ఆస్ట్రేలియాపై లక్ష్మణ్‌-ద్రవిడ్‌ హిస్టారిక్‌ ఇన్నింగ్స్‌ల వెనకున్న నరకం యాతన గురించి తెలుసా?

IND vs AUS, Kolkata Test 2001, VVS Laxman, Rahul Dravid: 2001లో కోల్‌కతా వేదికగా ఆసీస్‌పై టీమిండియా చరిత్ర సృష్టించింది. అయితే ఆ చరిత్ర సృష్టించేందుకు రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తమ ప్రాణాలు ఎలా పణంగా పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం..

IND vs AUS, Kolkata Test 2001, VVS Laxman, Rahul Dravid: 2001లో కోల్‌కతా వేదికగా ఆసీస్‌పై టీమిండియా చరిత్ర సృష్టించింది. అయితే ఆ చరిత్ర సృష్టించేందుకు రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ తమ ప్రాణాలు ఎలా పణంగా పెట్టారో ఇప్పుడు తెలుసుకుందాం..

కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా 2001లో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌ గురించి క్రికెట్‌ అభిమానులందరికీ తెలిసే ఉంటుంది. ఆ మ్యాచ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌లు ఏకధాటిగా రెండు రోజుల పాటు బ్యాటింగ్‌ చేసి చూపిన పోరాటం, ఫాలో ఆన్‌ ఆడి టెస్ట్‌ మ్యాచ్‌ గెలిచి టీమిండియా చరిత్ర సృష్టించడం గురించి మనందరికీ తెలిసిందే. కానీ, ఆ అద్భుతం వెనుక లక్ష్మణ్‌, ద్రవిడ్‌ల కష్టం, మ్యాచ్‌కి ముందు, మ్యాచ్‌లో వాళ్లు అనుభవించిన నరకయాతన గురించి మాత్రం చాలా మందికి తెలిసి ఉండదు. వరుసగా 16 టెస్టులు గెలిచి.. ఆ నంబర్‌ను మరింత పెంచుకోవడానికే ఇండియాకు వచ్చామంటూ ఆసీస్‌ క్రికెటర్లు చూపించిన అహంకారానికి టీమిండియా బదులుతీర్చుకుంటూ.. కంగారుల వరుస టెస్టు విజయాలకు బ్రేక్‌ వేసిన కోల్‌కతా టెస్ట్‌ విజయం కోసం లక్ష్మణ్‌-ద్రవిడ్‌లు ప్రాణాలు పణంగా పెట్టిన క్షణాల గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

మూడు టెస్టులు, 5 వన్డేల సిరీస్‌ ఆడేందుకు స్టీవా కెప్టెన్సీలోని ఆస్ట్రేలియా జట్టు భారత పర్యటనకు వచ్చింది. అంతకంటే ముందు ఆస్ట్రేలియా వరుసగా 15 టెస్టు మ్యాచ్‌లు నెగ్గింది. క్రికెట్‌ చరిత్రలో అదొక రికార్డు. ఆ సమయంలో ఆస్ట్రేలియా ఎంత బలంగా ఉందో చెప్పేందుకు అది సరిపోతుంది. కానీ, మరోపక్క టీమిండియా మాత్రం అంత బలంగా లేదు. స్టార్‌ స్పిన్నర్‌ అనిల్‌ కుంబ్లే కూడా జట్టులో లేడు. టీమ్‌లో ఉన్న స్పిన్నర్లు అంతా కలిసి కనీసం 10 టెస్టు మ్యాచ్‌లు కూడా ఆడలేదు. ఈ సిరీస్‌ కంటే ముందు.. హర్భజన్‌ సింగ్‌ రూడ్‌ బిహేవియర్‌ కారణంగా బ్యాన్‌ ఎదుర్కొన్నాడు. కానీ, భజ్జీ టీమ్‌లో ఉండాల్సిందే అని అప్పటి కెప్టెన్‌ సౌరవ్‌ గంగూలీ పట్టుబట్టడంతో అతను టీమ్‌లో ఉన్నాడు.

