iDreamPost
android-app
ios-app

Finn Allen: పాక్ టీమ్‌ని ఊచకోత కోశాడు! ఏకంగా 16 సిక్సులుతో..!

  • Published Jan 17, 2024 | 12:41 PM Updated Updated Jan 17, 2024 | 12:41 PM

పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ విధ్వంసం సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 సిక్సులతో పాక్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..

పాకిస్థాన్‌తో జరిగిన మూడో టీ20లో న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ విధ్వంసం సృష్టించాడు. ఒకటి కాదు రెండు కాదు.. ఏకంగా 16 సిక్సులతో పాక్‌ బౌలర్లను ఊచకోత కోశాడు. ఈ విధ్వంసకర ఇన్నింగ్స్‌కు సంబంధించి మరిన్ని విశేషాలు ఇప్పుడు చూద్దాం..

  • Published Jan 17, 2024 | 12:41 PMUpdated Jan 17, 2024 | 12:41 PM
Finn Allen: పాక్ టీమ్‌ని ఊచకోత కోశాడు! ఏకంగా 16 సిక్సులుతో..!

వామ్మో ఇదేం బ్యాటింగ్‌.. అని అనుకునేలా ఆడాడు న్యూజిలాండ్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌. విధ్వంసం అనే పదానికి అర్థం చెబుతూ సాగిన ఆ ఇన్నింగ్స్‌ టీ20 క్రికెట్‌ చరిత్రలోనే ఒక అద్భుతమైన ఇన్నింగ్స్‌గా నిలబడిపోతుంది. పైగా ఈ సూపర్‌ ఇన్నింగ్స్‌ ఆడింది పాకిస్థాన్‌పై కావడం విశేషం. ప్రస్తుతం న్యూజిలాండ్‌ పర్యటనలో ఉన్న పాకిస్థాన్‌.. బుధవారం యూనివర్సిటీ ఓవెల్‌లో మూడో టీ20లో తలపడింది. ఈ మ్యాచ్‌లో కివీస్‌ ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ పాకిస్థాన్‌ బౌలింగ్‌ ఎటాక్‌ను చీల్చిచెండాడు. కెప్టెన్‌ షాహీన్‌ షా అఫ్రిదీ, జమన్‌ ఖాన్‌, హరీస్‌ రౌఫ్‌, మొహమ్మద్‌ నవాజ్‌, మొహమ్మద్‌ వసీం జూనియర్‌ ఇలా ఎవరూ కూడా ఫిన్‌ అలెన్‌ ముందుకు నిలువలేకపోయారు. అలెన్‌ ఆడుతున్న తీరు చూస్తే.. టీ20ల్లో కూడా డబుల్‌ సెంచరీ నమోదు అవుతుందేమో అనిపించిందంటే అతిశయోక్తి కాదు. ఎందుకంటే.. అతని విధ్వంసం అలా సాగింది.

కేవలం 62 బంతుల్లోనే 5 ఫోర్లు, 16 సిక్సులతో 137 పరుగులు చేసి.. టీ20 క్రికెట్‌లో న్యూజిలాండ్‌ తరఫున అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ను నమోదు చేశాడు. ఈ మ్యాచ్లో పాకిస్థాన్‌ స్టార్‌ బౌలర్‌ హరీస్‌ రౌఫ్‌ను అయితే అలెన్‌ మరీ దారుణంగా కొట్టాడు. అతను వేసిన ఓ ఓవర్‌లో ఏకంగా 6,4,4,6,6,1 పరుగుల వరద పారించాడు. ఆ ఓవర్‌లో ఏకంగా 27 రన్స్‌ పిండుకున్నాడు. ఇక ఇన్నింగ్స్‌ చివర్లో జమన్ ఖాన్‌ బౌలింగ్‌ అలెన్‌ అవుట్‌ అయి.. సూపర్‌ ఇన్నింగ్స్‌ను ముగించాడు. ఇక ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్‌ చేసిన న్యూజిలాండ్‌ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 224 పరుగులు చేసింది. ఓపెనర్‌ ఫిన్‌ అలెన్‌ 137, వన్‌ డౌన్‌ బ్యాటర్‌ షైఫర్డ్‌ 31 పరుగులుతో రాణించారు. మిగతా బ్యాటర్లలో గ్లెన్‌ ఫిలిప్స్‌ డబుల్‌ డిజిట్‌ స్కోర్‌ చేశాడు.

ఇక 225 పరుగుల భారీ లక్ష్యఛేదనకు దిగిన పాకిస్థాన్‌కు సోధీ ఆరంభంలోనే షాకిచ్చాడు. పాక్‌ యువ విధ్వంసకర ఓపెనర్‌ సైమ్‌ అయ్యుబ్‌ని కేవలం 10 పరుగులకే అవుట్‌ చేశాడు. ఆ తర్వాత బాబర్‌ అజమ్‌-రిజ్వాన్‌ కలిసి కొద్ది సేపు పాకిస్థాన్‌ను ఇన్నింగ్స్‌ను ముందుకు నడిపించినా.. రిజ్వాన్‌ కూడా తక్కువ స్కోర్‌కే అవుట్‌ అయ్యాడు. కేవలం 24 పరుగులు చేసి వికెట్‌ సమర్పించుకున్నాడు. పాకిస్థాన్‌ ఇన్నింగ్స్‌లో బాబర్‌ అజమ్‌ ఒక్కడే.. 37 బంతుల్లో 8 ఫోర్లు, ఒక్క సిక్స్‌తో 58 పరుగులు చేశాడు. మిగతా బ్యాటర్లంతా దాదాపు విఫలం అయ్యారు. లక్ష్యం పెద్దది కావడంతో బాబర్‌ పోరాటం సరిపోలేదు. చివర్లో మొహమ్మద్‌ నవాజ్‌ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సులతో కొద్ది సేపు మెరుపులు మెరిపించాడు. మొత్తంగా.. 20 ఓవర్లు ముగిసే సరికి పాకిస్థాన్‌ 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు మాత్రమే చేసింది. దీంతో న్యూజిలాండ్‌ 45 పరుగుల తేడాతో విజయం సాధించి.. ఐదు టీ20ల సిరీస్‌ను మరో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే కైవసం చేసుకుంది. మరి ఈ మ్యచ్‌లో ఫిన్‌ అలెన్‌ సృష్టించిన విధ్వంసం గురించి మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.