iDreamPost
android-app
ios-app

ఓటమి బాధగా లేదు.. విండీస్‌తో సిరీస్‌ ఓటమి తర్వాత పాండ్యా కామెంట్స్‌! ఫ్యాన్స్‌ ఫైర్‌

  • Published Aug 14, 2023 | 9:59 AMUpdated Aug 14, 2023 | 10:29 AM
  • Published Aug 14, 2023 | 9:59 AMUpdated Aug 14, 2023 | 10:29 AM
ఓటమి బాధగా లేదు.. విండీస్‌తో సిరీస్‌ ఓటమి తర్వాత పాండ్యా కామెంట్స్‌! ఫ్యాన్స్‌ ఫైర్‌

వెస్టిండీస్‌తో ఆదివారం ఫ్లోరిడా వేదికగా జరిగిన చివరి టీ20లో టీమిండియా 8 వికెట్ల తేడాతో దారుణ ఓటమిని చవిచూసింది. దీంతో ఐదు టీ20ల సిరీస్‌ను 2-3 తేడాతో కోల్పోయింది. వెస్టిండీస్‌పై దాదాపు 17 ఏళ్ల తర్వాత టీమిండియా ద్వైపాక్షిక సిరీస్‌ ఓటమిని చవిచూసింది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ ఓటమి పాలైన తర్వాత భారత టీ20 కెప్టెన్‌ హార్దిక్‌ పాండ్యాపై తీవ్ర విమర్శలు వచ్చాయి. టీమిండియా వరుస ఓటములకు పాండ్యా చెత్త కెప్టెన్సీనే కారణమంటూ పలువురు క్రికెట్‌ నిపుణులు, భారత క్రికెట్‌ అభిమానులు మండిపడ్డారు. అయితే.. తర్వాత రెండు మ్యాచ్‌ల్లో టీమిండియా విజయం సాధించడంతో కాస్త శాంతించిన అభిమానులు.. చివరి మ్యాచ్‌లో ఓడి సిరిస్‌ ఓడిపోవడంతో మళ్లీ నిరాశ చెందారు. అయితే.. సిరీస్‌ ఓటమి తర్వాత పాండ్యా చేసిన వ్యాఖ్యలతో మరోసారి అతనిపై ఇండియన్‌ క్రికెట్‌ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

మ్యాచ్‌ తర్వాత పాండ్యా మాట్లాడుతూ.. ఈ ఓటమి పెద్దగా బాధ కలిగించలేదని, కఠిన పరిస్థితుల్లో ఆడాలని నిర్ణయించుకున్నాం అని, అందుకే ముందుగా బ్యాటింగ్‌ చేశామని, దీర్ఘకాలిక లక్ష్యాలతో సాగుతున్నప్పుడు ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని పాండ్యా అన్నాడు. అయితే తాను బ్యాటింగ్‌కి వచ్చే సమయానికి మూమెంటమ్‌ మిస్‌ అయిందని, పరిస్థితికి తగ్గట్లు ఆడలేకపోయామని పేర్కొన్నాడు. ఈ ఓటమి గురించి పెద్దగా మాట్లాడాల్సిన అవసరం కూడా లేదు. జట్టులో ఆటగాళ్లు ఎలా ఉన్నారో తనకు తెలుసని అన్నాడు. లోపాలను సరిచేసుకుంటూ అన్ని ఫిక్స్‌ చేసుకోవాడానికి తమకు చాలా సమయం ఉంది, అయినా ఒక్కోసారి ఓడిపోవడం కూడా మంచిదే అని పాండ్యా వెల్లడించాడు. కుర్రాళ్లు మంచి ఆటను ప్రదర్శించారు. వచ్చే ఏడాది టీ20 వరల్డ్‌ కప్‌ ఇక్కడే జరగనుంది. అప్పుడు ఇంకా పెద్ద టార్గెట్లు ఉంటాయని పాండ్యా పేర్కొన్నాడు.

అయితే.. వెస్టిండీస్‌తో ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో తొలి 4 మ్యాచ్‌ల్లోనూ ప్రయోగాలు చేసి సిరీస్‌ను 2-2తో సమం చేసుకున్న తర్వాత.. సిరీస్‌ డిసైడర్‌గా మారిన చివరి మ్యాచ్‌లోనైనా పాండ్యా అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగాల్సింది కదా అని అభిమానులు అభిప్రాయపడుతున్నారు. అందరికి అవకాశాలు ఇచ్చిన పాండ్యా, భవిష్యత్తు స్టార్‌గా చెప్పుకుంటున్న ఉమ్రాన్‌ మాలిక్‌కు మాత్రం ఒక్క మ్యాచ్‌లోనూ ఛాన్స్‌ ఇవ్వకపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. అలాగే దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణించిన ఆవేశ్‌ఖాన్‌కు సైతం అవకాశం ఇవ్వలేదు. పైగా ప్రయోగాలు చేశాం, కొత్తగా ప్రయత్నించాం అంటూ పాండ్యా చెబుతున్నాడంటూ క్రికెట్‌ అభిమానులు మండిపడుతున్నారు. అయినా ఓడిపోయినందుకు బాధపడటం లేదని ఎలా చెబుతాడని, ఓడింది ఆస్ట్రేలియాపై కాదని, వెస్టిండీస్‌పై అనే విషయాన్ని పాండ్యా మర్చిపోయినట్లు ఉన్నాడంటూ చురకలు అంటిస్తున్నారు. పైగా ఈ సిరీస్‌లో పాండ్యా అత్యంత దారుణంగా విఫలం అయ్యాడు. కెప్టెన్‌ కాకపోయి ఉంటే అసలు అతనికి జట్టులో చోటు కూడా కష్టమే అని కూడా క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: కెప్టెన్ పాండ్యాపై ప్రశంసలు.. మీరు మారిపోయార్ సార్ అంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి