iDreamPost
android-app
ios-app

IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయం.. ఓటమికి 5 కారణాలు

  • Published Jan 28, 2024 | 6:28 PM Updated Updated Jan 28, 2024 | 6:28 PM

టీమిండియాతో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

టీమిండియాతో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

IND vs ENG: ఇంగ్లాండ్ చేతిలో భారత్ పరాజయం.. ఓటమికి 5 కారణాలు

టీమిండియాతో జరుగుతున్న 5 టెస్ట్ మ్యాచ్ ల సిరీస్ లో ఇంగ్లాండ్ బోణీ కొట్టింది. హైదరాబాద్ వేదికగా జరిగిన ఫస్ట్ మ్యాచ్ లో 28 పరుగుల తేడాతో విజయం సాధించింది ప్రత్యర్థి టీమ్. దీంతో సిరీస్ లో 1-0తో ముందంజలోకి దూసుకెళ్లింది ఇంగ్లీష్ టీమ్. చివరి వరకు పోరాడినా ఫలితం మాత్రం దక్కలేదు. ప్రత్యర్థి బౌలర్ల ధాటికి 231 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని సైతం ఛేదించలేక చతికిలపడింది టీమిండియా. ఇక ఈ మ్యాచ్ లో భారత్ ఓటమికి 5 ప్రధాన కారణాలు ఉన్నాయి. అవేంటో ఓసారి పరిశీలిద్దాం.

టీమిండియా ఓటమికి 5 కారణాలు!

1. ఓలీ పోప్

టీమిండియా ఈ మ్యాచ్ లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇంగ్లాండ్ వన్ డౌన్ బ్యాటర్ ఓలీ పోప్. తొలి ఇన్నింగ్స్ లో ఒక్క రన్ మాత్రమే చేసిన ఇతడు, రెండో ఇన్నింగ్స్ లో చెలరేగిపోయాడు. క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న టీమ్ ను అసాధారణ బ్యాటింగ్ తో మ్యాచ్ లో నిలిపాడు. మారథాన్ ఇన్నింగ్స్ ఆడి తన టీమ్ కు 231 పరుగుల ఆధిక్యాన్ని తెచ్చిపెట్టాడు. 278 బంతులు ఎదుర్కొని 21 ఫోర్లతో 196 పరుగులు చేశాడు పోప్. సహచర బ్యాటర్ల నుంచి వచ్చిన కొద్ది సహకారంతోనే తన టీమ్ కు విజయాన్ని కట్టబెట్టాడు. టీమిండియా బౌలర్లను అలవోకగా ఎదుర్కొన్నాడు పోప్. ఇతడిని కట్టడిచేడయంలో మన బౌలర్లు దారుణంగా విఫలం అయ్యారు. భారత్ ఓడిపోవడానికి ప్రధాన కారణం ఓలీ పోపే ఇందులో ఎలాంటి సందేహం లేదు.

2. బౌలింగ్ వైఫల్యం

ఇక టీమిండియా ఓటమికి రెండో కారణం బౌలింగ్ వైఫల్యం. తొలి ఇన్నింగ్స్ లో అద్భుతంగా రాణించిన బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్ కి వచ్చే సరికి చేతులెత్తేశారు. ఇంగ్లాండ్ ను తొలి ఇన్నింగ్స్ లో 246 పరుగులకే ఆలౌట్ చేసిన భారత బౌలర్లు.. రెండో ఇన్నింగ్స్ లో 420 రన్స్ కొట్టేలా చేశారు. సీనియర్ బౌలర్లు అయిన రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, బుమ్రా, సిరాజ్, అక్షర్ పటేల్ పూర్తిగా విఫలం అయ్యారనే చెప్పాలి. వీరిలో ఏ ఒక్కరు కూడా 5 వికెట్లు తీయలేకపోయారు. ముఖ్యంగా ఓలీ పోప్ ను పెవిలియన్ కు చేర్చడంలో విఫలం అయ్యారు. దాంతో అతడు రెచ్చిపోయి భారీ సెంచరీతో కదంతొక్కాడు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో చూపించిన పట్టును సెకండ్ ఇన్నింగ్స్ లో చూపించలేకపోయారు భారత బౌలర్లు. మరీ ముఖ్యంగా సిరాజ్ అసలు మ్యాచ్ లో ఉన్నాడా? లేడా? అన్న అనుమానం కలిగింది.