చూస్తుండుగానే.. 2001 ఫిబ్రవరీ 27న వాంఖడే స్టేడియం వేదికగా తొలి టెస్టు ప్రారంభం అయింది. అంతా అనుకున్నట్లుగానే.. ఆస్ట్రేలియా చేతిలో టీమిండియా ఘోర పరాజయం చవిచూసింది. ఈ ఓటమితో ఎవరూ పెద్దగా ఆశ్చర్యపోలేదు. ఎందుకంటే.. ఆస్ట్రేలియా లాంటి అరివీర భయంకరమైన జట్టు ముందు టీమిండియా నుంచి ఇంతకంటే ఏం ఆశిస్తామని క్రికెట్‌ అభిమానులు కూడా మెంటల్‌గా ఫిక్సైపోయారు. తొలి టెస్ట్‌ విజయంతో ఆస్ట్రేలియా విన్నింగ్‌ స్ట్రేక్‌ 16కి చేరింది. ఇక రెండో టెస్టు కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్స్‌లో. ఈ మ్యాచ్‌కి ముందు టీమిండియా పరిస్థితి మరింత దిగజారిపోయింది. ముంబై నుంచి కోల్‌కతా ప్రయాణంతో రాహుల్‌ ద్రవిడ్‌ జ్వరంతో మంచం పట్టాడు. మ్యాచ్‌కి రెండు రోజుల ముందు.. వీవీఎస్‌ లక్ష్మణ్‌కి వెన్నునొప్పి వచ్చింది. మ్యాచ్‌లో ఎలాగైన ఆడాలని వెంటనే డాక్టర్‌ను స్పందిస్తే.. అతని వెన్నుముక ఒకపక్కకి ఒంగిపోయినట్లు వైద్యులు గుర్తించారు. దీంతో.. బెడ్‌ రెస్ట్‌ అవసరమని, ఇది మరింత తీవ్రమైతే చాలా కష్టమవుతుందని డాక్టర్లు హెచ్చరించారు.

మిడిల్డార్‌లో ఎంతో కీలకమైన రాహుల్‌ ద్రవిడ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌ల పరిస్థితి ఇలా ఉంటే.. మరోవైపు టీమిండియా బౌలింగ్‌ డిపార్ట్‌మెంట్‌కు పెద్దదిక్కులాంటి జవగళ్‌ శ్రీనాథ్‌ చేతి వేలి గాయంతో రెండో టెస్టుకు దూరం అయ్యాడు. అసలే కుంబ్లే లేడని బాధపడిపోతుంటే.. ఉన్న ఒక్క సీనియర్‌ బౌలర్‌ శ్రీనాథ్‌ సైతం దూరం కావడంతో రెండో టెస్టులో టీమిండియా కనీసం పోటీ అయినా ఇస్తుందా అని అంతా అనుకున్నారు. అదృష్టం కొద్ది ద్రవిడ్‌, లక్ష్మణ్‌లు రెండు రోజులు రెస్ట్‌ తీసుకొని.. సరిగ్గా మ్యాచ్‌ రోజుకి రెడీ అయ్యారు. తన కెరీర్‌లో ఫస్ట్‌ టైమ్‌ రాహుల్‌ ద్రవిడ్‌.. మ్యాచ్‌కి ముందు కనీసం బ్యాట్‌ పట్టుకోకుండా నేరుగా మ్యాచ్‌లోకి దిగాడు. 2001 మార్చ్‌ 11న మ్యాచ్‌ మొదలైంది. ఆస్ట్రేలియా తొలుత బ్యాటింగ్‌ చేసి.. అనుకున్నట్లుగానే ఫస్ట్‌ ఇన్నింగ్స్‌లో 445 పరుగుల భారీ స్కోర్‌ చేసింది. ఆసీస్‌ కెప్టెన్‌ స్టీవా 110, మ్యాథ్యూ హేడెన్‌ 97, జస్టిన్‌ లంగర్‌ 58 పరుగులతో చెలరేగి.. టీమిండియా బౌలర్లను ఓ ఆట ఆడుకున్నారు. భారత బౌలింగ్‌ ఎంత వీక్‌గా ఉందంటే.. ఆసీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ జాసన్‌ గెల్లెస్పీ 10వ స్థానంలో బ్యాటింగ్‌కి వచ్చి 46 పరుగులు చేశాడు. గంగూలీ పట్టుబట్టి టీమ్‌లోకి తెచ్చుకున్న హర్భజన్‌ సింగ్‌ 7 వికెట్లతో రాణించి.. దాదా పరువు కాస్త నిలబెట్టాడు.

