Tirupathi Rao
Tirupathi Rao
ఆసియా క్రీడలు-2023 సమీపిస్తున్నాయి. సెప్టెంబర్ 23 నుంచి అక్టోబర్ 8 వరకు చైనాలోని హాంగ్జూలో ఈ గేమ్స్ జరగనున్నాయి. పతకాలు పంట పండించాలని భారత అథ్లెట్లు ఉవ్విళ్లూరుతున్నారు. ఈసారి ఆసియా క్రీడల కోసం భారత్ నుంచి మొత్తం 634 మంది అథ్లెట్లు వెళ్లనున్నారు. ట్రాక్ అండ్ ఫీల్డ్, క్రికెట్, ఫుడ్ బాల్, హాకీ, బ్యాడ్మింటన్, వెయిట్ లిఫ్టింగ్ ఇలా మొత్తం 38 క్రీడాంశాల్లో భారత అథ్లెట్లు పాల్గొననున్నారు. అందుకు సంబంధించి కేంద్ర క్రీడాశాఖ ఆమోదం తెలిపింది.
2018 జకార్తా వేదికగా భారత్ సత్తా చాటిన విషయం తెలిసిందే. 572 మంది క్రీడాకారులతో భారత్ ఆసియా క్రీడల్లో పాల్గొంది. మొత్తం 70 పతకాలు సాధించింది. వాటిలో అథ్లెటిక్స్ కు 20 పతకాలు దక్కాయి. నీరజ్ చోప్రా బంగారు పతకం నెగ్గి.. జావెలిన్ త్రోలో గోల్డ్ మెడల్ నెగ్గిన తొలి ఇండియన్ గా చరిత్ర సృష్టించాడు. 100 మీటర్స్ లో 1982లో పీటీ ఉష సిల్వర్ నెగ్గిన తర్వాత మళ్లీ 2018లో ద్యుతీ చంద్ మెడల్ నెగ్గే వరకు మనకు మెడల్ రాలేదు. ఇప్పుడు 2023 హోంగ్జూ వేదికగా జరుగుతున్న ఆసియా క్రీడల్లో కూడా ఇలాంటి ఒక ప్రదర్శననే అభిమానులు కోరుకుంటున్నారు. గతసారి కంటే ఎక్కువ మెడల్స్ భారత్ సాధించాలని ఆకాంక్షిస్తున్నారు.
ఆసియా క్రీడలు-2023కి భారత్ నుంచి ట్రాక్ అండ్ ఫీల్డ్ కు సంబంధించి మొత్తం 65 మంది అథ్లెట్లు వెళ్లనున్నారు. 34 మంది పురుషులు కాగా.. 31 మంది మహిళా అథ్లెట్లు ఉన్నారు. హాకీకి సంబంధించి మొత్తం 36 మంది, క్రికెట్ జట్ల నుంచి 30 మంది ప్లేయర్స్, పురుష, మహిళా పుట్ బాల్ టీమ్స్ నుంచి 44 మంది హోంగ్జూ వెళ్లనున్నారు. షూటింగ్, సెయిలింగ్ లో కూడా భారత్ తనదైన ముద్ర వేసే అవకాశం లేకపోలేదు. షూటింగ్ కోసం 30 మంది, సెయిలింగ్ కోసం 33 మంది వెళ్తున్నారు. ఆసియా క్రీడల్లో భారత స్టార్లను చూస్తే నీరజ్ చోప్రా, పీవీ సింధు, మీరాబాయి చాను, సునీల్ ఛేత్రీ, హర్మన్ ప్రీత్ సింగ్, హెచ్ఎస్ ప్రణయ్, లక్ష్యసేన్, బజరంగ్ పూనియా వంటి వాళ్లు ఉన్నారు. ఇంకా జిమ్నాస్టిక్స్, హ్యాండ్ బాల్, రగ్బీ, వెయిట్ లిఫ్టింగ్ విభాగాలకు సంబంధించి లిస్టు విడుదల కాలేదు.
క్రికెట్ కోసం అయితే చైనాకు క్రికెటర్లను పంపేందుకు బీసీసీఐ అంగీకరించింది. మహిళా, పురుషుల జట్లు ఆసియా క్రీడల్లో పాల్గొంటాయి. అయితే వరల్డ్ కప్ నేపథ్యంలో పురుషుల నుంచి ద్వితీయ శ్రేణి ప్లేయర్లను మాత్రమే పంపనున్నారు. ఉమెన్ టీమ్ నుంచి స్టార్లు అందరూ ఆసియా క్రీడల్లో పాల్గొంటున్నారు. పురుషుల జట్టుకు రుతురాజ్ గైక్వాడ్ కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. రింకూ సింగ్, తిలక్ వర్మ, యశస్వీ జైస్వాల్ వంటి యంగ్ క్రికెటర్స్ ఏషియన్ గేమ్స్ లో పాల్గొంటారు. క్రికెట్ నుంచి కూడా భారత్ కు పతకాలు వస్తాయని అభిమానులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆసియా క్రీడల్లో భారత అథ్లెట్లు అద్భుతంగా రాణించాలని కోరుకుంటున్నారు.