iDreamPost
android-app
ios-app

ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు!

ఇంగ్లాండ్ స్టార్ పేసర్ స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు!

ఇంగ్లాండ్ దిగ్గజ ఆటగాడు.. ప్రపంచ క్రికెట్ లో చెప్పుకోదగ్గ పేసర్లలో ఒకడైన స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. యాషెస్ సిరీస్ జరుగుతున్న సమయంలో ఒక్క ఇంగ్లాండ్ ఆటగాళ్లు, ఫ్యాన్స్ కి మాత్రమే కాదు.. బ్రాడ్ తీసుకున్న నిర్ణయం యావత్తు క్రికెట్ ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురి చేసింది. ఎందుకంటే 37 ఏళ్ల ఈ స్టార్ పేసర్ ఇప్పటికీ అత్యుత్తమ ప్రదర్శననే చేస్తున్నాడు. రిటైర్మెంట్ ప్రకటనకు ముందు కూడా యాషెస్ సిరీస్ లో ఆసీస్ పై 150 వికెట్లు అందుకున్న మొట్ట మొదటి ఇంగ్లాండ్ బౌలర్ గా చరిత్ర సృష్టించాడు. అలాంటి బౌలర్ ఇలాంటి దశలో రిటైర్మెంట్ ప్రకటించడం అందరినీ షాక్ కు గురి చేసింది.

ఓవల్ వేదికగా యాషెస్ టెస్టు సిరీస్ లో ఐదో టెస్టు మూడో రోజు ఆట ముగిసిన తర్వాత స్టువర్ట్ బ్రాడ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. ఆదివారం గానీ, సోమవారం గానీ తన అంతర్జాతీయ కెరీర్ లో చివరి గేమ్ అవుతుందని ప్రకటించాడు. స్టువర్డ్ బ్రాడ్ టెస్టు చరిచ్రలో 602 వికెట్లతో ఐదో అత్యుత్తమ బౌలర్ గా ఉన్నాడు. ఇప్పటి వరకు తన కెరీర్ ఎంతో అద్భుతంగా ఉందని, ప్రతి క్షణాన్ని తాను ఆశ్వాదించానని చెప్పుకొచ్చాడు. నాటింగహామ్ షైర్, ఇంగ్లాండ్ బ్యాడ్జ్ లను ఇంతకాలం ధరించే అవకాశం దక్కడంపై గర్వంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు.

స్టువర్ట్ బ్రాడ్ కెరీర్ విషయానికి వస్తే.. ఇంగ్లాండ్ ఓపెనర్ క్రిస్ బ్రాడ్ కుమారుడే స్టువర్ట్ బ్రాడ్. 2006లో స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ లో అరంగేట్రం చేశాడు. ఇంగ్లాండ్ తరఫున మూడు ఫార్మాట్లలో ఆడటం మొదలు పెట్టాడు. అంతర్జాతీయ క్రికెట్ లో అడుగుపెట్టిన ఏడాదికే.. బ్రాడ్ కు యువరాజ్ సింగ్ రూపంలో ఎదురైన ఘటన మరే బౌలర్ కు ఎదురైనా క్రికెట్ కు గుడ్ బై చెప్పేవాళ్లేమో? కానీ, బ్రాడ్ మాత్రం నిరూత్సాహ పడకుండా ముందుకు సాగాడు. టెస్టు క్రికెట్ లో అత్యుత్తమ బౌలర్లలో ఒకడిగా నిలిచాడు. ఇంగ్లాండ్ బౌలింగ్ విభాగంలో స్టువర్ట్ బ్రాడ్ వెన్నెముకగా నిలిచాడు. ప్రస్తుతం బ్రాడ్ ఆడుతోంది 167వ టెస్టు.

తన కెరీర్ లో ఇప్పటి వరకు 602 వికెట్లు పడగొట్టాడు. అలాగే 121 వన్డేల్లో బ్రాడ్ మొత్తం 178 వికెట్లు తీసుకున్నాడు. 56 టీ20లు ఆడిన బ్రాడ్ 65 వికెట్లు దక్కించుకున్నాడు. స్టువర్ట్ బ్రాడ్ అనగానే బౌలింగ్ మాత్రమే కాదు.. బ్యాటింగ్ లో కూడా బ్రాడ్ తన మార్క్ ని వదిలాడు. టెస్టుల్లో ఒక సెంచరీ, 13 హాఫ్ సెంచరీస్ తో కలిపి మొత్తం 3,647 పరుగులు చేశాడు. యాషెస్ సిరీస్ గెలిచిన జట్టులో నాలుగుసార్లు తన భాగస్వామ్యం ఉంది. 2010లో టీ20 వరల్డ్ కప్ గెలిచిన జట్టుకు బ్రాడ్ ప్రాతినిధ్యం వహించాడు. స్టువర్ట్ బ్రాడ్ అంతర్జాతీయ క్రికెట్ కు వీడ్కోలు పలకడం నిజంగా ఇంగ్లాండ్ కు గట్టి ఎదురుదెబ్బే అవుతుంది. యాషెస్ సిరీస్ తో తన కెరీర్ ను ముగించాలని స్టువర్ట్ బ్రాడ్ భావిస్తున్న విషయం తెలిసిందే.