ఇక తొలి ఇన్నింగ్స్‌కు దిగిన టీమిండియా 171 పరుగులకే కుప్పకూలింది. సచిన్‌ టెండూల్కర్‌ 10, కెప్టెన్‌ గంగూలీ 23, ఓపెనర్లో సదగోపన్న రమేష్‌ డకౌట్‌, శివ్‌ సుందర్‌ దాస్‌ 20 పరుగులు చేసి దారుణంగా విఫలం అయ్యారు. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న రాహుల్‌ ద్రవిడ్‌ 25, వీవీఎస్‌ లక్ష్మణ్‌ 59 పరుగులు చేసి కాస్త పర్వాలేదనిపించారు. ఒక తొలి ఇన్నింగ్స్‌లో టీమిండియా బ్యాటింగ్‌ చూసి.. వరుసగా రెండో ఓటమి కూడా ఖాయం అనుకున్నారు భారత క్రికెట్‌ అభిమానులు.. మ్యాచ్‌ చూసేందుకు వచ్చిన ప్రేక్షకులు స్టేడియం నుంచి వెళ్లిపోతున్నారు. ఆస్ట్రేలియా ఆటగాళ్లు సైతం.. మ్యాచ్‌ను త్వరగా ముగించేయాలని.. టీమిండియాతో ఫాలో ఆన్‌ ఆడించారు. తొలి ఇన్నింగ్స్‌ తర్వాత.. వెంటనే రెండో ఇన్నింగ్స్‌ కోసం బరిలోకి దిగిన భారత జట్టు. 115 పరుగులు చేసి 3 వికెట్లు కోల్పోయింది.. ఇక టీమిండియా ఎక్కువసేపు బ్యాటింగ్‌ చేసేలా లేదని.. ప్రేక్షకులు స్టేడియం వెళ్లిపోవడం కూడా ప్రారంభించారు.

సచిన్‌ 10, గంగూలీ 48 పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. క్రీజ్‌లో వీవీఎస్‌ లక్ష్మణ్‌, రాహుల్‌ ద్రవిడ్‌ ఉన్నారు. టీమిండియా ఇండియా ఇన్నింగ్స్‌ ఓటమి నుంచి తప్పించుకోవాలంటే.. క్రీజ్‌లో పాతుకుపోవడం తప్పితే వేరే దారిలేదు. దాంతో.. లక్ష్మణ్‌, ద్రవిడ్‌ అదే చేశారు. ఆస్ట్రేలియా బౌలర్లు నిప్పులు చెరిగే బంతులు వేస్తున్నా.. వార్న్‌ బాల్‌ను గింగిరాలు తిప్పుతున్నా.. ఇద్దరు అలాగే నిలబడ్డారు. మ్యాచ్‌ను త్వరగా ముగిద్దాం అనుకుంటే.. వీళ్లిద్దరేంటి జిడ్డులా తగులుకున్నారంటూ.. ఆసీస్‌ ఆటగాళ్లు గొనగడం స్టార్ట్‌ చేశారు. ఆటతో కాకుండా మాటతో ప్రత్యర్థిని గెలకడం అలవాటైన ఆసీస్‌ ఆటగాళ్లు స్లెడ్జింగ్‌ కూడా మొదలుపెట్టారు. అయినా కూడా ఏకాగ్రత దెబ్బతినకుండా.. లక్ష్మణ్‌-ద్రవిడ్‌ క్రీజ్‌లో పాతుకుపోయారు. ఒక సెషన్‌ ముగిసిన.. రెండు సెషన్లు ముగిశాయి.. వాళ్లిద్దరు మాత్రం ఆడుతూనే ఉన్నారు. ఈ మ్యాచ్‌లో ఏదో జరగబోతుందని ఆసీస్‌ ఆటగాళ్లతో పాటు క్రికెట్‌ అభిమానులకు కూడా అర్థమైంది. ఖాళీ అయిన స్టేడియం మళ్లీ నిండటం మొదలైంది.

