SNP
SNP
ప్రపంచ క్రికెట్‌లో బెస్ట్ క్రికెటర్లు ఎవరనే విషయంపై అనేక చర్చలు జరుగుతూనే ఉంటాయి. మాజీ క్రికెటర్లు సైతం తమ దృష్టిలో బెస్ట్ ప్లేయర్లుగా ఉన్న వారిని ప్రకటిస్తుంటారు. వారి ఎంపికకు గల కారణాలను సైతం వివరిస్తూ.. తమ టాప్ 5, టాప్ 10 క్రికెటర్లు వీరే అంటూ లిస్ట్ విడుదల చేస్తుంటారు. ప్రస్తుతం యాషెస్ సిరీస్ హోరాహోరీగా సాగుతున్న క్రమంలో మరోసారి టెస్టు క్రికెట్‌లో అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరనే విషయంపై చర్చ మొదలైంది. ఈసారి టీమిండియా మాజీ క్రికెటర్, లెజెండరీ స్పిన్నర్ హర్బజన్ సింగ్ టెస్ట్ క్రికెట్‌లో టాప్ క్రికెటర్లు వీళ్లేనని పేర్కొన్నాడు.
అయితే అందరిని షాక్‌కు గురిచేస్తూ ఆ లిస్ట్‌లో టీమిండియా స్టార్ క్రికెటర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, వరల్డ్ నంబర్ వన్ టెస్ట్ బౌలర్ రవిచంద్రన్ అశ్విన్‌కు భజ్జీ చోటు ఇవ్వలేదు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే భజ్జీకి ప్రస్తుతం టెస్టు క్రికెట్‌లో ఐదు అత్యుత్తమ ఆటగాళ్లు ఎవరో చెప్పాలంటూ ఓ నెటిజన్ నుంచి ప్రశ్న ఎదురైంది. కేవలం స్కిల్స్ మాత్రమే కాకుండా గేమ్ ఛేజింగ్ ఎబిలిటీ, మ్యాచ్ విన్నింగ్ ఎబిలిటీ, కీలక సమయాల్లో బాగా ఆడేవారిని పరిగణంలోకి తీసుకుని టాప్ ఆటగాళ్లను ఎంపిక చేయాలని అతను కోరడంతో.. భజ్జీ తన టాప్ 5 ఆటగాళ్ల పేర్లను వెల్లడించాడు.
ఆస్ట్రేలియా ఆటగాళ్లు నాథన్ లయన్, స్టీవ్ స్మిత్, భారత్ ప్లేయర్లు రిషభ్ పంత్, రవీంద్ర జడేజా, ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ తన టాప్ ప్లేయర్లుగా హర్బజన్ ప్రకటించాడు. అయితే ఇందులో కోహ్లీ, రోహిత్, అశ్విన్‌ల పేర్లు లేకపోవడంపై క్రికెట్ అభిమానులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. మరి భజ్జీ టాప్ 5 ప్లేయర్ల లిస్ట్‌పై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.