CSK టీమ్ బలం, బలహీనతలు! ఈ సారి కూడా కప్పు ధోనిదేనా?

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్-2024కి రెడీ అవుతోంది. మరో కప్పుపై కన్నేసింది ధోని సేన. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ ఐపీఎల్-2024కి రెడీ అవుతోంది. మరో కప్పుపై కన్నేసింది ధోని సేన. ఈ నేపథ్యంలో ఆ జట్టు బలాబలాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

ఐపీఎల్ జాతర మొదలయ్యేందుకు మరో రెండ్రోజుల టైమ్ మాత్రమే మిగిలి ఉంది. దీంతో అందరూ ఏ టీమ్ బలంగా ఉంది? ఏ జట్టు ఎంత వరకు వెళ్లగలదు? ఏయే ప్లేయర్లు రాణిస్తారు? అంటూ రకరకాల విషయాలు తెలుసుకునే పనిలో పడ్డారు. అందరూ ఎక్కువగా సెర్చ్ చేస్తోంది మాత్రం చెన్నై సూపర్ కింగ్స్ గురించే. డిఫెండింగ్ ఛాంపియన్స్​ అయిన సీఎస్​కే ఈసారి కూడా కప్పు కొడుతుందా అని చర్చించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ధోని సేన బలాబలాలు, గత రికార్డులు, విజయావకాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

బలం

సీఎస్​కే అతిపెద్ద బలం కెప్టెన్ ధోని. గెలుపు ఆనుపాలు మాహీకి తెలిసినంతగా మరెవరికీ తెలియదనే చెప్పాలి. ఇంటర్నేషనల్ క్రికెట్ నుంచి ఐపీఎల్ వరకు సుదీర్ఘ కాలం నాయకత్వ బాధ్యతలు చేపడుతూ వచ్చిన ఆ లెజెండరీ క్రికెటర్ వికెట్ల వెనుక ఉండి టీమ్​ను సమర్థంగా నడిపించడం చెన్నైకి ఉన్న బిగ్‌ స్ట్రెంగ్త్. రుతురాజ్ గైక్వాడ్, అజింక్యా రహానె, రచిన్ రవీంద్ర, శివమ్ దూబె, రవీంద్ర జడేజా, ధోని, మెయిన్ అలీతో ఆ టీమ్ బ్యాటింగ్ యూనిట్ దుర్భేద్యంగా ఉంది. ఓపెనర్లుగా రుతురాజ్-రహానె లేదా రుతురాజ్-రచిన్ జోడీ దిగొచ్చు. ఏ పెయిర్ దిగినా అదరగొట్టడం పక్కాగా కనిపిస్తోంది. సీఎస్​కే తమ హోమ్ గ్రౌండ్​లో 7 మ్యాచులు ఆడుతుంది. టర్న్​కు సహకరించే చెన్నై పిచ్​పై ప్రత్యర్థులను తిప్పేయడానికి జడేజా, మిచెల్ శాంట్నర్, మొయిన్ రూపంలో ముగ్గురు వరల్డ్ క్లాస్ స్పిన్నర్లు ఉండటం కూడా ఆ టీమ్​కు కలిసొచ్చే అంశం.

బలహీనతలు

ఓవరాల్​గా చూస్తే సీఎస్​కే పేపర్ మీద చాలా బలమైన జట్టుగా కనిపిస్తోంది. కానీ లోతుగా పరిశీలిస్తే కొన్ని నెగెటివ్స్ ఉన్నాయి. గత సీజన్​లో అదరగొట్టిన లంక పేస్ సంచలనం మతీష పతిరానా గాయం కారణంగా ఈ సీజన్​కు దూరమయ్యాడు. అతడి రికవరీ, కమ్​బ్యాక్ గురించి ఎలాంటి క్లారిటీ లేదు. డెత్ ఓవర్స్ స్పెషలిస్ట్​ అయిన పతిరానా లేని లోటు తప్పకుండా సీఎస్​కేను ఇబ్బంది పెడుతుంది. దీపక్ చాహర్, తుషార్ పాండే మిడిల్ ఓవర్లలో ఎక్కువ రన్స్ లీక్ చేయడం కూడా మైనస్​ పాయింట్ అనే చెప్పాలి. డెవాన్ కాన్వే రూపంలో మరో క్వాలిటీ ప్లేయర్ దూరమవడం చెన్నైకి పెద్ద సమస్యగా మారింది. గత సీజన్​లో 16 మ్యాచుల్లో 672 పరుగులు చేశాడు కాన్వే. ఆ సీజన్​లో రుతురాజ్​తో కలసి అద్భుతమైన ఆరంభాలు అందిస్తూ.. చెన్నై విన్నర్​గా నిలవడంతో కీలక పాత్ర పోషించాడు. అలాంటోడు ఈసారి మిస్సవడంతో చెన్నైకి ఎటూ పాలుపోవడం లేదు.

గత రికార్డులు

ఐపీఎల్​లో అత్యధిక సార్లు కప్ గెలిచిన జట్టుగా ముంబై ఇండియన్స్​తో కలసి చెన్నై (5 సార్లు) ఫస్ట్ ప్లేసులో ఉంది. దీన్ని బట్టే క్యాష్ రిచ్ లీగ్​లో ఆ టీమ్ ట్రాక్ రికార్డు ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఈ ఐదు సార్లు కూడా ధోనీనే సారథిగా ముందుండి టీమ్​ను నడిపించాడు. గత సీజన్​లో టైటిల్​ను గెలుచుకున్న సీఎస్​కే.. అంతకుముందు ఏడాది మాత్రం లీగ్​లో 9వ స్థానంతో సరిపెట్టుకుంది. ఇక, 2021లో ఛాంపియన్​గా నిలిచింది.

విజయావకాశాలు

సీఎస్​కే బలాబలాలు, గత రికార్డులు దృష్టిలో ఉంచుకొని చూస్తే ఆ జట్టు ఈసారి కూడా మ్యాజిక్ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. ప్లేఆఫ్స్​కు వెళ్లకుండా ధోని సేనను ఎవరూ ఆపలేరు. అయితే ఫైనల్స్​కు క్వాలిఫై అవ్వాలన్నా, కప్పు కొట్టాలన్నా ధోని మాస్టర్ మైండ్​తో పాటు మిగిలిన ప్లేయర్లు కూడా కంబైన్ ఎఫర్ట్ పెట్టాల్సి ఉంటుంది. ఒకవేళ అందరూ సమష్టిగా ఆడితే మాహీ సేన మరో కప్పు ఎగరేసుకుపోయినా ఆశ్చర్యపోవాల్సిన పనిలేదు.

ఇదీ చదవండి: IPL 2024: SRH నిర్ణయానికి అశ్విన్ షాక్! కావ్యా ఇంత బ్యాడ్ గా ఆలోచించిందా?

Show comments