iDreamPost
android-app
ios-app

హర్మన్ ప్రీత్ కౌర్ కు షాకిచ్చిన ICC.. బ్యాన్ విధింపు!

హర్మన్ ప్రీత్ కౌర్ కు షాకిచ్చిన ICC.. బ్యాన్ విధింపు!

భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ కు ఐసీసీ షాకిచ్చింది. ఇటీవల ఢాకా వేదికగా బంగ్లాదేశ్ తో జరిగిన మూడో వన్డేలో ఆమె ప్రవర్తించిన తీరుపై ఐసీసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఆమెకు ఇప్పటికే 4 డీమెరిట్ పాయింట్లు విధించిన విషయం తెలిసిందే. అంతేకాకుండా ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ లో లెవల్ 2 బ్రీచ్ కి పాల్పడిన తొలి భారత మహిళా క్రికెటర్ గా హర్మన్ ప్రీత్ కౌర్ నిలిచింది. ఆమె ఐసీసీ నియమావళిని అతిక్రమించినట్లు నిర్ధారిస్తూ.. తగిన చర్యలు తీసుకున్నారు. ఆమెపై బ్యాన్ విధిస్తూ ఐసీసీ తమ నిర్ణయాన్ని వెల్లడించింది.

జులై 24వ తేదీన ఢాకా వేదికగా బంగ్లాదేశ్ తో వన్డే మ్యాచ్ జరుగుతోంది. ఆ మ్యాచ్ లో హర్మన్ ప్రీత్ కౌర్ బ్యాటింగ్ చేస్తూ.. స్లిప్ కి క్యాచ్ ఇచ్చి అవుట్ అయింది. అయితే అంపైర్ తీసుకున్న నిర్ణయంపై హర్మన్ అసహనం వ్యక్తం చేసింది. అంతేకాకుండా కోపంలో బ్యాటుతో స్టంప్స్ ని బ్రేక్ చేసింది. అక్కడితో ఆగకుండా మ్యాచ్ తర్వాత జరిగిన ట్రోఫీ బహూకరణ కార్యక్రంలో కూడా అంపైరింగ్ పై తన అసహనాన్ని వ్యక్త పరిచింది. వికెట్లు విరగొట్టడాన్ని సమర్థించిన కొందరు.. సెరమొనీలో చేసిన పనిని మాత్రం ఎవరూ సమర్థించలేదు. మ్యాచ్ లో అంటే కోపంలో అలా చేసుండచ్చు.. కానీ, మ్యాచ్ అయ్యాక కూడా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ వ్యాఖ్యానించారు. ఆ చర్యలతో ఆమెకు 4 డీమెరిట్ పాయింట్లు విధించారు. ఇప్పడు తాజాగా హర్మన్ ప్రీత్ కౌర్ పై ఐసీసీ 2 మ్యాచులు బ్యాన్ విధిస్తూ నిర్ణయం తీసుకుంది.

ఐసీసీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఆర్టికల్ 2.8 ప్రకారం ఆమె తప్పు చేసినట్లు ధ్రువీకరించారు. ఈ ఆర్టికల్ ప్రకారం అంపైర్ నిర్ణయంపై అసహనం వ్యతిరేకతను వెల్లిబుచ్చడం. అంతేకాకుండా ట్రోఫీ ప్రదానం సమయంలో ఓపెన్ గా అంపైరింగ్ కామెంట్స్ చేసింది. లెవల్ వన్ ఉల్లంఘన ప్రకారం హర్మన్ ప్రీత్ కౌర్ కు మ్యాచ్ ఫీజులో 25 శాతం కోత కూడా పడింది. హర్మన్ బ్యాట్ తో వికెట్లను విరగొట్టింది. అంపైరింగ్ స్థాయి మరీ దారుణంగా ఉందంటూ కామెంట్ చేసింది. వికెట్లు విరగొట్టినందుకు గానూ.. ఆమెకు 3 డీమెరిట్ పాయింట్లు విధించారు. అంపైర్ నిర్ణయాన్ని తప్పుబట్టినందుకు ఒక డీమెరిట్ పాయింట్ విధించారు.

సాధారణంగా ఒక క్రికెటర్ కు రెండేళ్ల కాలంలో 4 లేదా అంతకంటే ఎక్కువ డీమెరిట్ పాయింట్లు వస్తే.. అవి సస్పెన్షన్ పాయింట్లుగా మారుతాయి. ఈ 4 డీమెరిట్ పాయింట్లు.. హర్మన్ కు 2 సస్పెన్షన్ పాయింట్లు అయ్యాయి అనమాట. అందుకే ఆమెపై రెండు మ్యాచులకు బ్యాన్ విధించారు. అయితే డీమెరిట్ పాయింట్లు రావడం హర్మన్ ప్రీత్ కౌర్ కి ఇదే తొలిసారి కాదు. 2017 వన్డే వరల్డ్ కప్ సెమీ ఫైనల్ లో కూడా ఒక డీమెరిట్ పాయింట్ వచ్చింది. ఆస్ట్రేలియాపై ఆడుతున్న సమయంలో తన హెల్మెట్ ని నేలకేసి కొట్టి.. తన పార్ట్ నర్ దీప్తీ శర్మను దుర్భాషలాడింది. అందుకు గానూ ఒక డీమెరిట్ పాయింట్ ఇచ్చారు. ప్రస్తుతం బీసీసీఐ ఐసీసీతో హర్మన్ ప్రీత్ కౌర్ ప్రవర్తనకు సంబంధించి చర్చలు జరుపుతోంది. బ్యాన్ నిర్ణయాన్ని ఐసీసీ కొనసాగిస్తే.. సౌత్ ఆఫ్రికాతో జరిగే సిరీస్ లో మొదటి రెండు మ్యాచ్ లు హర్మన్ ప్రీత్ కౌర్ మిస్ అయినట్లే.