గంటల తరబడి బ్యాటింగ్‌ చేయడంతో.. అప్పటికే అనారోగ్యంతో బాధపడుతున్న ఇద్దరు ఆటగాళ్లు.. ఎండ వేడిమికి తట్టుకోలేక తీవ్ర ఇబ్బంది పడ్డారు. ముఖ్యంగా ద్రవిడ్‌ అయితే నరకం చూశాడు. ఎండ వేడిమికి, బాడీ డీహైడ్రేట్‌ అవుతుంటే.. ద్రవిడ్‌ ఎక్కడ ఏకాగ్రత కోల్పోతాడో అని లక్ష్మణ్‌ తరచూ అతనితో మాట్లాడుతూ ఉన్నాడు.. కాన్సట్రేషన్‌ అస్సలు కోల్పోవద్దని చెబుతూ ఉన్నాడు. ఆ మ్యాచ్‌లో ద్రవిడ్‌తో మాట్లాడినన్ని మాటలు తన కెరీర్‌ మొత్తంలో కూడా మాట్లాడలేదంటూ పలు సందర్భాల్లో లక్ష్మణ్‌ వెల్లడించాడు. ఎందుకంటే.. ద్రవిడ్‌ అవుట్‌ అయితే.. తర్వాత లక్ష్మణ్‌కు అండగా నిలుస్తూ.. వికెట్‌ కాపాడే వాళ్లు వెనుక లేరు. అందుకే మ్యాచ్‌లో ఓడిపోకుండా ఉండాలంటే ద్రవిడ్‌ క్రీజ్‌లో ఉండాలి. ఆస్ట్రేలియా క్రికెటర్లు భయపడినట్లే.. మ్యాచ్‌లో మెల్లమెల్లగా టీమిండియా ఆధిక్యంలోకి వచ్చింది.

ఓటమి నుంచి తప్పించుకోవాలనే పట్టుదలతో బ్యాటింగ్‌ చేసిన లక్ష్మణ్‌-ద్రవిడ్‌లో ఇప్పుడు మ్యాచ్‌ గెలవాలనే కసి పెరిగింది. ఆ కసితోనే.. తమ ప్రాణాలు సైతం లెక్కచేయకుండా రెండు రోజుల పాటు బ్యాటింగ్‌ చేశారు. ఏ మాత్రం తేడా కొట్టినా.. లక్ష్మణ్‌ వెన్నుముక పనిచేయదు.. డీహైడ్రేషన్‌ ఎక్కువైతే.. ద్రవిడ్‌ ఆస్పత్రికే. అయినా కూడా ఇద్దరు తమ దేశం కోసం, జట్టు పరువు కోసం ప్రాణాలు లెక్కలేయలేదు. లక్ష్మన్‌ 452 బంతుల్లో 44 ఫోర్లతో 281 పరుగులు, రాహుల్‌ ద్రవిడ్‌ 353 బంతుల్లో 20 ఫోర్లతో 180 పరుగులు చేసి.. టీమిండియాకు మంచి ఆధిక్యం అందించారు. తొలి ఇన్నింగ్స్‌లో కేవలం 171కే ఆలౌట్‌ అయిన టీమిండియా ఫాలో ఆన్‌ ఆడి రెండో ఇన్నింగ్స్‌లో 7 వికెట్ల నష్టానికి ఏకంగా 657 పరుగలు చేసి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది.

లక్ష్మణ్‌, ద్రవిడ్‌ కసి, పట్టుదల చూసి ఆసీస్‌ మైండ్‌ బ్లాంక్‌ అయింది. అసలు మనుషులు అనేవాళ్లు ఇలా ఆడతారా? అనే అయోమయంలో రెండో ఇన్నింగ్స్‌కు దిగిన ఆసీస్‌ను.. హర్భజన్‌ సింగ్‌, సచిన్‌ టెండూల్కర్‌ తమ స్పిన్‌తో తిప్పేశారు. భజ్జీ 6, సచిన్‌ 3 వికెట్లతో చెలరేగి.. ఆసీస్‌ను 212 పరుగులకే కుప్పకూల్చారు. దీంతో టీమిండియా 171 పరుగుల భారీ తేడాతో విజయం సాధించింది. లక్ష్మణ్‌కు ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌ అవార్డు దక్కింది. ఈ విజయం చరిత్రలో నిలిచిపోయింది. అందుకు కారణం.. లక్ష్మణ్‌ ద్రవిడేల అనడంలో ఎలాంటి సందేహం లేదు. భజ్జీ, సచిన్‌ పాత్ర కూడా ఉన్నా.. ఆసీస్‌ అహంకారంపై కొట్టింది మాత్రం ఆ ఇద్దరు దిగ్గజాలే. ఒకవైపు ఆరోగ్యం సహకరించకపోయినా.. టీమిండియా కోసం ప్రాణాలు పణంగా పెట్టి.. ఆసీస్‌ వరుస విజయాలకు బ్రేక్‌ వేస్తూ.. వారి గర్వాన్ని అణిచి.. చరిత్ర పుటల్లో ఎప్పటికీ నిలిచిపోయే విజయం సాధించిన లక్ష్మణ్‌-ద్రవిడ్‌లో గొప్ప ఇన్నింగ్స్‌లపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments