులో ఉన్నారు.

ఇక, క్రికెట్​ ఫీల్డ్​లో ఆటగాళ్ల మధ్య పోటీతత్వం ఎలా ఉంటుందో చూస్తూనే ఉంటాం. బరిలోకి దిగితే ప్లేయర్లు ఢీ అంటే ఢీ అంటూ పోరాడతారు. కానీ ఇది మైదానం వరకే పరిమితం. చాలా మంది క్రికెటర్లు ఫీల్డ్ బయట ఎంతో క్లోజ్​గా ఉంటారు. తాజాగా భారత్-పాకిస్థాన్​ ప్లేయర్ల మధ్య మంచి స్నేహ బంధం ఉందని మరోమారు రుజువైంది. పాక్ స్టార్ పేసర్ షాహీన్ అఫ్రిదీ తన మంచి మనసు చాటుకున్నాడు. భారత పేసర్ జస్​ప్రీత్ బుమ్రా ఇటీవల తండ్రైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం సూపర్ 4 మ్యాచ్​ సందర్భంగా బుమ్రాను కలసిన అఫ్రిదీ శుభాకాంక్షలు తెలియజేశాడు. అలాగే ఒక గిఫ్ట్​ను కూడా ఇచ్చాడు. ఆ తర్వాత వీళ్లిద్దరూ ఆలింగనం చేసుకున్నారు. తనకు బహుమతిని ఇచ్చిన పాక్ పేసర్​కు బుమ్రా థ్యాంక్స్ చెప్పాడు.

ఇదీ చదవండి: ఇలాంటి విన్యాసాలు పాక్​కే సాధ్యం! నవ్వకండి ప్లీజ్..