ఈ విజయానికి వాళ్లే కారణం! వారికి నా సెల్యూట్‌: రోహిత్‌ శర్మ

  • Author singhj Updated - 09:55 AM, Tue - 12 September 23
  • Author singhj Updated - 09:55 AM, Tue - 12 September 23
ఈ విజయానికి వాళ్లే కారణం! వారికి నా సెల్యూట్‌: రోహిత్‌ శర్మ

ఎట్టకేలకు భారత్-పాకిస్థాన్ మధ్య పూర్తి మ్యాచ్ చూడాలనుకున్న అభిమానుల కల తీరింది. లీగ్ దశలో పాక్ కొంచెం కంగారు పెట్టింది కానీ.. సూపర్-4 దశలో మాత్రం టీమిండియా ధాటికి కుదేలైపోయింది. భారత్ 228 రన్స్​తో గెలిచిందంటేనే దాయాది ఎంతటి ఘోర పరాభవం చవిచూసిందో అర్థమైపోతుంది. వాన వల్ల రెండ్రోజుల పాటు సాగిన మ్యాచ్​లో ఆద్యంతం ఇండియాదే ఆధిపత్యం. బ్యాటింగ్​లో ఓపెనర్లు శుబ్​మన్ గిల్, రోహిత్ శర్మ హాఫ్ సెంచరీలు బాదితే.. తర్వాత వచ్చిన విరాట్ కోహ్లీ (122 నాటౌట్), కేఎల్ రాహుల్ (111 నాటౌట్) శతక మోత మోగించారు. బౌలింగ్​లోనూ భారత్ జోరుకు ప్రత్యర్థి నిలబడలేకపోయింది.

పాకిస్థాన్ ఇన్నింగ్స్​లో ఒక్కరూ 30కి మించి స్కోరు చేయలేదు. ఒక్క 50 పరుగుల భాగస్వామ్యమూ లేదు. మొత్తంగా కొలంబోలో భారత జట్టుకు పాక్ నుంచి కనీస పోటీ కూడా ఎదురుకాలేదు. దాయాదిని చిత్తుగా ఓడించి మంగళవారం ఆతిథ్య శ్రీలంకతో పోరుకు రెడీ అయింది రోహిత్ సేన. పాక్​తో మ్యాచ్ అనంతరం హిట్​మ్యాన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మ్యాచ్​ కోసం ఎంతగానో కష్టపడిన గ్రౌండ్స్​మెన్​పై ప్రశంసల జల్లులు కురిపించాడు. వాళ్లు తీవ్రంగా కష్టపడటంతోనే మ్యాచ్ సాధ్యమైందని తెలిపాడు రోహిత్. ఈ మ్యాచ్​లో ఎక్కువగా క్రీజులో గడపాలని భావించామని.. అనుకున్నట్లుగానే సమయం తీసుకొని చెలరేగామన్నాడు.

‘ఈ మ్యాచ్​ జరిగిందంటే కేవలం గ్రౌండ్స్​మెన్ వల్లే. కవర్లు కప్పుతూ, తీయడం ఎంత కష్టమో నాకు తెలుసు. ఈ మ్యాచ్ కోసం మైదాన సిబ్బంది రెండ్రోజులు తీవ్రంగా కష్టపడ్డారు. మా టీమ్ తరఫున వాళ్లందరికీ కృతజ్ఞతలు. ఒకవిధంగా చెప్పాలంటే.. వాళ్ల వల్లే మాకు విజయం దక్కింది. మా బ్యాటింగ్ యూనిట్ దుమ్మురేపింది. మ్యాచ్ స్టార్టింగ్ నుంచే పాక్ బౌలర్లపై చెలరేగి ఆడాం. మేం ఇచ్చిన అద్భుతమైన ఆరంభాన్ని కోహ్లీ, రాహుల్ భారీ స్కోర్​గా మలిచారు. మ్యాచ్​ మొదలవ్వడానికి 5 నిమిషాల ముందు టీమ్​లోకి వచ్చిన రాహుల్.. ఇలా సెంచరీతో చెలరేగడం అద్భుతం. బుమ్రా బాగా బౌలింగ్ చేశాడు. బాల్​ను రెండు వైపులా స్వింగ్ చేశాడు. అతడి లాంటి బౌలర్ తరచూ జట్టుకు దూరమవ్వడం ఏమాత్రం మంచిది కాదు’ అని రోహిత్ చెప్పుకొచ్చాడు.

ఇదీ చదవండి: VIDEO: గూస్​బమ్స్ తెప్పించే షాట్ మళ్లీ ఆడిన కోహ్లీ!

Show comments