iDreamPost
android-app
ios-app

వీడియో: టీమిండియా కుర్రాళ్లు-బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ మధ్య గొడవ!

  • Published Jul 22, 2023 | 11:52 AM Updated Updated Jul 22, 2023 | 11:52 AM
  • Published Jul 22, 2023 | 11:52 AMUpdated Jul 22, 2023 | 11:52 AM
వీడియో: టీమిండియా కుర్రాళ్లు-బంగ్లాదేశ్‌ బ్యాటర్‌ మధ్య గొడవ!

ఏసీసీ మెన్స్‌ ఎమర్జింగ్‌ టీమ్స్‌ ఆసియా కప్‌ 2023లో భారత కుర్రాళ్లు దుమ్మలేపుతున్నారు. శుక్రవారం బంగ్లాదేశ్‌తో జరిగిన సెమీ ఫైనల్‌లో అదరగొట్టిన యువ టీమిండియా ఫైనల్‌కు దూసుకెళ్లింది. ఇక ఆదివారం చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో తలపడనుంది. కాగా, బంగ్లాదేశ్‌తో సెమీస్‌ మ్యాచ్‌ సందర్భంగా భారత్‌ కుర్రాళ్లకు-బంగ్లాదేశ్‌ సీనియర్‌ బ్యాటర్‌ సౌమ్య సర్కార్ మధ్య చిన్న గొడవ జరిగింది. టీమిండియా నిర్దేశించిన 212 పరుగుల టార్గెట్‌ను ఛేదించే క్రమంలో 123 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో బ్యాటింగ్‌కు దిగిన సౌమ్య సర్కార్‌ను టీమిండియా కుర్రాళ్లు త్వరగానే పెవిలియన్‌ చేర్చారు.

యువరాజ్‌సింగ్ దోడియా వేసిన ఇన్నింగ్స్‌ 26వ ఓవర్‌ రెండో బంతికి సర్కార్‌ లెగ్‌ సైడ్‌ ఆడే ప్రయత్నం చేశాడు. అది కాస్త ఎడ్జ్‌ తీసుకుని గాల్లోకి లేచింది. దాన్ని స్లిప్‌లో ఉన్న నికిన్ జోస్ అద్భుతంగా డైవ్‌ చేస్తూ క్యాచ్‌ అందుకున్నాడు. దీంతో సౌమ్య సర్కార్‌ అవుట్‌ అయ్యాడు. అవుటైన అసహనంలో భారత కుర్రాళ్లపై నోరు పారేసుకున్నాడు. దానికి హర్షిత్‌ రాణా సైతం ధీటుగానే బదులిచ్చాడు. అసలే యువ రక్తం, అందులోనూ మాటంటే పడని టీమిండియా కుర్రాళ్లు ఊరుకుంటారా? సౌమ్య సర్కార్‌తో గొడవకు దిగారు. అంపైర్‌ మధ్యలో కలగజేసుకుని కుర్రాళ్లను సముదాయించడంతో గొడవ సర్దుమణిగింది. లేకుంటే.. సౌమ్య సర్కార్‌పై భారత కుర్రాళ్లు దూసుకుపోయేవారు.

ఇక మ్యాచ్‌ విషయానికి వస్తే.. తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత-ఏ జట్టు 49.1 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్‌ అయింది. ఓపెనర్లు సాయి సుదర్శన్‌(21), అభిషేక్‌ శర్మ(34) పరుగులు చేసి అవుట్‌ అయ్యారు. కెప్టెన్‌ యశ్‌ ధుల్‌ 66 పరుగులతో రాణించాడు. ఇతర బ్యాటర్లు పెద్దగా పరుగులేమీ చేయకపోవడంతో భారత్‌ 211 పరుగులు మాత్రమే చేసింది. కష్టసాధ్యం కానీ లక్ష్యంతో బరిలోకి దిగిన బంగ్లాదేశ్‌ను టీమిండియా బౌలర్లు వణికించారు.

ముఖ్యంగా నిశాంత్‌ సింధూ 5 వికెట్లతో సత్తా చాటాడు. మనవ్‌ సుథర్‌ 3 వికెట్లు, యువరాజ్‌ సింగ్‌, అభిషేక్‌ శర్మ చెరో వికెట్‌ పడగొట్టారు. దీంతో బంగ్లా కేవలం 160 పరుగులకే కుప్పకూలింది. టీమిండియా 51 రన్స్‌ తేడాతో ఘనవిజయం సాధించి సగర్వంగా ఫైనల్లోకి అడుగుపెట్టింది. ఆదివారం పాకిస్థాన్‌తో అమీతుమీ తేల్చుకోనుంది. మరి ఈ మ్యాచ్‌లో సౌమ్య సర్కార్‌-భారత కుర్రాళ్ల మధ్య జరిగిన గొడవపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: సచిన్‌ రికార్డ్‌ను బ్రేక్‌ చేసిన కోహ్లీ! ప్రపంచంలోనే తొలి క్రికెటర్‌గా..