iDreamPost
android-app
ios-app

ద్రవిడ్ సార్ జీవితంలో చక్ దే ఇండియా సీన్? వరల్డ్ కప్ గెలిస్తే చరిత్రే

  • Published Nov 14, 2023 | 6:46 PM Updated Updated Dec 11, 2023 | 11:55 AM

చరిత్ర సృష్టించేందుకు కేవలం మరో రెండు అడుగుల దూరంలో ఉంది టీమిండియా. అయితే.. ఇప్పుడు జట్టు ఈ రెండు అడుగు దగ్గరగా రావడానికి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కష్టం ఎంతో ఉంది. అయితే. ద్రవిడ్‌ కష్టమే కాదు.. దాని వెనుక కనిపించని ఓ బాధ కూడా ఉంది. అసలు ద్రవిడ్‌ లైఫ్‌కి చక్‌ దే ఇండియా సినిమాకి లింక్‌ ఏంటి? ఇది చదవండి..

చరిత్ర సృష్టించేందుకు కేవలం మరో రెండు అడుగుల దూరంలో ఉంది టీమిండియా. అయితే.. ఇప్పుడు జట్టు ఈ రెండు అడుగు దగ్గరగా రావడానికి కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌ కష్టం ఎంతో ఉంది. అయితే. ద్రవిడ్‌ కష్టమే కాదు.. దాని వెనుక కనిపించని ఓ బాధ కూడా ఉంది. అసలు ద్రవిడ్‌ లైఫ్‌కి చక్‌ దే ఇండియా సినిమాకి లింక్‌ ఏంటి? ఇది చదవండి..

  • Published Nov 14, 2023 | 6:46 PMUpdated Dec 11, 2023 | 11:55 AM
ద్రవిడ్ సార్ జీవితంలో చక్ దే ఇండియా సీన్? వరల్డ్ కప్ గెలిస్తే చరిత్రే

రాహుల్‌ ద్రవిడ్‌.. ది వాల్‌, లెజెండరీ క్రికెటర్‌. ప్రస్తుతం టీమిండియా హెడ్‌ కోచ్‌ గా ఉన్న ద్రవిడ్‌.. చాలా ఏళ్ల పాటు భారత జట్టులో స్టార్‌ బ్యాటర్‌ గా, మిడిలార్డర్ లో పిల్లర్‌ లా, కొన్నేళ్ల పాటు కెప్టెన్‌ గా ఉన్న విషయం తెలిసిందే. ప్రపంచ క్రికెట్‌ లో 16 ఏళ్ల పాటు ఆటగాడిగా కొనసాగినా.. వివాదరహితుడిగా పేరు తెచ్చుకున్నాడు. అందుకే ద్రవిడ్‌ అంటే అందరికీ గౌరవం, ఇష్టం. టన్నుల కొద్దీ పరుగులు, ఎన్నో గొప్ప ఇన్నింగ్స్‌ లు, శత్రువులు కూడా అభిమించే ఆటగాడు.. ఇలా ద్రవిడ్‌ లైఫ్‌ లో అన్ని మంచి విషయాలే ఉన్నాయని చాలా మంది అనుకుంటూ ఉంటారు. కానీ, ఇదే ద్రవిడ్‌ జీవితంలో పీడకల లాంటి రోజులు కూడా ఉన్నాయి. ఘోర అవమానాలు ఎదుర్కొన్నాడు. అలాంటి పరిస్థితుల్లో కూడా ద్రవిడ్‌ ఎప్పుడూ కుంగుబాటుకు గురవ్వలేదు, భావోద్వేగానికి లోనవ్వలేదు. కానీ, ప్రతీకారం తీర్చుకోవాలని మాత్రం ఫిక్స​య్యాడు. అసలు ద్రవిడ్‌ కెరీర్‌లో జరిగిన అవమానాలు ఏంటి? ఆ తర్వాత ద్రవిడ్‌ ఏం చేశాడు? ఏం సాధించబోతున్నాడో ఇప్పుడు తెలుసుకుందాం..

