కరీబియన్ దీవుల పర్యటనను టీమిండియా నిరాశతో ముగించింది. వెస్టిండీస్ జట్టుతో ఫ్లోరిడా వేదికగా జరిగిన నిర్ణయాత్మక ఆఖరి టీ20లో 8 వికెట్ల తేడాతో భారత్ ఓటమిపాలైంది. కీలకమైన మ్యాచ్‌లో ఓటమితో ఈ సిరీస్‌ను విండీస్‌కు అప్పగించేసింది. 2016 అనంతరం ఒక ద్వైపాక్షిక టీ20 సిరీస్‌లో వెస్టిండీస్ చేతిలో టీమిండియా ఓడిపోవడం ఇదే ఫస్ట్ టైమ్. ఈ మ్యాచ్‌లో బ్యాటింగ్‌లో కాస్త ఫర్వాలేదనిపించిన హార్దిక్ సేన.. బౌలింగ్‌లో పూర్తిగా చేతులెత్తేసింది. బ్యాటింగ్‌కు బాగా అనుకూలిస్తున్న పిచ్ మీద సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ మినహా మిగతావారు తేలిపోయారు.
ఐదో టీ20లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 165 రన్స్ చేసింది. మన జట్టు బ్యాటర్లలో సూర్యకుమార్ మరోమారు అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. 45 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సులతో 61 రన్స్ చేశాడు. మిస్టర్ 360తో పాటు తిలక్ వర్మ (27) కూడా రాణించాడు. బ్యాటింగ్‌లో ఎలాగోలా నెట్టుకొచ్చిన భారత్.. బౌలింగ్‌లోనైతే దారుణ ప్రదర్శన చేసింది. వెస్టిండీస్ స్టార్ బ్యాటర్లు బ్రాండన్ కింగ్ (85 నాటౌట్), నికోలస్ పూరన్ (47) టీమిండియా బౌలర్లను ఊచకోత కోశారు. వీరి ధాటికి ఆతిథ్య జట్టు 18 ఓవర్లలో 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 171 రన్స్ చేసి మ్యాచ్‌ను గెలవడంతో పాటు సిరీస్‌ను కైవసం చేసుకుంది.
భారత్‌పై చారిత్రాత్మక సిరీస్ విజయం సాధించిన వెస్టిండీస్‌పై ప్రశంసల వర్షం కురుస్తోంది. విండీస్ ఈజ్ బ్యాక్ అని ఆ టీమ్ ఫ్యాన్స్ అంటున్నారు. ఇదిలా ఉంటే.. చివరి టీ20 మ్యాచ్‌లో అద్భుతమైన ఇన్నింగ్స్‌తో వెస్టిండీస్‌ను గెలిపించిన నికోలస్ పూరన్ (47) గాయాలపాలయ్యాడు. సహచర బ్యాట్స్‌మెన్ బ్రాండన్ కింగ్ కొట్టిన ఒక షాట్ పూరన్ ఎడమ చేతికి తగిలింది. భారత బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ వేసిన మరో బాల్ అతడి పొట్టకు తాకింది. దీంతో పూరన్ పొట్ట మీద, ఎడమ చేతి పైన గాయాలయ్యాయి. గాయాలు బాధపెడుతున్నా అతడు కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడం ప్రశంసనీయం అని వెస్టిండీస్ ఫ్యాన్స్ అంటున్నారు.
The shot of Brandon King which hit Nicholas Pooran’s hand and the delivery from Arshdeep Singh which hit Pooran on the stomach. pic.twitter.com/t6Qx7B4lfp
— Mufaddal Vohra (@mufaddal_vohra) August 14, 2023