iDreamPost
android-app
ios-app

IND vs PAK: 8 వికెట్లకే పాకిస్థాన్‌ ఆలౌట్‌! ఈ ABS HURT అంటే ఏంటి?

  • Published Sep 12, 2023 | 11:17 AM Updated Updated Sep 12, 2023 | 11:17 AM
  • Published Sep 12, 2023 | 11:17 AMUpdated Sep 12, 2023 | 11:17 AM
IND vs PAK: 8 వికెట్లకే పాకిస్థాన్‌ ఆలౌట్‌! ఈ ABS HURT అంటే ఏంటి?

ఆసియా కప్ 2023లో భాగంగా సూపర్‌ 4 స్టేజ్‌లో పాకిస్థాన్‌తో సోమవారం జరిగిన వన్డే మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించింది. నిజానికి ఈ మ్యాచ్‌ ఆదివారమే జరగాల్సి ఉంది. 24.1 ఓవర్ల ఆట తర్వాత వర్షం కారణంగా మ్యాచ్‌ నిలిచిపోయిన విషయం తెలిసిందే. కీలకమైన సూపర్‌ 4 స్టేజ్‌ మ్యాచ్‌ కావడంతో టోర్నీ నిర్వహకులు రిజర్వ్‌డేను కేటాయించారు. సోమవారం కూడా వర్షం అంతరాయ కలిగించినా.. మ్యాచ్‌ పూర్తిగా సాగింది. ఆదివారం 24.1 ఓవర్లకు 2 వికెట్లు నష్టపోయిన 147 పరుగులు చేసిన టీమిండియా.. సోమవారం మళ్లీ అక్కడి నుంచే ఆటను ప్రారంభించింది.

ఆదివారం రోహిత్‌ శర్మ(56), శుబ్‌మన్‌ గిల్‌(58) హాఫ్‌ సెంచరీలు సాధించి.. టీమిండియా ఇన్నింగ్స్‌కు బలమైన పునాది వేశారు. తొలి వికెట్‌కు 120కి పైగా పరుగులు జోడించారు. ఇక్కడి నుంచి విరాట్‌ కోహ్లీ-కేఎల్‌ రాహుల్‌ జోడి.. పాక్‌ బౌలర్లపై పూర్తి ఆధిపత్యం చెలాయించింది. ఆరంభంలో కాస్త నిదానంగా ఆడినా.. మెల్లమెల్లగా వేగం పెంచుతూ.. ఇద్దరూ సెంచరీలో సాధించారు. తొలుత కేఎల్‌ రాహుల్‌ 100 బంతుల్లో సెంచరీతో మార్క్‌ అందుకున్నాడు. ఆ వెంటనే కోహ్లీ సైతం 84 బంతుల్లో సెంచరీ పూర్తి చేశాడు. మొత్తంగా కోహ్లీ 94 బంతుల్లో 9 ఫోర్లు, 3 సిక్సులతో 122, కేఎల్‌ రాహుల్‌ 106 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సులతో 111 పరుగులు చేశాడు. వీరిద్దరూ చెలరేగడంతో టీమిండియా నిర్ణీత 50 ఓవర్లలో 356 పరుగుల భారీ స్కోర్‌ చేసింది.

ఇక 357 పరుగుల కొండంత లక్ష్యాన్ని ఛేదించేందుకు బరిలోకి దిగిన పాకిస్థాన్‌ను టీమిండియా బౌలర్లు వణికించారు. ఆరంభంలో బుమ్రా-సిరాజ్‌ ద్వయం స్వింగ్‌తో పాక్‌ టాపార్డర్‌ను అల్లాడించారు. బుమ్రా.. ఇమామ్‌ ఉల్‌ హక్‌ను అవుట్‌ చేశాడు. ఆ తర్వాత పాండ్యా కూడా సూపర్‌ డెలవరీతో పాక్‌ కెప్టెన్‌ బాబర్‌ అజమ్‌ను పెవిలియన్‌కు పంపాడు. ఇక స్పిన్నర్‌ కుల్దీప్‌ యాదవ్‌ అయితే.. తన స్పిన్‌ మ్యాజిక్‌తో పాక్‌ను చుట్టేశాడు. ఏకంగా 5 వికెట్ల హాల్‌తో అదరగొట్టారు. శార్దుల్‌ ఠాకూర్‌ కూడా ఒక వికెట్‌ పడగొట్టారు. అయితే.. పాకిస్థాన్‌ 32 ఓవర్లలో 128 పరుగుల వద్ద 8వ వికెట్‌ కోల్పోయి.. ఇన్నింగ్స్‌ను ముగించింది. పాకిస్థాన్‌ ఆలౌట్‌ అయినట్లుగా అంపైర్లు ప్రకటించారు.

అదేంటి మరో రెండు వికెట్ల పడాలి కదా.. అని క్రికెట్‌ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చివర్లో నసీమ్‌ షా, హరీస్‌ రౌఫ్‌ బ్యాటింగ్‌కు రాకుండానే పాకిస్థాన్‌ ఆలౌట్‌ అయినట్లు ఎలా ప్రకటిస్తారని చాలా మంది సోషల్‌ మీడియాలో ప్రశ్నలు కురిపించారు. అయితే.. నసీమ్‌ షా, హరీస్‌ రౌఫ్‌ గాయాల కారణంగా బ్యాటింగ్‌కు రాలేదు. రౌఫ్‌ అయితే.. సోమవారం అసలు గ్రౌండ్‌లోకే రాలేదు. నషీమ్‌.. టీమిండియా ఇన్నింగ్స్‌ 49వ ఓవర్‌ వేస్తూ.. గాయపడి మైదానం వీడాడు. దీంతో వీరిద్దరూ బ్యాటింగ్‌ చేయడానికి సిద్ధంగా లేకపోవడతో వారిని అంపైర్లు అబ్సెంట్‌ హార్ట్‌గా(ABS HURT) ప్రకటించి, పాక్‌ ఆలౌట్‌ అయినట్లు వెల్లడించారు. ఎంసీసీ రూల్స్‌ ప్రకారం.. ఒక బ్యాట్స్‌మన్ అనారోగ్యం, గాయం లేదా ఇతర అనివార్య కారణాల వల్ల బ్యాటింగ్‌కు రాలేకపోతే వారు రిటైర్డ్ హర్ట్‌గా పరిగణించబడతారు. మరి ఈ మ్యాచ్‌లో పాక్‌పై టీమిండియా సాధించిన విజయం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: VIDEO: రాంగ్‌ షాట్‌ ఆడి.. రక్తం చిందించిన పాక్‌ బ్యాటర్‌!