iDreamPost
android-app
ios-app

5 వికెట్లతో సత్తా చాటిన అశ్విన్! రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు

  • Published Jul 13, 2023 | 10:20 AM Updated Updated Jul 13, 2023 | 10:20 AM
  • Published Jul 13, 2023 | 10:20 AMUpdated Jul 13, 2023 | 10:20 AM
5 వికెట్లతో సత్తా చాటిన అశ్విన్! రోహిత్ శర్మపై తీవ్ర విమర్శలు

రవిచంద్రన్ అశ్విన్.. టీమిండియాలో స్టార్ అండ్ సీనియర్ ప్లేయర్. తన స్పిన్ మాయాజాలంతో అనేక మ్యాచుల్లో టీమ్‌కు విజయాలు అందించాడు. అప్పుడప్పుడు బ్యాట్‌తోనూ సత్తాచాటాడు. తాజాగా వెస్టిండీస్‌తో ప్రారంభమైన తొలి టెస్టు తొలి రోజే అద్భుత ప్రదర్శన కనబర్చాడు. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన విండీస్ జట్టును తన స్పిన్ మ్యాజిక్‌తో కట్టిపడేశాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు పడగొట్టి.. వెస్టిండీస్ పతనాన్ని శాసించడమే కాకుండా.. మొత్తం ఐదు వికెట్లతో చెలరేగాడు. విండీస్ బ్యాటర్లకు ఏ మాత్రం అవకాశం ఇవ్వకుండా కేవలం 150 పరుగులకే కట్టడి చేశాడు.

తొలి టెస్టు ఆరంభంలోనే అశ్విన్ బౌలింగ్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. సూపర్ బౌలింగ్‌తో ఐదు వికెట్ల హాల్ సాధించడంతో అశ్విన్ టాక్ ఆఫ్ ది క్రికెట్ టౌన్‌గా మారిపోయాడు. అయితే ఇదే సమయంలో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ తీవ్ర స్థాయిలో విమర్శల వర్షం కురుస్తోంది. అశ్విన్ బాగా ఆడితే రోహిత్‌పై విమర్శలు ఎందుకు వస్తున్నాయని అనుకుంటున్నారా? అయితే.. నెల రోజుల క్రితం ఏం జరిగిందో గుర్తు తెచ్చుకోండి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్ మ్యాచ్‌లో టీమిండియా ఘోర ఓటమిని చవిచూసింది. ప్రతిష్టాత్మక డబ్ల్యూటీసీ ఫైనల్‌లో వరుసగా రెండో సారి కూడా ప్రవేశించిన భారత్.. మళ్లీ ఓటమినే చవిచూసింది. 2021లో కోహ్లీ కెప్టెన్సీలో న్యూజిలాండ్ చేతిలో ఓడిన టీమిండియా.. మళ్లీ 2023లో ఆసీస్ చేతుల్లో పరాజయం పాలైంది.

ఫైనల్లో బ్యాటింగ్, బౌలింగ్ రెండో విభాగాల్లోనూ టీమిండియా విఫలమైంది. కాగా, ప్రస్తుతం వెస్టిండీస్‌తో తొలి టెస్టు ప్రారంభం కాగానే డబ్ల్యూటీసీ ఓటమికి రోహిత్ శర్మనే కారణం అంటూ క్రికెట్ అభిమానులు ఇప్పుడు విమర్శలు చేస్తున్నారు. అందుకు కారణం.. డబ్ల్యూటీసీ ఫైనల్‌లో అశ్విన్‌ను పక్కనపెట్టడమే. వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బౌలర్‌ను.. డబ్ల్యూటీసీ ఫైనల్ ‌మ్యాచ్‌లో పక్కనపెట్టి ఎంత పెద్ద తప్పుచేసిందో ఇప్పుడు అర్థమవుతుందని భారత క్రికెట్ ఫ్యాన్స్ అంటున్నారు. కెప్టెన్ రోహిత్ శర్మ అనాలోచితంగా తీసుకున్న నిర్ణయం.. టీమిండియాకు టెస్ట్ ఛాంపియన్ షిప్ ట్రోఫీని దూరం చేసిందని ఆరోపిస్తున్నారు. ప్రపంచ నంబర్ వన్ బౌలర్‌ను బెంచ్‌పైన ఎవరైనా కూర్చోబెడతారా? అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. తనను పక్కన పెట్టినా.. తానేంటో వెస్టిండీస్‌పై నెల వ్యవధిలోనే అశ్విన్ నిరూపించుకున్నాడని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: విండీస్ ‘బాహుబలి’ని చూసి డ్యాన్స్ చేసిన గిల్! వైరల్ వీడియో