1996లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ద్రవిడ్‌.. అనతికాలంలోనే జట్టులో కీ ప్లేయర్‌ గా ఎదిగాడు. సచిన్‌ టెండూల్కర్‌, సౌరవ్‌ గంగూలీ, వీవీఎస్‌ లక్ష్మణ్‌ లాంటి గొప్ప ఆటగాళ్ల సమవుజ్జీగా ఉన్నాడు. చాలా కాలం పాటు సచిన్‌, దాదాలతో కలిసి ద్రవిడ్‌ టీమిండియాను ముందుకు నడిపించాడు. వీరి ముగ్గురినీ త్రిమూర్తులు అనేవారు. అయితే చాలా సార్లు సచిన్‌, గంగూలీ విఫలమైన చోట కూడా ద్రవిడ్‌ నిలబడి జట్టును గెలిపించేవాడు. ముఖ్యంగా టెస్టు క్రికెట్‌ లో ఎలాంటి పిచ్‌ ఉన్నా, ఎదురుగా ఎంత గొప్ప బౌలర్‌ ఉన్నా.. జట్టు కష్టాల్లో ఉంది, క్రీజ్‌ లో నిలబడాల్సిందే అని ద్రవిడ్‌ ఫిక్స్‌ అయితే.. ఇక బౌలర్లు చెమటలు కక్కాల్సిందే. వికెట్ల ముందు గోడ కట్టేసేవాడు. అందుకే ద్రవిడ్‌ ను అంతా ది వాల్‌ అని పిలుస్తారు. ఇక వన్డేల్లో అయితే ద్రవిడ్‌ గొప్ప మిడిలార్డర్ బ్యాటర్‌. ఇక అలాగే చాలా కాలం పాటు వికెట్‌ కీపర్‌ గా కూడా సేవలు అందించాడు. జట్టులో కెప్టెన్‌ గా సౌరవ్‌ గంగూలీ ప్రస్థానం ముగిసిన తర్వాత ద్రవిడ్‌ కెప్టెన్సీ బాధ్యతలు అందుకున్నాడు.

అయితే.. ద్రవిడ్‌ కెప్టెన్సీ బాధ్యతలు అందుకునే సమయానికి జట్టులో తీవ్ర అనిశ్చితి నెలకొంది. జట్టులో ఎవరుంటారో ఎవరుండరో తెలియని గందరగోళం. మాజీ కెప్టెన్‌ సౌరవ్ గంగూలీ, కోచ్‌ గ్రెగ్‌ చాపెల్‌ మధ్య వివాదం, జట్టులోని ఇతర ఆటగాళ్లతో కూడా చాపెల్‌ కు విభేదాలతో టీమిండియాలో ఏదో తెలియని ఒక నిరాశ, చికాకు ఆవహించి ఉన్న రోజులు. అలాంటి పరిస్థితిల్లో కెప్టెన్సీని బలవంతంగానే చేపట్టిన ద్రవిడ్‌.. సీనియర్లు, జూనియర్లతో కూడిన జట్టును నడిపించాడు. ఒక కెప్టెన్‌ గా తాను అనుకున్న టీమ్‌ ను సెట్‌ చేసుకోకముందే.. 2007 వన్డే వరల్డ్‌ కప్‌ వచ్చి పడింది. దీంతో.. ద్రవిడ్‌ కెప్టెన్సీలో వరల్డ్‌ కప్‌ కు వెళ్లిన టీమిండియాకు ఘోర అవమానం ఎదురైంది. నిజానికి అది ఇండియాకు జరిగిన అవమానం కాదు.. కెప్టెన్‌ ద్రవిడ్‌ కు జరిగిన అవమానం. ఆ ద్రవిడ్‌ కెప్టెన్సీలోని టీమిండియా అత్యంత దారుణంగా.. బంగ్లాదేశ్‌, శ్రీలంక జట్లు చేతిలో ఓడి.. లీగ్‌ దశలోనే ఇంటి ముఖం పట్టింది.

దేశవ్యాప్తంగా క్రికెట్‌ అభిమానుల్లో ఆగ్రహం కట్టలుతెంచుకుంది. ఆటగాళ్ల ఇళ్లపై దాడికి కూడా దిగారు కొన్నిచోట్ల. ఆ సమయంలో ద్రవిడ్‌ చిత్రపటాలను కాల్చి నిరసన తెలిపారు కొంతమంది క్రికెట్‌ అభిమానులు. నిజానికి అప్పటి వరకు ద్రవిడ్‌ ను ఒక్క మాట కూడా అనని చాలా మంది క్రికెట్‌ ఫ్యాన్స్‌ సైతం ద్రవిడ్‌ ఫొటోలను కాల్చారు. నిజానికి ద్రవిడ్‌ పెద్దగా అనుభవం లేని టీమ్‌ తో వరల్డ్‌ కప్‌ కు వెళ్లాడు. బ్యాటింగ్‌ ఆర్డర్‌ లో మార్పులు, జట్టు ఆటగాళ్లు దారుణంగా విఫలమవ్వడం వల్లే.. 2007 వరల్డ్ కప్‌ లో టీమిండియా విఫలమైంది. కానీ, తెలియని గట్టి గాయం మాత్రం ద్రవిడ్‌ మనసుకే అయింది. ఆ వరల్డ్‌ కప్‌ జరిగిన ఏడాదికి వన్డేలకు, 2012లో టెస్టులకు వీడ్కోలు పలికిన ద్రవిడ్‌.. తనకు జరిగిన అవమానాలకు బదులు తీర్చుకుందాం అని ఫిక్స్‌ అయ్యాడు. అలాగే తన అన్నేళ్ల కెరీర్‌ లో సాధించలేనిది.. ఎలాగైనా దేశానికి సాధించిపెట్టాలని ఒక్క పక్కా ప్లానింగ్‌ తో.. ఒక్క స్టెప్‌ వేసుకుంటూ వస్తున్నాడు.

