ఏ ఆటల్లోనైనా రిటైర్మెంట్ అనేది కామనే. ఎంతటి ప్లేయర్ అయినా ఏదో ఒక రోజు గేమ్ నుంచి తప్పుకోక తప్పదు. అయితే వాళ్లు ఎలా ఆడారు, దేశానికి సేవలు అందించారా లేదా అనేది ముఖ్యంగా చెప్పుకోవచ్చు. జెంటిల్మన్ గేమ్ అయిన క్రికెట్లోనూ ఆటగాళ్లకు ఇది వర్తిస్తుంది. అయితే క్రికెటర్ల రిటైర్మెంట్ వార్తలు అభిమానులను ఎంతగానో బాధిస్తాయి. ఇన్నాళ్లూ గ్రౌండ్లో తమ అద్భుతమైన ఆటతీరుతో అందర్నీ అలరించిన స్టార్లు వీడ్కోలు ఇచ్చి వెళ్లిపోతుంటే తట్టుకోవడం ఎంతో కష్టంగా ఉంటుంది. ఆటగాళ్లకు కూడా తమకు అన్నీ అందించిన గేమ్ నుంచి వెళ్లిపోవడం చాలా భారంగా ఉంటుంది. కానీ ఎప్పటికైనా రిటైర్మెంట్ తప్పదు.
ఇద్దరు భారత స్టార్ క్రికెటర్లు రిటైర్మెంట్ ఇవ్వాలని అనుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. టీమిండియాకు ఎన్నో ఏళ్లుగా సేవలు అందిస్తూ వస్తున్న సీనియర్ పేసర్ ఇషాంత్ శర్మతో పాటు వెటరన్ కీపర్ వృద్ధిమాన్ సాహా క్రికెట్‌కు గుడ్ బై చెప్పాలని డిసైడ్ అయ్యారని సమాచారం. ఈ మేరకు ఈ ప్లేయర్లు ఇప్పటికే నిర్ణయం తీసుకున్నారని.. త్వరలోనే దీనిపై ప్రకటన చేస్తారని క్రికెట్ వర్గాల్లో జోరుగా ఊహాగానాలు వస్తున్నాయి. అయితే ఫేర్వెల్ లేకుండానే ఈ సీనియర్లు రిటైర్మెంట్ ఇవ్వనుండటం హాట్ టాపిక్‌గా మారింది. ఈ లిస్టులో ఉన్న ఫాస్ట్ బౌలర్ ఇషాంత్ శర్మ గత రెండేళ్లుగా భారత జట్టుకు దూరంగా ఉంటున్నాడు. అతడి కెరీర్ దాదాపుగా ముగిసినట్లేనని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు.
రిటైర్మెంట్ లిస్టులో ఉన్న మరో భారత క్రికెటర్ వృద్ధిమాన్ సాహా. 38 ఏళ్ల సాహా తన ఇంటర్నేషనల్ కెరీర్లో 3 సెంచరీలు బాదాడు. ఈ మూడు కూడా టెస్టుల్లోనే వచ్చాయి. అయితే తమ భవిష్యత్ ప్రణాళికల్లో సాహాను చేర్చుకోలేదని ఇటీవల భారత జట్టు మేనేజ్మెంట్ స్పష్టం చేసింది. స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ గాయపడినా వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్‌కు సాహాను బీసీసీఐ సెలెక్ట్ చేయలేదు. దీంతో అతడి కెరీర్ ముగిసిందనే అభిప్రాయానికి అందరూ వచ్చారు. సాహా కూడా వీడ్కోలు ఇవ్వాలని ఫిక్స్ అయ్యాడట. అయితే రిటైర్మెంట్ గురించి అటు ఇషాంత్ నుంచి గానీ, ఇటు సాహా నుంచి గానీ ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం రాలేదు.