పోర్ట్ ఆఫ్ స్పెయిన్ వేదికగా టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టు మరింత రసవత్తరంగా మారింది. గత రెండ్రోజులు ఆటకు వర్షం అంతరాయం కలిగించడంతో ఈ మ్యాచ్ రసకందాయంలో పడింది. నాలుగో రోజు ఆటలో విండీస్ తమ తొలి ఇన్నింగ్స్‌లో 255 రన్స్‌కు ఆలౌట్ అయింది. ఆ తర్వాత తమ రెండో ఇన్నింగ్స్‌ను మొదలుపెట్టిన భారత్.. 2 వికెట్లకు 181 రన్స్ వద్ద ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. దీంతో ఆతిథ్య కరీబియన్ టీమ్ ముందు 365 పరుగుల భారీ లక్ష్యాన్ని నిలిపింది. అయితే ఛేజింగ్‌కు దిగిన ఆ టీమ్‌ను స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కోలుకోలేని దెబ్బ కొట్టాడు.
క్రీజులో కుదురుకున్నట్లే కనిపించిన ఓపెనర్ క్రెయిగ్ బ్రాత్‌వైట్ (28)తో పాటు కిర్క్ మెకంజీని స్వల్ప వ్యవధిలో పెవిలియన్‌కు పంపాడు అశ్విన్. యువ బ్యాటర్ త్యాగ్‌నారాయణ్ చందర్‌పాల్ (24 బ్యాటింగ్), బ్లాక్‌వుడ్ (20 బ్యాటింగ్) ప్రస్తుతం క్రీజులో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో నెగ్గాలంటే వెస్టిండీస్ మరో 289 రన్స్ చేయాలి. అదే భారత్ నెగ్గాలంటే మిగిలిన 8 వికెట్లు తీయాల్సి ఉంటుంది. ఇక, ఓవర్‌నైట్ స్కోరు 229/5తో నాలుగో రోజు ఆటను మొదలుపెట్టిన విండీస్‌ను మమ్మద్ సిరాజ్ చావుదెబ్బ తీశాడు. ఆ జట్టు ఆఖరి నలుగురు బ్యాట్స్‌మెన్‌ను వెంట వెంటనే ఔట్ చేశాడీ స్టార్ పేసర్. దీంతో టీమిండియాకు 183 రన్స్ ఆధిక్యం లభించింది. ఆ తర్వాత భారత్ ఇన్నింగ్స్‌ను ధాటిగా ఆరంభించింది.
ఓపెనర్లు రోహిత్ శర్మ (44 బంతుల్లో 57), యశస్వి జైస్వాల్ (30 బంతుల్లో 38) ధనాధన్ బ్యాటింగ్‌తో భారత్‌కు శుభారంభాన్ని అందించారు. ఆ తర్వాత వచ్చిన శుబ్‌మన్ గిల్ (29 నాటౌట్) కాస్త నెమ్మదిగా ఆడినా.. ఇషాన్ కిషన్ (34 బంతుల్లో 54 నాటౌట్) టీ20ల తరహాలో రెచ్చిపోయాడు. దీంతో భారత్ 24 ఓవర్లలోనే 181 రన్స్ చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్ చేసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా చరిత్ర సృష్టించింది. ఒక అరుదైన రికార్డును భారత జట్టు తన పేరు మీద లిఖించుకుంది. 12.2 ఓవర్లలోనే 100 రన్స్ చేయడం ద్వారా టెస్టు క్రికెట్లో అత్యంత వేగంగా వంద పరుగులు చేసిన టీమ్‌గా భారత్ నిలిచింది. ఇప్పటిదాకా ఈ రికార్డు శ్రీలంక పేరిట ఉంది. బంగ్లాదేశ్‌పై 13.2 ఓవర్లలో 100 రన్స్ చేసింది లంక.