ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌లకు వరల్డ్ వైడ్‌గా ఫుల్ క్రేజ్ ఉంటుంది. ఈ రెండు టీమ్స్ ఎప్పుడు తలపడతాయా అని అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. ఈ దాయాది దేశాలు మరోమారు క్రికెట్ ఫ్యాన్స్‌ను అలరించేందుకు సిద్ధమవుతున్నాయి. ప్రతిష్టాత్మక ఆసియా కప్ 2023లో భాగంగా భారత్, పాక్ మ్యాచ్ సెప్టెంబర్ 2వ తేదీ (శనివారం) నాడు జరగనుంది. ఈ కప్‌లో ఇప్పటిదాకా ఈ చిరకాల ప్రత్యర్థుల మధ్య 17 మ్యాచ్‌లు జరిగాయి. ఇందులో 3 మ్యాచ్‌లు టీ20 ఫార్మాట్లో జరిగాయి. గత దశాబ్ద కాలంలో చూసుకుంటే ఆసియా కప్‌లో టీమిండియాదే ఆధిపత్యమని చెప్పాలి.
ఆసియా కప్‌లో 2010 నుంచి 2022 వరకు భారత్, పాక్ జట్లు ఎనిమిదిసార్లు తలపడ్డాయి. ఇందులో టీమిండియా ఏకంగా 6 సార్లు విజయం సాధించి తిరుగులేని ఆధిపత్యాన్ని చలాయించింది. గతేడాది చూసుకుంటే.. టీ20 ఫార్మాట్లో జరిగిన టోర్నమెంట్లో భారత్ గ్రూప్ దశలో పాక్‌పై గెలుపొందింది. కానీ వారం రోజుల వ్యవధిలో జరిగిన సూపర్-4 దశ మ్యాచ్‌లో 181 రన్స్ చేసినా దాయాది చేతిలో భారత్‌కు పరాభవం తప్పలేదు. దీనికి బదులు తీర్చుకోవాలని భావిస్తోంది టీమిండియా. అయితే ముగ్గురు పాక్ ప్లేయర్లతో భారత్ జాగ్రత్తగా ఉండాలని ఆస్ట్రేలియా లెజెండ్ మాథ్యూ హేడెన్ అంటున్నాడు.
ఆసియా కప్-2023లో భారత్ తమ తొలి మ్యాచ్‌లో పాకిస్థాన్‌పై తప్పక విజయం సాధిస్తుందని హేడెన్ అన్నాడు. అయితే పాక్ పేస్ దళాన్ని టీమిండియా బ్యాటర్లు సమర్థంగా ఎదుర్కోవాలని.. లేకపోతే భారత్ పని అయిపోయినట్లేనని హెచ్చరించాడు. ‘భూమ్మీద అత్యంత ఆసక్తికర మ్యాచ్ ఇది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే పాక్ పేస్ త్రయం విషయంలో భారత్ చాలా జాగ్రత్తగా ఉండాలి. షాహిన్ అఫ్రిదీ, హ్యారిస్ రవూఫ్, నసీం షాలు భిన్నరకాల వైవిధ్యం కలిగిన బౌలర్లు. వీళ్లు ఇప్పటికే భారత బ్యాటర్ల కోసం వ్యూహాలు రెడీ చేసుకొని ఉంటారు’ అని హేడెన్ చెప్పుకొచ్చాడు.
భారత్, పాకిస్థాన్ మ్యాచ్‌కు ఆతిథ్యం ఇస్తున్న క్యాండీలో బౌన్సీ వికెట్‌కు ఆస్కారం ఉందని హేడెన్ తెలిపాడు. కాబట్టి ప్రత్యర్థి జట్టు పేసర్ల విషయంలో భారత్ జాగ్రత్తగా ఉండాలని అన్నాడు. ముఖ్యంగా హ్యారిస్ రవూఫ్ విషయంలో కేర్‌ఫుల్‌గా ఉండాలని సూచించాడు. ఒక్కసారి పట్టు దొరికితే టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్‌ను కకావికలం చేసే సత్తా అతడికి ఉందన్నాడు. ఆరంభంలోనే వికెట్లు తీయడంలో స్పెషలిస్ట్ అయిన షాహిన్ అఫ్రిదీతో రోహిత్ శర్మ జాగ్రత్తగా ఉండాలని సూచించాడు హేడెన్. గత వరల్డ్ కప్‌లో రోహిత్‌ను అతడు ఔట్ చేశాడని గుర్తుచేశాడు. షాహిన్‌తో పాటు మిగిలిన పేసర్లను ఎదుర్కోవడం పైనే రోహిత్ సేన విజయం దాగి ఉందన్నాడు.
ఇదీ చదవండి: 2011 తర్వాత ఇదే స్ట్రాంగ్ టీమ్: రవిశాస్త్రి