IND vs BAN: తొలి టెస్ట్‌లో కుప్పకూలిన టీమిండియా టాపార్డర్‌! రోహిత్‌, కోహ్లీ సైతం..

IND vs BAN, Rohit Sharma, Virat Kohli, Hasan Mahmud: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో టీమిండియా టాపార్డర్‌ కుప్పకూలింది. మరి ఎవరెవరు ఎలా అవుటయ్యారు.. ఎంత కొట్టి అవుట్‌ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs BAN, Rohit Sharma, Virat Kohli, Hasan Mahmud: బంగ్లాదేశ్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌ ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో టీమిండియా టాపార్డర్‌ కుప్పకూలింది. మరి ఎవరెవరు ఎలా అవుటయ్యారు.. ఎంత కొట్టి అవుట్‌ అయ్యారో ఇప్పుడు తెలుసుకుందాం..

చాలా కాలం తర్వాత గ్రౌండ్‌లోకి దిగిన టీమిండియాకు బంగ్లాదేశ్‌ పొద్దుపొద్దున్నే ఊహించని షాకిచ్చింది. బంగ్లా బౌలర్‌ హసన్‌ మహమూద్‌ దెబ్బకు టీమిండియా టాపార్డర్‌ కుప్పకూలింది. రెండు టెస్టులు, మూడు టీ20 మ్యాచ్‌ల సిరీస్‌ ఆడేందుకు బంగ్లాదేశ్‌ జట్టు భారత పర్యటనకు వచ్చిన విషయం తెలిసిందే. చెన్నైలోని చెపాక్‌ స్టేడియం వేదికగా తొలి టెస్ట్‌ గురువారం ప్రారంభమైంది. టాస్‌ గెలిచిన బంగ్లాదేశ్‌ టీమ్‌ తొలుత బౌలింగ్‌ చేసేందుకు నిర్ణయించింది. దీంతో.. రోహిత్‌ సేన తొలుత బ్యాటింగ్‌కు దిగింది. యువ ఓపెనర్‌ యశస్వి జైస్వాల్‌తో కలిసి టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ శర్మ టీమిండియా ఇన్నింగ్స్‌ను ఆరంభించాడు. స్పిన్‌కు అనుకూలించే పిచ్‌ ఆరంభంలో కాస్త పేస్‌ బౌలర్లకు అనుకూలంగా ఉండటంతో ఇద్దరు ఓపెనర్లు ఆచితూచి ఆడారు.

కానీ, బంగ్లా యువ బౌలర్‌ హసన్‌ అద్భుతమైన బౌలింగ్‌తో చెలరేగాడు. ఇన్నింగ్స్‌ 6వ ఓవర్‌ తొలి బంతికే రోహిత్‌ శర్మను అవుట్‌ చేశాడు. సీమ్‌ అయిన గుడ్‌లెంత్‌ డెలవరీకి రోహిత్‌ శర్మ 18 బంతుల్లో 6 పరుగులు స్లిప్‌లో షాంటోకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌ చేశారు. ఆ తర్వాత వన్‌ డౌన్‌లో వచ్చిన శుబ్‌మన్‌ గిల్‌ 8వ ఓవర్‌ మూడో బంతికి హసన్‌ బౌలింగ్‌లోనే వికెట్‌ కీపర్‌ లిట్టన్‌ దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు. డౌన్‌ది లెగ్‌ సైడ్‌ పడిన బంతిని ఆడబోయి కీపర్‌ క్యాచ్‌గా డకౌట్‌ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన విరాట్‌ కోహ్లీ.. అవుట్‌ సైడ్‌ ది ఆఫ్‌ స్టంఫ్‌ బంతులు ఆడే తన వీక్‌నెస్‌ను మరోసారి బయటపెట్టుకున్నాడు. ఇన్నింగ్స్‌ 10వ ఓవర్‌ రెండో బంతికి హసన్‌ బౌలింగ్‌లో వికెట్‌కీపర్‌ లిట్టన్‌ దాస్‌కు క్యాచ్‌ ఇచ్చి అవుట్‌ అయ్యాడు.

6 బంతుల్లో 6 పరుగులు చేసి అవుట్‌ అయ్యాడు కోహ్లీ. కేవలం 34 పరుగులకే టీమిండియా మూడు కీలక వికెట్లు కోల్పోయింది. ఆ మూడు వికెట్లలో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లీ లాంటి దిగ్గజ క్రికెటర్లు ఉండటం టీమిండియాకు తీవ్ర నష్టం కలిగించే అంశం. ప్రస్తుతం యశస్వి జైస్వాల్‌, రిషభ్‌ పంత్‌ క్రీజ్‌లో ఉన్నారు. జైస్వాల్‌ 41 బంతుల్లో 24 పరుగులు చేసి నిలకడగా ఆడుతున్నాడు. వెంటవెంటనే మూడు వికెట్లు పడడంతో పంత్‌ కాస్త జాగ్రత్తగా బ్యాటింగ్‌ చేస్తున్నాడు. మరి కోహ్లీ, రోహిత్‌ విఫలమైన పిచ్‌పై టీమిండియా మిగతా ఆటగాళ్లు ఏ మేర రాణిస్తారో చూడాలి.

Show comments