iDreamPost
android-app
ios-app

ధోని రికార్డును బద్దలుకొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌

  • Published Sep 25, 2023 | 5:50 PM Updated Updated Sep 25, 2023 | 5:50 PM
  • Published Sep 25, 2023 | 5:50 PMUpdated Sep 25, 2023 | 5:50 PM
ధోని రికార్డును బద్దలుకొట్టిన సౌతాఫ్రికా స్పిన్నర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌

ప్రపంచ క్రికెట్‌లో టీమిండియా మాజీ కెప్టెన్‌, దిగ్గజ క్రికెటర్‌ మహేంద్ర సింగ్‌ ధోని అనేక రికార్డులను నెలకొల్పాడు. కెప్టెన్‌గా టీమిండియాను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లిన ధోని.. కెప్టెన్‌, ఆటగాడిగా ఎన్నో రికార్డులు సాధించాడు. 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీల్లో టీమిండియాను విజేతగా నిలబెట్టాడు. అలాగే ఐపీఎల్‌లోనూ ధోని సూపర్‌ సక్సెస్‌ అయ్యాడు. తన కెప్టెన్సీలో చెన్నై సూపర్‌ కింగ్స్‌ను ఏకంగా ఐదు సార్లు ఛాంపియన్‌గా నిలబెట్టాడు. ఈ ఏడాది జరిగిన సీజన్‌లో కూడా సీఎస్‌కేనే విన్నర్‌గా నిలిచింది. 2023 ఐపీఎల్‌ ట్రోఫీ విజయంతో ధోని ఓ అరుదైన రికార్డును నెలకొల్పగా.. ఆ రికార్డును తాజాగా సౌతాఫ్రికా మాజీ క్రికెటర్‌ ఇమ్రాన్‌ తాహీర్‌ బ్రేక్‌ చేశాడు. ధోని నెలకొల్పిన ఆ అరుదైన రికార్డ్‌ గురించి, తాహీర్‌ ఎలా బ్రేక్‌ చేశాడనే దాని గురించి ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

వెస్టిండీస్‌ వేదికగా జరిగిన కరేబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 2023 ఫైనల్‌ మ్యాచ్‌ ఆదివారం జరిగింది. ఇప్పటికే పలు సార్లు ఛాంపియన్‌గా నిలిచిన ట్రినిబాగో నైట్‌రైడర్స్‌తో ఫైనల్లో గయానా అమెజాన్‌ వారియర్స్‌ జట్టు తలపడింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన నైట్‌రైడర్స్‌ జట్టు.. కేవలం 94 పరుగులకే కుప్పకూలింది. కార్టీ ఒక్కడే 38 పరుగులతో రాణించాడు. ప్రిటోరియస్‌ 4 వికెట్లతో చెలరేగడంతో మార్క్‌ డియాల్‌, పూరన్‌, పొలార్డ్‌, రస్సెల్‌ లాంటి హేమాహేమీలు కూడా తేలిపోయారు. 95 పరుగులు సులువైన టార్గెట్‌ను గయానా జట్టు 14 ఓవర్లలోనే కేవలం ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఊదిపారేసి.. సీపీఎల్‌ చరిత్రలో తొలిసారి ఛాంపియన్‌గా అవతరించింది. ఓపెనర్‌ సైమ్‌ అయ్యూబ్‌ 52, షాయ్‌ హోప్‌ 32 పరుగులతో గయానాను విజయతీరాలకు చేర్చారు.

కాగా.. ఈ విజయంతో గయానా కెప్టెన్‌గా ఉన్న ఇమ్రాన్‌ తాహీర్‌ ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు. ప్రస్తుతం తాహీర్‌ వయసు 44 ఏళ్లు. ఈ వయసులో టీ20 లీగ్‌ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా తాహీర్‌ చరిత్ర సృష్టించాడు. గతంలో ఈ రికార్డు మన మహేంద్రుడి పేరున ఉండేది. ఐపీఎల్‌ 2023 ట్రోఫీ గెలిచే సమయానికి ధోని వయసు 41 ఏళ్లు. ఎక్కువ వయసులో టీ20 లీగ్‌ ట్రోఫీ గెలిచిన కెప్టెన్‌గా ధోని పేరిట ఉన్న రికార్డును ఇప్పుడు.. తాహీర్‌ బ్రేక్‌ చేసి.. కొత్త రికార్డును లిఖించాడు. మరి ఈ రికార్డు విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: టీమిండియా అరుదైన ఘనత.. వన్డే క్రికెట్​లో తొలి జట్టుగా ప్రపంచ రికార్డు!