MS ధోని, రవీంద్ర జడేజా.. ఐపీఎల్ 2023 చివరి దశలో ఇండియన్ క్రికెట్ లో మారుమ్రోగిన పేర్లు. దానికి కారణం వారిద్దరి మధ్య గొడవలు జరిగాయని, అందుకే వారు మాట్లాడుకోవట్లేదని పెద్ద ఎత్తున న్యూస్ వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ఈ వాదనకు బలాన్ని చేకూర్చేవిధంగా జడేజా చేసిన ట్వీట్ తీవ్ర దుమారాన్ని లేపింది. ఇక ధోని,జడేజాల గొడవపై తాజాగా స్పందించారు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్. గొడవకు సంబంధించి పూర్తి క్లారిటీ ఇచ్చాడు సీఈఓ.
ఎంఎస్ ధోని, రవీంద్ర జడేజా ల మధ్య ఎలాంటి వివాదాలు లేవని చెన్నై సూపర్ కింగ్స్ టీమ్ సీఈఓ కాశీ విశ్వనాథన్ స్పష్టం చేశారు. కానీ జడేజాను మాత్రం ఓ విషయం కచ్చితంగా బాధించి ఉండొచ్చన్నది నా అభిప్రాయమని ఆయన పేర్కొన్నారు. ఇక ధోని, జడేజా వివాదాంపై పూర్తి క్లారిటీ ఇచ్చారు సీఎస్కే సీఈఓ. ఆయన మాట్లాడుతూ..”రవీంద్ర జడేజా అద్భుతమైన బౌలర్ అందులో ఎలాంటి సందేహం లేదు. అయితే బ్యాటింగ్ విషయానికి వచ్చేసరికి.. రుతురాజ్, కాన్వే, మెుయిన్ అలి, రహానే లతో చెన్నై జట్టు ఉంది. దాంతో జడేజా బ్యాటింగ్ కు వచ్చే సమయానికి కేవలం రెండు ఓవర్లు మాత్రమే ఉంటాయి. దాంతో అతడు క్లిక్ అయితే అవుతాడు, లేదా ఔట్ అవుతాడు. ఇక జడేజా తర్వాత ధోని బ్యాటింగ్ కు దిగుతాడు కాబట్టి.. ఎక్కువ మంది అభిమానులు ధోని ఆటనే చూడాలని కోరుకుంటారు. దాంతో సహజంగానే జడేజా అవుట్ కావాలని ఫ్యాన్స్ ప్రార్థిస్తుంటారు. అది జడేజా కావొచ్చు మరే ఇతర బ్యాటరైనా కావొచ్చు. అంతే తప్ప వారిద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు” అని కాశీ విశ్వనాథన్ చెప్పుకొచ్చాడు.
అసలు ఏం జరిగింది అంటే.. ఐపీఎల్ 2023లో దిల్లీతో మ్యాచ్ సందర్భంగా ధోని, జడేజాల మధ్య వాగ్వాదం జరిగినట్లు పెద్ద ఎత్తున వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అదీకాక జడేజా చేసిన ట్వీట్ దీనికి బలాన్ని చేకూర్చింది.”కర్మ అనేది తప్పదు. వెంటనే కావొచ్చు లేదా కాస్త ఆలస్యంగానైనా తిరిగివస్తుంది” అంటూ ఆ ట్వీట్ లో రాసుకొచ్చాడు. ఈ వార్తలన్నింటికి సీఎస్కే CEO పూర్తి క్లారిటీ ఇచ్చారు.