iDreamPost
android-app
ios-app

సెహ్వాగ్‌, యువీ కెరీర్లను నాశనం చేసి.. వరల్డ్‌ కప్స్‌ క్రెడిట్‌ ధోని కొట్టేశాడా? అసలు నిజమేంటి?

  • Published Sep 17, 2024 | 11:39 AM Updated Updated Sep 17, 2024 | 11:57 AM

MS Dhoni, World Cup 2011, Yuvraj Singh: భారత క్రికెట్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్‌ ధోని.. క్రెడిట్‌ కొట్టేశాడనే విమర్శలు ఉన్నాయి. అలాగే కొంతమంది క్రికెటర్ల కెరీర్‌పై దెబ్బేశాడనే ఆరోపణలు ఉన్నా‍యి. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

MS Dhoni, World Cup 2011, Yuvraj Singh: భారత క్రికెట్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్న మహేంద్ర సింగ్‌ ధోని.. క్రెడిట్‌ కొట్టేశాడనే విమర్శలు ఉన్నాయి. అలాగే కొంతమంది క్రికెటర్ల కెరీర్‌పై దెబ్బేశాడనే ఆరోపణలు ఉన్నా‍యి. అందులో నిజమెంతో ఇప్పుడు చూద్దాం..

  • Published Sep 17, 2024 | 11:39 AMUpdated Sep 17, 2024 | 11:57 AM
సెహ్వాగ్‌, యువీ కెరీర్లను నాశనం చేసి.. వరల్డ్‌ కప్స్‌ క్రెడిట్‌ ధోని కొట్టేశాడా? అసలు నిజమేంటి?

మహేంద్ర సింగ్‌ ధోని.. ఈ పేరులోనే ఏదో ఇంద్రజాలముంది. మంచి టీమ్‌ అనే ట్యాగ్‌ ఉన్న టీమిండియాను ఛాంపియన్‌గా నిలిపిన కెప్టెన్‌ ధోని. అతను ఏది పట్టుకున్నా అది బంగారమే అవుతుందనే మాట అప్పట్లో బాగా ప్రచారంలో ఉండేది. సచిన్‌ తర్వాత, కోహ్లీ కంటే ముందు.. బీభత్సమైన ఫ్యాన్‌ ఫాలోయింగ్‌, క్రేజ్‌ను చూసిన క్రికెటర్‌ అతను. ఒక సాధారణ మధ్య తరగతి కుటుంబంలో పుట్టి.. రైల్వే శాఖలో టీటీగా పనిచేసుకోవాల్సిన ఓ కుర్రాడు.. తన రూటు మార్చుకొని టీమిండియాలో చోటు దక్కించుకొని.. భారత క్రికెట్‌ను నెక్ట్స్‌ లెవెల్‌కు తీసుకెళ్లాడు. ఇండియన్‌ క్రికెట్‌ హిస్టరీలోనే కాదు.. ప్రపంచ క్రికెట్‌ చరిత్రలోనే మరే కెప్టెన్‌కు సాధ్యం కానీ విధంగా మూడు డిఫరెంట్‌ ఐసీసీ ట్రోఫీలు గెలిచి చరిత్ర సృష్టించాడు. భారత క్రికెట్‌లో మోస్ట్‌ సక్సెస్‌ఫుల్‌ కెప్టెన్‌గా ఉన్నాడు. ధోని సక్సెస్‌ను, ఆటను, కెప్టెన్సీని పొగిడేవాళ్లు ఎంత మంది ఉన్నారో.. అలాగే అతను స్వార్థపరుడని, టీమిండియాలోని కొంతమంది క్రికెటర్ల కెరీర్లను నాశనం చేశాడని, వరల్డ్‌ కప్పుల క్రెడిట్‌ను ఒక్కడే కొట్టేశాడనే విమర్శలు కూడా భారీగా ఉన్నాయి. మరి.. ధోని నిజంగానే కొంతమంది క్రికెటర్ల కెరీర్‌పై దెబ్బేసి.. క్రెడిట్‌ను దొబ్బేశాడా? అందులో నిజమెంతా? అనేది ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

