iDreamPost
android-app
ios-app

బర్త్‌ డే స్పెషల్‌: ధోని అంటే పేరు కాదు.. గెలుపుకు కేరాఫ్‌ అడ్రస్‌!

  • Published Jul 06, 2023 | 7:24 PM Updated Updated Jul 07, 2023 | 10:55 AM
  • Published Jul 06, 2023 | 7:24 PMUpdated Jul 07, 2023 | 10:55 AM
బర్త్‌ డే స్పెషల్‌: ధోని అంటే పేరు కాదు.. గెలుపుకు కేరాఫ్‌ అడ్రస్‌!

మహేంద్రసింగ్‌ ధోని.. వెనుకబడిన చిన్న రాష్ట్రం జార్ఖండ్‌లోని రాంచీ అనే ఓ చిన్న పట్టణం నుంచి వచ్చి.. ప్రపంచ వ్యాప్తంగా కోట్ల మంది అభిమానులను.. సారీ, భక్తులను సంపాదించుకున్న సంచలనం. అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన కొన్నేళ్లకే టీమిండియా కెప్టెన్సీ పగ్గాలు అందుకున్నాడు. అప్పటి నుంచి విజయం అతనికి బానిసైంది. పట్టుకున్నదల్లా బంగారమే అనే సామెతకు నిలువెత్తు రూపం అతనే. చాలా మంది ధోనిది అదృష్టం అనుకుంటారు. టీమ్‌ బాగుంది కాబట్టి కెప్టెన్‌గా కప్పులు అందించాడని చాలా సింపుల్‌గా అనేస్తారు. అందరూ కష్టపడి ఆడితే క్రెడిట్‌ కొట్టేశాడని అసూయ చూపిస్తారు. కానీ, నిజానికి వరల్డ్‌ కప్‌ గెలవడం చాలా ఈజీ అనే ఫీలింగ్‌ క్రియేట్‌ చేసిందే అతను. అందుకు అతని మాస్టర్‌ మైండ్‌ కారణం.

2011 వరల్డ్‌ కప్‌ గెలవడంలో జట్టులోని మిగతా ఆటగాళ్లు అంతా కష్టపడ్డారు. దాన్ని ఎవరూ కాదనలేరు. కానీ.. వారి కష్టానికి ధోని మాస్టర్‌ మైండ్‌ తోడవ్వడంతోనే గెలుపు సాధ్యమైంది. వికెట్ల వెనుక నిలబడి వ్యూహం రచిస్తే.. ఎంత పెద్ద తురుంఖాన్‌ అయినా బుట్టలో పడాల్సిందే. ఏ బ్యాటర్‌కు ఎలాంటి ఫీల్డ్‌ సెట్‌ చేయాలి, ఏ బౌలర్‌ను ఏ ఉపయోగించుకోవాలి అనేది ధోనికి తప్ప మరే కెప్టెన్‌కు అంతలా తెలిసి ఉండదేమో. ధోని కెప్టెన్‌గా ఉన్నంత కాలం ఒకలా ఉన్న టీమిండియా, అతను గుడ్‌బై చెప్పిన తర్వాత మరోలా తయారైంది. జట్టు, జట్టులోని ఆటగాళ్లు అద్భుతంగా ఉన్నా.. ‘కప్పు’ మాత్రం కొట్టలేకపోతున్నారు.

ధోని అంటే కేవలం కెప్టెన్‌గా, బ్యాటర్‌గా, వికెట్‌ కీపర్‌గా మాత్రమే టీమ్‌లో ఉండలేదు. అంతకు మించి ఏదో తెలియని శక్తి, ధోని రూపంలో టీమ్‌లో ఉండేది. జట్టులో ఆటగాళ్లు ఒత్తడికి గురికాకుండా చూడటం, ఫిట్‌నెస్‌పై దృష్టిపెట్టేలా చేయడం, నిర్లక్ష్యంగా ఉంటే ఎంతటి గొప్ప ఆటగాడికైనా జట్టు నుంచి ఉద్వాసన తప్పదనే భయం పుట్టించడం ధోని వల్లే సాధ్యమైంది. దాంతో పాటు జట్టులో మూడు రోల్స్‌(కెప్టెన్సీ, బ్యాటింగ్‌, కీపింగ్‌) అద్భుతంగా నిర్వర్తిస్తూ.. టీమిండియాను విజయపథంలో నడిపించాడు.

ఒకటి కాదు రెండు కాదు.. మూడు ఐసీసీ ట్రోఫీలను భారత్‌ ముద్దాడేలా చేసిన ఏకైక కెప్టెన్‌ ధోనినే. 2007లో టీ20 వరల్డ్‌ కప్‌, 2011లో వన్డే వరల్డ్‌ కప్‌, 2013లో ఛాంపియన్స్‌ ట్రోఫీ.. ఇలా ధోని ఉన్నంత వరకు టీమిండియాకు కప్పుల పండగే. ఎప్పుడో 1983లో వరల్డ్‌ కప్‌ గెలిచినందుకు సంబురాలు చేసుకున్న క్రికెట్‌ అభిమానులను ఊపిరి ఆడనివ్వకుండా విజయానందంలో ముంచేశాడు. 28 ఏళ్ల తర్వాత ప్రపంచ కప్‌ను సొంత గడ్డపై గెలిపించాడు. టాస్‌ మొదలు మ్యాచ్‌లో ప్రతి నిమిషం ధోని మైండ్‌ పాదరసం కంటే వేగంగా కదిలేది. ధోనిని విమర్శించే ముందు.. ధోని కంటే ముందు, ధోని తర్వాత ఐసీసీ టోర్నీల్లో టీమిండియా ప్రదర్శనను చూస్తే ధోని విలువేంటో, అతని గొప్పతనం ఏంటో తెలుస్తుంది.

2011 వరల్డ్‌ కప్‌ ఆడిన జట్టులో చాలా మంది ధోని కంటే ముందే అంతర్జాతీయ క్రికెట్‌లోకి వచ్చి.. ఒక టీమ్‌గా ఆడుతూనే ఉన్నారు. కానీ కప్పు కొట్టలేకపోయారు. అలాగే ధోని తర్వాత ప్రస్తుతం ఉన్న టీమ్‌ కూడా పటిష్టంగానే ఉంది. కానీ ఐసీసీ టోర్నీల వరకు వచ్చేసరికి తేలిపోతుంది. అందుకే ధోని విలువేంటో ఇప్పుడిప్పుడే చాలా మందికి అర్థమవుతోంది. కెప్టెన్సీ అంటే హోదా కాదు, అదో తలకు మించిన భారమని, గెలిపించాల్సిన బాధ్యతని తెలిసి వస్తోంది. కెప్టెన్‌ అంటే పెత్తనం చెలాయించడం కాదని, జట్టును గెలిపించడమని బోధపడుతోంది. ధోని హయాంలో టీమిండియా గెలిచిందంటే అదృష్టం వల్ల కాదు.. అతని మాస్టర్‌ మైండ్‌ వల్ల. అందుకే ధోనికి విజయం బానిసైంది. ధోని అంటే కేవలం పేరు కాదు.. గెలుపుకు కేరాఫ్‌ అడ్రస్‌.