iDreamPost
android-app
ios-app

వరల్డ్‌ కప్‌లో అదరగొట్టేది బాబర్‌ అజమ్‌! కోహ్లీ, రోహిత్‌లను పక్కనపెట్టిన గంభీర్‌

  • Published Sep 23, 2023 | 3:31 PM Updated Updated Sep 23, 2023 | 3:35 PM
  • Published Sep 23, 2023 | 3:31 PMUpdated Sep 23, 2023 | 3:35 PM
వరల్డ్‌ కప్‌లో అదరగొట్టేది బాబర్‌ అజమ్‌! కోహ్లీ, రోహిత్‌లను పక్కనపెట్టిన గంభీర్‌

పాకిస్థాన్‌ అంటే అస్సలు పడని టీమిండియా క్రికెటర్‌గా గౌతమ్‌ గంభీర్‌కు పేరుంది. పాకిస్థాన్‌ ఆటగాళ్లతో గొడవలు, దేశాల మధ్య పరిస్థితుల నేపథ్యంలో గంభీర్‌కు పాక్‌ అంటే కోపం ఉందని చాలా మంది అనుకుంటూ ఉంటారు. పలు సందర్భాల్లో అతను చేసిన వ్యాఖ్యలు కూడా అందుకు కారణం. ఓ ఇంటర్వ్యూలో పాకిస్థాన్‌ అనగానే మీకే ఏం గుర్తు వస్తుంది అని అడగ్గా.. ‘డేంజర్‌’ అని సమాధానం ఇచ్చాడు. ఇలా పాక్‌ను బహిరంగంగా ద్వేషించే క్రికెటర్‌గా గంభీర్‌ను పేర్కొంటూ ఉంటారు. కానీ, తాజాగా గంభీర్‌ చేసిన వ్యాఖ్యలతో క్రికెట్‌ అభిమానులు షాక్‌ అవుతున్నారు.

తాజాగా స్టార్‌స్పోర్ట్స్‌ జరిపిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. త్వరలో జరగనున్న వన్డే వరల్డ్‌ కప్‌లో ఏ ఆటగాడు అద్భుతంగా రాణిస్తాడని భావిస్తున్నారంటూ యాంకర్‌ పలువురు స్టార్‌ క్రికెటర్ల పేర్లు సూచించాడు. అందులో.. టీమిండియా స్టార్‌ క్రికెటర్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మతో పాటు కేన్‌ విలియమ్సన్‌, స్టీవ్‌ స్మిత్‌, బాబర్‌ అజమ్‌, జో రూట్‌, డేవిడ్‌ వార్నర్‌ పేర్లను ప్రస్తావించాడు. వీరిలో ఏ క్రికెటర్‌ వరల్డ్‌ కప్‌లో అదరగొడతాడని మీరు భావిస్తున్నారని అడగ్గా.. గంభీర్‌ షాకింగ్‌ సమాధానం ఇచ్చాడు. అక్టోబర్‌ 5 నుంచి ప్రారంభం కానున్న వరల్డ్‌ కప్‌ టోర్నీలో బాబర్‌ అజమ్‌ అద్బుతంగా ఆడతాడని పేర్కొన్నాడు.

బాబర్‌ అజమ్‌లో అన్ని క్వాలిటీస్‌ ఉన్నాయని, ఈ వరల్డ్ కప్‌లో అతను అదరగొడతాడని గంభీర్‌ పేర్కొన్నాడు. గంభీర్‌ ఇచ్చిన ఈ సమాధానంతో భారత క్రికెట్‌ అభిమానులు షాక్‌కు గురవుతున్నారు. విరాట్‌ కోహ్లీ, రోహత్‌ శర్మ లాంటి బ్యాటర్లను కాదని, గంభీర్‌.. బాబర్‌ను ఎంపిక చేసుకోవడాన్ని తాము నమ్మలేకపోతున్నామని ఇండియన్‌ క్రికెట్‌ ఫ్యాన్స్‌ అంటున్నారు. గంభీర్‌ వ్యాఖ్యలతో చాలా మంది ఫ్యాన్స్‌ ఏకీభవించడం లేదు.. ఈ సారి వరల్డ్‌ కప్‌లో భారత క్రికెటర్లే అద్భుతంగా రాణిస్తారని, ప్రస్తుతం టీమ్‌ ఎలాంటి ఫామ్‌లో ఉందో అందరికి తెలిసిందే అని అంటున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: పిచ్చి ప్రయోగాలన్నాం.. కానీ, ఇప్పుడు ద్రవిడ్‌ వల్లే టీమ్‌ సూపర్‌గా ఉంది!