అన్ని ఆటల్లోలాగే క్రికెట్లోనూ చాలా రూల్స్ ఉన్నాయి. ఏ జట్టైనా, ఎంతటి ప్లేయర్ అయినా నియమ నిబంధనలకు లోబడే ఆడాల్సి ఉంటుంది. కాదని రూల్స్‌ను మీరితే క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోక తప్పదు. అయితే ఇష్టం వచ్చినట్లు ఏ రూల్‌ను పడితే ఆ రూల్‌ను ఆటగాళ్లపై రుద్దకుండా.. క్రికెట్‌కు, క్రికెటర్లకు మంచివనే నిబంధనలను తీసుకొస్తే మంచిదని విశ్లేషకులు అంటుంటారు. తాజాగా క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ) ఒక కొత్త రూల్‌ను తీసుకొచ్చింది. ఇకపై ఆసీస్ తరఫున డొమెస్టిక్ క్రికెట్‌తో పాటు ఇంటర్నేషనల్ మ్యాచ్‌లు ఆడే ప్లేయర్లు నెక్ గార్డ్‌ను ధరించాల్సిందేనని క్రికెట్ ఆస్ట్రేలియా స్పష్టం చేసింది.
క్రికెటర్లు నెక్ గార్డ్ పెట్టుకోవాలనే నిబంధనను అక్టోబర్ 1వ తేదీ నుంచి అమల్లోకి తీసుకొస్తున్నట్లు ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు తెలిపింది. ఈ రూల్‌ను పాటించకపోతే ప్లేయర్లపై ఆంక్షలు తప్పవని వార్నింగ్ ఇచ్చింది. నెక్ గార్డ్ అంటే బ్యాటింగ్ చేసేటప్పుడు ధరించే హెల్మెట్‌కు వెనుక భాగంలో రక్షణగా వేసుకునేది. నెక్ గార్డ్ వల్ల పేస్ బౌలర్లు వేసే బౌన్సర్ల వల్ల మెడ భాగంలో గాయం తగలకుండా తప్పించుకోవచ్చు. ఒకవేళ నెక్ గార్డ్‌కు బాల్ తగిలినా పెద్ద గాయమేమీ కాదని విశ్లేషకులు అంటున్నారు. బ్యాట్స్‌మెన్ సేఫ్టీ కోసం నెక్ గార్డ్‌ను తప్పకుండా ధరించాలని 2014 నుంచి క్రికెట్ ఆస్ట్రేలియా మొత్తుకుంటోంది.
ఆస్ట్రేలియా మాజీ బ్యాటర్ ఫిలిప్ హ్యూజ్ అప్పట్లో ఇలాగే ఓ రాకాసి బౌన్సర్ దెబ్బకు కుప్పకూలి ప్రాణాలు కోల్పోయిన విషయం గుర్తుండే ఉంటుంది. హ్యూజ్ మరణంతో బ్యాటర్లు తప్పకుండా నెక్ గార్డ్ వాడాలని ఆసీస్ బోర్డు చెబుతూ వస్తోంది. కానీ దీన్ని ఎవరూ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. డేవిడ్ వార్నర్, స్టీవ్ స్మిత్ లాంటి టాప్ కంగారూ ప్లేయర్లు కూడా నెక్ గార్డ్ ధరించకపోవడం గమనార్హం. ఒకసారి ఇంగ్లండ్ పేసర్ జోఫ్రా ఆర్చర్ వేసిన బౌన్సర్‌కు నెక్ గార్డ్ లేకపోవడంతో స్మిత్ తలకు గాయమై తల్లడిల్లాడు. అయినా అతడు నెక్ గార్డ్‌ను వాడలేదు.
ఇటీవల సౌతాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో ఆసీస్ ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్ కూడా ఇదే రీతిలో కగిసో రబాడ వేసిన బౌన్సర్‌కు గాయాలపాలై దూరమయ్యాడు. ఈ నేపథ్యంలో నెక్ గార్డ్ వినియోగించాల్సిందేనని కొత్తగా నిబంధనను తీసుకొచ్చింది ఆస్ట్రేలియా క్రికెట్ బోర్డు. బ్యాట్స్‌మెన్ నెక్ గార్డు ధరించడం వల్ల వారి మెడకు రక్షణ లభిస్తుందని క్రికెట్ ఆస్ట్రేలియా హెడ్ ఆఫ్ క్రికెట్ ఆపరేషన్స్ పీటర్ రోచ్ తెలిపారు. కంగారూ క్రికెటర్లందరూ అక్టోబర్ 1 నుంచి ఈ రూల్‌ను పాటించాల్సిందేనని స్పష్టం చేశారు. మరి.. బ్యాటర్లు నెక్ గార్డ్ ధరించాల్సిందేనంటూ క్రికెట్ ఆస్ట్రేలియా తీసుకొచ్చిన కొత్త రూల్‌పై మీరేం అనుకుంటున్నారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: ధోని కాదు.. బౌలర్లకు ఆసలైన పీడకల ఆ బ్యాటరే: కోహ్లీ
Cricket Australia mandates wearing neck protectors from 1st October. Players will face sanctions if they don’t obey the new rules. pic.twitter.com/HgsVGhPtIb
— Mufaddal Vohra (@mufaddal_vohra) September 14, 2023