టీమ్‌ మొత్తం కలిసి 2011 వన్డే వరల్డ్‌ కప్‌ సాధిస్తే.. ధోని ఒక్కడికే ఆ క్రిడిట్‌ దక్కిందనే ప్రచారం ఇప్పటి కాదు, చాలా కాలంగా అందరికీ తెలిసిందే. ఈ విషయాన్ని వీరేందర్‌ సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, హర్భజన్‌ సింగ్‌ పలు సందర్భాల్లో బహిరంగంగానే ఖండించారు. వరల్డ్‌ కప్‌ గెలుపు జట్టు సమిష్టి కృషి అని, ధోని ఒక్కడే తెచ్చాడని అనడం సరికాదని అన్నారు. దీంతో పాటు.. వరల్డ్‌ కప్‌ గెలిచిన టీమ్‌లో ఉన్న వీరేందర్‌ సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, యువరాజ్‌ సింగ్‌, హర్భజన్‌ సింగ్‌, జహీర్‌ ఖాన్‌ల అంతర్జాతీయ కెరీర్‌ త్వరగా ముగిసిపోవడం వెనుక ధోని హస్తం ఉందనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఈ విషయంలో కొంతమంది క్రికెట్‌ నిపుణులు కూడా తమ అభిప్రాయాలను ధోనికి వ్యతిరేకంగా వ్యక్తం చేశారు. ఈ విమర్శలు, ఆరోపణలు దాటి చూస్తే.. ఇందులో ధోని తప్పు ఎంతుంది? అతని గొప్ప ఎంత ఉందనేది అర్థం అవుతుంది.

ఎలాంటి టైమ్‌లో కెప్టెన్‌ అయ్యాడు?

ధోని 2004 డిసెంబర్‌లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చాడు. తొలి రెండు మూడు మ్యాచ్‌ల్లో ధోని విఫలమైనా.. టాలెంట్‌ను నమ్మే అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ, ధోనికి మంచి అవకాశాలు ఇచ్చాడు. దాదా తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకొని.. టీమిండియాలో రెగ్యులర్‌ వికెట్‌ కీపర్‌ కమ్‌ బ్యాటర్‌గా మారాడు ధోని. అలా అలా 2007 వన్డే వరల్డ్‌ కప్‌కి కూడా ఎంపికయ్యాడు. వెస్టిండీస్‌ వేదికగా జరిగిన ఆ వరల్డ్‌ కప్‌.. టీమిండియా క్రికెట్‌ చరిత్రలో అత్యంత దారుణమైన వరల్డ్‌ కప్‌గా చెప్పుకోవచ్చు. బంగ్లాదేశ్‌, శ్రీలంకపై ఓడిపోయి.. రాహుల్‌ ద్రవిడ్‌ కెప్టెన్సీలోని టీమిండియా గ్రూప్‌ స్టేజ్‌లో ఇంటికి వచ్చింది. భారత్‌కు జరిగిన అవమానం అది. టీమిండియాలో కొంచెం కూడా ఆత్మవిశ్వాం లేని టైమ్‌లో ధోని అనే కుర్రాడు టీమిండియా టీ20 కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అదే ఏడాది సౌతాఫ్రికా వేదికగా మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ 2007కు శ్రీకారం చుట్టుంది ఐసీసీ. టెస్ట్‌, వన్డే ఫార్మాట్లకు అలవాటుపడి, వయసును దృష్టిలో పెట్టుకొని.. టీ20 లాంటి ధనాధన్‌ క్రికెట్‌కు సీనియర్‌ క్రికెటర్లు.. సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, రాహుల్‌ ద్రవిడ్‌ దూరంగా ఉన్నారు.

పూర్తిగా యంగ్‌ టీమ్‌తో ధోని కెప్టెన్సీలోని టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌కు అండర్‌డాగ్స్‌గా వెళ్లి.. ఛాంపియన్‌గా నిలిచింది. ఆ టోర్నీలో అందరూ బాగానే ఆడారు. పాకిస్థాన్‌తో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో గౌతమ్‌ గంభీర్‌, బౌలింగ్‌లో ఇర్ఫాన్‌ పఠాన్‌ అద్భుతం ప్రదర్శన కనబర్చారు. ఆ మ్యాచ్‌ తర్వాత వాళ్లపై ప్రశంసల వర్షం కురిసింది. అయితే.. ఒక యంగ్‌ కెప్టెన్‌ ధోని, సెహ్వాగ్‌, యువీ లాంటి సీనియర్లతో పాటు జోగిందర్‌ శర్మ అనే పెద్దగా అనుభవం లేని ఆటగాళ్లతో కూడిన జట్టును సమర్థవంతంగా నడిపించాడు. ఫైనల్‌ మ్యాచ్‌లో చివరి ఓవర్‌ జోగిందర్‌ శర్మతో చివరి ఓవర్‌ వేయించాలనేది ధోని నిర్ణయమే. అది సక్సెస్‌ అయింది.. అందుకే ధోనికి క్రెడిట్‌ దక్కింది. జస్ట్‌ ఆలోచించండి.. జోగిందర్‌ శర్మతో చివరి అనే నిర్ణయం బెడిసికొట్టి, పాక్‌పై ఫైనల్‌ ఓడిపోయి ఉంటే.. ధోనిపై విమర్శలు వచ్చేవి కావా? ఒక కెప్టెన్‌ నిర్ణయంతో ఓటమి వస్తే.. విమర్శలు వచ్చినప్పుడు.. గెలిస్తే ప్రశంసలు దక్కడంలో తప్పేముంది? అయినా.. ధోని ఏనాడు నా వల్లే గెలిచాం అని చెప్పుకున్న దాఖలాలు లేవు.