3. చెత్త ఫీల్డింగ్

భారత ఓటమికి మరో కారణం చెత్త ఫీల్డింగ్. ఈ మ్యాచ్ లో పూర్ ఫీల్డింగ్ తో టీమిండియా దారుణ ఓటమిని మూటగట్టుకుంది. జడేజా బౌలింగ్ లో ఓలీ పోప్ 110 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఇచ్చిన క్యాచ్ ను అక్షర్ పటేల్ డ్రాప్ చేశాడు. దాంతో లైఫ్ లభించిన అతడు మరో 86 పరుగులు జోడించాడు. దీంతో ఇంగ్లాండ్ ఆధిక్యం పెరిగిపోయింది. ఈ క్యాచ్ గనుక పట్టిఉంటే.. మ్యాచ్ రిజల్ట్ వేరే విధంగా ఉండేది. దీంతో పాటుగా నాలుగు రోజుల ఆటలో టీమిండియా ఆటగాళ్ల ఫీల్డింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తూ వస్తోంది. రనౌట్లు, రన్స్ వదిలేయడాలు లాంటి మిస్టేక్స్ అన్ని కలిసి జట్టు ఓటమికి దారితీశాయి.

4. బ్యాటింగ్

ఈ మ్యాచ్ లో తొలి ఇన్నింగ్స్ లో సత్తా చాటిన టీమిండియా ప్లేయర్లు సెకండ్ ఇన్నింగ్స్ కు వచ్చే వరకు పూర్తిగా చేతులెత్తేశారు. లక్ష్యం చిన్నదే అయినప్పటికీ.. ఒత్తిడిలోనై త్వరత్వరగా వికెట్లను పోగొట్టుకున్నారు. ఫస్ట్ ఇన్నింగ్స్ లో రాణించిన యశస్వీ జైస్వాల్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజాలు సెకండ్ ఇన్నింగ్స్ లో దారుణంగా విఫలం అయ్యారు. మిగతా బ్యాటర్లు మెుత్తానికే నిరాశపరిచారు. మరీ ముఖ్యంగా శుబ్ మన్ గిల్ తన పూర్ ఫామ్ తో విమర్శలపాలవుతున్నాడు. చాలా కాలం తర్వాత జట్టులోకి వచ్చిన శ్రేయస్ అయ్యర్ సత్తా చాటలేకపోయాడు. అవకాశం వచ్చిన రాణించడంలో తెలుగు తేజం శ్రీకర్ భరత్ నిరాశపరిచాడు. టాపార్డర్ పూర్తిగా విఫలం కావడం ఇంగ్లాండ్ కు కలిసొచ్చింది. అయితే టీమిండియా ఓటమికి మెయిన్ రీజన్ గా బ్యాటింగ్ వైఫల్యం అని చెప్పుకోవచ్చు.

5. కోహ్లీ లేకపోవడం

టీమిండియా రన్ మెషిన్ కింగ్ కోహ్లీ ఈ మ్యాచ్ కు అందుబాటులో లేడు. తన వ్యక్తిగత కారణాలతో తొలి టెస్ట్ కు దూరంగా ఉన్నాడు. ఇది కూడా భారత జట్టు ఓటమికి ఒక కారణం. ఎందుకంటే? కీలక బ్యాటర్ అయిన కోహ్లీ జట్టులో లేకపోవడంతో.. టీమ్ సమతూకం దెబ్బతిన్నది. పైగా గ్రౌండ్ లో కోహ్లీ తన సహచర ఆటగాళ్లను ఎలా ప్రోత్సహిస్తాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. మైదానంలో చిరుతలా కదులుతూ.. ప్రత్యర్థులను చిత్తుచేయడంలో కోహ్లీ కింగ్. బ్యాటింగ్, ఫీల్డింగ్, గ్రౌండ్ లో ప్లేయర్లలో జోష్ నింపడం లాంటి విషయాల్లో కోహ్లీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఈ లోటు కాస్త టీమిండియా పరాజయానికి ఓ కారణంగా మారింది. కాగా.. ఈ మ్యాచ్ లో భారత్ ఓడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.