సాధారణంగా క్రికెట్ లో గానీ, మరే ఇతర క్రీడల్లో గానీ.. ప్లేయర్లు వికెట్ తీసినా, సెంచరీ చేసినా, పాయింట్లు సాధించినా సెలబ్రేట్ చేసుకోవడం సర్వ సాధారణమైన విషయం. అయితే కొందరి ఆటగాళ్ల సెలబ్రేషన్స్ వెనక మనకు తెలియని ఎన్నో నిజాలు ఉంటాయి. ఇలాంటి సెలబ్రేషన్స్ ఎక్కువగా క్రికెట్ గ్రౌండ్ లో జరుగుతూ ఉంటాయి. బౌలర్ వికెట్ తీసినప్పుడు, బ్యాటర్ సెంచరీ చేసినప్పుడు రకరకాలుగా సెలబ్రేషన్స్ చేసుకుంటారు. అలాంటి ఫోజే ఆఫ్గాన్ తో జరిగిన మ్యాచ్ లో వికెట్ తీసిన తర్వాత ఇచ్చాడు టీమిండియా స్పీడ్ గన్ జస్ప్రీత్ బుమ్రా. ప్రస్తుతం అతడు ఇచ్చిన ఫోజు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
వరల్డ్ కప్ లో భాగంగా అరుణ్ జైట్లీ మైదానంలో ఇండియా-ఆఫ్గాన్ జట్లు తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ఆఫ్గాన్ బ్యాటింగ్ కు దిగగా.. టీమిండియా బౌలర్లు ఆదిలోనే చుక్కలు చూపించారు. భారత బౌలర్ల ధాటికి 63 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది పసికూన జట్టు. అయితే కష్టాల్లో ఉన్న జట్టును ఆదుకునే ప్రయత్నం చేస్తున్నారు కెప్టెన్ హష్మతుల్లా షహిదీ, అజ్మతుల్లా ఒమర్ జై. ప్రస్తుతం ఆఫ్గాన్ 35ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 189 పరుగులు చేసింది. క్రీజ్ లో హష్మతుల్లా షహిదీ (60), నబీ(2) పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నారు. కెప్టెన్ హష్మతుల్లాతో కలిసి ఒమర్ జైన్(62) నాలుగో వికెట్ కు 121 పరుగుల అమూల్యమైన భాగస్వామ్యాన్ని నెలకొల్పారు.
ఇక ఈ మ్యాచ్ లో ఓ ఆసక్తికరమైన సన్నివేశం చోటుచేసుకుంది. ఆఫ్గాన్ ఓపెనర్ ఇబ్రహీమ్ జద్రాన్(22)ను బుమ్రా అవుట్ చేసి టీమిండియాకు బ్రేక్ ఇచ్చాడు. ఇక జద్రాన్ వికెట్ తీసిన తర్వాత బుమ్రా ఇచ్చిన ఫోజు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అతడి వికెట్ తీయగానే బుమ్రా తన చూపుడు వేలిని తన మైండ్ దగ్గర పెట్టి ఓ ఫోజు ఇచ్చాడు. అయితే ఈ ఫోజు ఇంగ్లాండ్ స్టార్ ఫుట్ బాలర్ అయిన మార్కస్ రాష్ ఫోర్డ్ తరచుగా ఉపయోగిస్తూ ఉంటాడు. అతడు గోల్ కొట్టినప్పుడు ఇలాంటి ఫోజుతో తన సంతోషాన్ని సెలబ్రేట్ చేసుకుంటాడు. ఇలా ఫోజు పెట్టడానికి కారణం ఏంటంటే? తన మైండ్ గేమ్ తో ప్రత్యర్థిని బోల్తా కొట్టించానని తెలపడం అన్నమాట. రాష్ ఫోర్డ్ ఫుట్ బాల్ మ్యాచ్ తన మైండ్ గేమ్ తో గోల్ సాధించినప్పుడు ఇలా సెలబ్రేషన్స్ చేసుకుంటాడు. ఇప్పుడు ఇదే పద్దతిని ఫాలో అయ్యాడు బుమ్రా.