2011 అసలు సంగతి ఇది..

మన దేశంలో 2011లో జరిగిన వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచి.. ధోని కెప్టెన్సీలో టీమిండియా విశ్వవిజేతగా నిలిచింది. క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌, యువరాజ్‌ సింగ్‌, వీరేందర్‌ సెహ్వాగ్‌, గౌతమ్‌ గంభీర్‌, విరాట్‌ కోహ్లీ, జహీర్‌ ఖాన్‌, హర్బజన్‌ సింగ్‌.. అంతా అద్భుతంగా ఆడారు. జట్టు సమిష్టి కృషితోనే వరల్డ్‌ కప్‌ గెలిచాం. అందులో ఎలాంటి డౌట్‌ లేదు. యువీ క్యాన్సర్‌తో పోరాడుతూ టోర్నీ ఆడాడు, ఫైనల్‌ మ్యాచ్‌లో గంభీర్‌ 97 పరుగులతో మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడాడు. ఇప్పటికీ వాళ్ల ప్రస్తావన వస్తే.. 2011 వన్డే వరల్డ్‌ కప్‌లో వారి ప్రదర్శన గురించి మాట్లాడుకుంటూ ఉంటాం. అయినా కూడా వారికి క్రెడిట్‌ దక్కలేదని కొన్ని కామెంట్స్‌ వినిపిస్తూ ఉంటాయి. ఇక 97 పరుగులు చేసిన గంభీర్‌కు కాకుండా.. 91 రన్స్‌ కొట్టిన ధోనికి వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఇవ్వడం ఏంటని కూడా చాలా మంది ప్రశ్నిస్తారు? ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు ఎవరికి ఇవ్వాలనేది ధోని చేతుల్లో ఉండదు కదా? అలాగే యువీ ప్లేస్‌లో ముందుగా బ్యాటింగ్‌కు వెళ్లాడు కదా అంటారు? ఆ నిర్ణయం క్రికెట్‌ గాడ్‌ సచిన్‌ టెండూల్కర్‌ది అనే విషయం ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు. సచిన్‌, సెహ్వాగ్‌ వెంటవెంటనే అవుటైన తర్వాత.. గంభీర్‌-కోహ్లీ మంచి పార్ట్నర్‌షిప్‌ నెలకొల్పారు.

ఆ సమయంలో.. రైట్‌-లెఫ్ట్‌ కాంబినేషన్‌ కొనసాగించేందుకు.. గంభీర్‌ అవుటైతే యువీ, కోహ్లీ అవుటైతే ధోని బ్యాటింగ్‌కు వెళ్తే మంచిదని సచిన్‌ సూచించాడు. 20 ఏళ్ల కెరీర్‌, వందల మ్యాచ్‌లు, టన్నుల కొద్ది పరుగుల అనుభవం, అప్పటికే చాలా వరల్డ్‌ కప్‌ మ్యాచ్‌లు ఆడిన క్రికెట్‌ దేవుడు సచిన్‌ టెండూల్కర్‌, వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఒక విలువైన సలహా ఇస్తే.. దానికి అనుగుణంగా.. కోహ్లీ అవుట్‌ అవ్వడంతో లెఫ్ట్‌ రైట్‌ బ్యాటింగ్‌ కాంబినేషన్‌ కోసం ధోని, యువీ కంటే ముందుగా బ్యాటింగ్‌కి వచ్చాడు. ఇందులో ధోని తప్పేముంది? దేశం గెలవాలనే తపన తప్పా.. వ్యక్తిగత స్వార్థం ఎక్కడ కనిపిస్తుంది. కోహ్లీ అవుటైన తర్వాత బ్యాటింగ్‌కు వెళ్లి.. పిచ్‌ పరిస్థితులను అర్థం చేసుకొని చివరి వరకు ధోని ఆడాడు కాబట్టి అతనికి క్రెడిట్‌ దక్కింది. ఒక వేళ ధోని కూడా వెంటనే అవుట్‌ అయి ఉంటే.. సచిన్‌ చెబితే వెళ్లాడు కదా అని అతన్ని విమర్శించకుండా ఉండేవాళ్లా? లేదు కదా? మరి బాగా ఆడిన తర్వాత ప్రశంసలు దక్కింతే ఎందుకు తప్పుబట్టాలి?

అయినా.. వన్డే వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్ తర్వాత ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు అందుకున్న ధోని మాటలు వింటే.. అతను నిజంగానే క్రెడిట్‌ దొబ్బేసే టైపా? కాదా? అనేది అర్థం చేసుకోవచ్చు. అవార్డు అందుకున్న తర్వాత ధోని మాట్లాడుతూ.. ‘మేము ఆరంభంలో వికెట్లు కోల్పోయి ఇబ్బందుల్లో పడ్డాం.. విరాట్‌ కోహ్లీ-గౌతమ్‌ గంభీర్‌ అద్భుతమైన పార్ట్నర్‌షిప్‌తో మ్యాచ్‌ను కాపాడారు. ఆ తర్వాత మేం మ్యాచ్‌పై పట్టు సాధించాం. గ్రౌండ్‌లో డ్యూ కూడా కలిసి రావడంతో స్పిన్నర్లను టార్గెట్‌ చేసి ఆడాం’ అని అన్నాడు. గంభీర్‌-కోహ్లీకి ఇవ్వాల్సిన క్రెడిట్‌ ఇచ్చాడు.. కానీ, తాను కూడా బాగా ఆడాను.. వాళ్లిద్దరి తర్వాత నేను ఫినిష్‌ చేశానని ఎక్కడా చెప్పుకోలేదు. ఆ తర్వాత 2013లో ధోని కెప్టెన్సీలోనే టీమిండియా ఛాంపియన్స్‌ ట్రోఫీ కూడా గెలిచింది. భారత్‌కు మూడు ఐసీసీ ట్రోఫీలు అందించిన కెప్టెన్‌గా ధోని చరిత్ర సృష్టించాడు. ఓ సారి ఓ ఫ్యాన్‌.. ‘మూడు ఐసీసీ ట్రోఫీలు అందించారు థ్యాంక్యూ’ అని అంటే, ‘లేదు.. లేదు.. ఇందంతా టీమ్‌ ఎఫర్ట్‌’ అని కెమెరాల ముందు చెప్పాడు. నిజంగానే క్రెడిట్‌ దొబ్బేసే వ్యక్తి అయి ఉంటే.. అలా అనేవాడు కాదు.

స్టార్‌ క్రికెటర్ల కెరీర్లు..

2011లో వన్డే వరల్డ్‌ కప్‌ గెలిచిన జట్టు.. ఆ తర్వాత కలిసి ఎక్కువ మ్యాచ్‌లు ఆడలేదు. యువరాజ్‌ సింగ్‌.. వరల్డ్‌ కప్‌ టోర్నీ తర్వాత క్యాన్సర్‌తో జట్టుకు దూరం అయ్యాడు. ఆ తర్వాత క్యాన్సర్‌ను జయించి.. తిరిగి టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చినా.. మునుపటి ప్రదర్శన చూపించలేక 2017లో టీమిండియా తరఫున చివరి మ్యాచ్‌ ఆడాడు. అలాగే వీరేందర్‌ సెహ్వాగ్‌ 2013లో తన చివరి వన్డే మ్యాచ్‌ ఆడాడు. వన్డే వరల్డ్‌ కప్‌లో అద్భుత ప్రదర్శన కనబర్చిన జహీర్‌ ఖాన్‌ 2012లో తన చివరి వన్డే మ్యాచ్‌ ఆడేశాడు. గౌతమ్‌ గంభీర్‌ 2013లో టీమిండియా తరఫున చివరి వన్డే ఆడాడు. హార్భజన్‌ సింగ్‌ 2015 వరకు టీమ్‌లో ఉన్నాడు. కానీ, వరల్డ్‌ కప్‌ గెలిచిన ఒక సూపర్‌ టీమ్‌ మరింత కాలం ఎందుకు కొనసాగలేకపోయిందనే విమర్శలు తీవ్రంగానే ఉన్నాయి.

ఈ విషయంలో కెప్టెన్‌గా ఉన్న ధోనిపైనే ఎక్కువ ఆరోపణలు ఉన్నాయి. ఫిట్‌నెస్‌ పేరుతో.. సెహ్వాగ్‌, గంభీర్‌, జహీర్‌ ఖాన్‌లను జట్టు నుంచి తప్పించాడనే ఆరోపణలు ఉన్నాయి. వీటిని పూర్తిగా కొట్టేయడానికి కూడా లేదు. ఎందుకంటే.. ఒక కెప్టెన్‌గా తనకు ఎలాంటి జట్టు కావాలో నిర్ణయించుకునే హక్కు, బాధ్యత రెండూ ధోనికి ఉంటాయి. ఆ క్రమంలోనే తన టీమ్‌ ఫిట్‌గా ఉండాలని భావించిన ధోని.. సీనియర్లను సైతం పక్కనపెట్టాడు. ఆ కారణంతో.. ఎంతో అద్భుతమైన క్రికెటర్లు యువీ, సెహ్వాగ్‌, గంభీర్‌, జహీర్‌ ఖాన్‌లను సరైన వీడ్కోలు లేకుండా చేశాడని చాలా మంది ధోనిని విమర్శిస్తారు. అందులో ఎంతో కొంత నిజం లేకపోలేదు. కెరీర్‌ చివర్లో ఉన్న ఈ ముగ్గురు ఆటగాళ్ల విషయంలో ధోని కాస్త ఉదాసీనంగా వ్యవహరించి ఉంటే.. వారికి మంచి రిటైర్మెంట్‌ లభించి ఉండేది. అయితే.. ఇందులో ధోని ఒక్కడినే తప్పు పట్టడం కూడా కరెక్ట్‌ కాదు. టీమ్‌ మేనేజ్‌మెంట్‌, బీసీసీఐ కూడా.. ఈ నిర్ణయంలో భాగమే.

కొంత మంది స్టార్‌ క్రికెటర్లకు సరైన ఫేవరెల్‌ లేకుండా చేశాడనే తప్పితే.. ధోని క్రెడిట్‌ స్టెల్లర్‌ అనేది మాత్రం ముమ్మాటికి తప్పు. అతను ఏనాడు.. తన వల్లే టీమిండియా మూడు కప్పులు గెలిచిందని చెప్పుకోలేదు. అదంతా.. మీడియా, అభిమానుల సృష్టి మాత్రమే. క్రికెట్‌ను పిచ్చిగా ప్రేమించే మన దేశంలో.. ఓ క్రికెటర్‌ వరుసగా సక్సెస్‌ అవుతూ ఉంటే.. అతనిపై అభిమానం హద్దులు దాటడం, సాధించిన దాని కంటే ఎక్కువ ప్రశంస కురవడం సాధారణం. దానికి ధోనిని తప్పుబట్టడం అవివేకం అవుతుంది. జట్టు ఎంత అద్భుతంగా ఉన్నా.. సరైన కెప్టెన్‌ కూడా అవసరమే. ధోని ఒక గొప్ప కెప్టెన్‌ అందులో డౌట్‌ లేదు. 2007, 2013 మధ్య కేవలం 6 ఏళ్లలో మూడు ప్రతిష్టాత్మక ఐసీసీ ట్రోఫీలు అందించిన గ్రేట్‌ ఇండియన్‌ కెప్టెన్‌. ఇది సాధించేందుకు అతనికి అద్భుతమైన టీమ్‌ కూడా దొరికింది.. అది అతని అదృష్టం. టీమ్‌ బాగుంది కాబట్టే కప్పులు కొట్టాడు అంటే.. తప్పు. టీమ్‌ బాగుంది, మంచి కెప్టెన్‌గా ధోని తోడయ్యాడు. అందుకే టీమిండియా ఛాంపియన్‌ అయింది. మరి సీనియర్ల విషయంలో చిన్న తప్పులతో పాటు.. మూడు కప్పులు అందించిన మహేంద్ర సింగ్‌ ధోని గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.