2016-2018 వరకు ద్రవిడ్‌ భారత అండర్‌ 19 కోచ్‌ గా పనిచేసిన విషయం తెలిసిందే. దేశానికి వరల్డ్‌ కప్‌ అందించాలనే కలతో.. గ్రౌండ్‌ లెవెల్‌ నుంచి ద్రవిడ్‌ తన వేట మొదలుపెట్టాడు. అండర్‌ 19లో మెరికల్లాంటి కుర్రాళ్లను వెతికి పట్టుకొచ్చాడు.. శ్రేయస్‌ అయ్యర్‌, శుబ్‌మన్‌ గిల్‌, ఇషాన్‌ కిషన్‌, పృథ్వీ షా, రిషభ్‌ పంత్‌.. ఇలా మరింతమంది ద్రవిడ్‌ కోచింగ్‌ లో ఇంతకు ముందు ఆడినవాళ్లే. ఇక ఆ తర్వాత.. నేషనల్‌ క్రికెట్‌ డైరెక్టర్‌ గా రెండేళ్లు పనిచేశాడు ద్రవిడ్‌. ఇక్కడి నుంచి అదే 19 కుర్రాళ్లను టీమిండియాకు ఆడేలా తీర్చిదిద్దాడు. ఇక 2021లో టీమిండియా హెడ్‌ కోచ్‌ బాధ్యతలు చేపట్టిన ద్రవిడ్‌.. సీనియర్‌ ఆటగాళ్లు విరాట్‌ కోహ్లీ, రోహిత్‌ శర్మలను కలుపుకుపోతూనే.. యువ ఆటగాళ్లను జట్టులో నింపేశాడు. దాదాపు 7 ఏళ్ల నుంచి తాను సానబెట్టుకుంటూ వచ్చిన ఆటగాళ్ల టాలెంట్‌ గురించి బాగా తెలిసిన ద్రవిడ్‌.. వారిపై నమ్మకం ఉంచి, పెద్ద ప్లేయర్లుగా మార్చాడు.

ఈ వరల్డ్‌ కప్‌ తో పాటు, టీ20 వరల్డ్‌ కప్‌ 2022 కంటే ముందు జట్టులో ద్రవిడ్‌ భారీగా ప్రయోగాలు చేశాడు. ఆటగాళ్లను టెస్ట్‌ చేయడం, వారి బ్యాటింగ్‌ స్థానాలను మార్చడం, పెద్ద ప్లేయర్లను ఫ్రీగా ఆడనివ్వడం వంటివి చేసేవాడు. యువ క్రికెటర్లతో ప్రయోగాలు చేయించి.. ఏ పరిస్థితిల్లోనైనా, ఏ పిచ్‌ పైనైనా, ఏ బౌలర్‌ నైనా, ఏ స్థానంలోనైనా ఆడేలా ఆటగాళ్లను తీర్చిద్దాడు. అలా ఒక్కొ పువ్వును జాగ్రత్తగా అల్లుకుంటూ ఒక మాలను తయారు చేశాడు. ఇప్పుడు అదే జట్టు వరల్డ్‌ కప్‌ లో దుమ్మురేపుతోంది. ఇంకో రెండు మ్యాచ్‌ లు.. కేవలం రెండు మ్యాచ్‌ లు కనుక టీమిండియా తమ స్థాయికి తగ్గట్టు ఆడిందా…? ఏ కప్పు అయితే ద్రవిడ్‌ ను వెక్కిరించిందో.. ఏ కప్పు అయితే ద్రవిడ్‌ ఫొటోలు కాల్చేందుకు కారణమైందో.. అదే కప్పొచ్చి ద్రవిడ్‌ కాళ్ల దగ్గరపడుతుంది.

టీమిండియా కప్పు గెలిస్తే.. ద్రవిడ్‌ జీవితం.. ముందే సినిమాగా వచ్చేసిన ‘చక్‌ దే ఇండియాను’ పోలి ఉంటుంది. షారుఖ్‌ ఖాన్‌ నటించిన చక్‌ దే ఇండియాలో కూడా ఇండియా ఓటమి హీరో కారణం అయ్యాడని.. అతని మీద నిందలు వేసి, అవమానించే అభిమానులే.. మహిళల జట్టుతో వరల్డ్‌ కప్‌ గెలిపిస్తే.. తమ తప్పును తెలుసుకుని.. హీరోకి దక్కాల్సిన గౌరవాన్ని వడ్డీతో సహా చెల్లిస్తారు. ఇప్పుడు టీమిండియా వరల్డ్‌ కప్‌ తెలిస్తే.. చక్‌ దే ఇండియా సీన్‌.. ద్రవిడ్‌ లైఫ్‌ లో రిపీట్‌ అయినట్లే. మరి రాహుల్‌ ద్రవిడ్‌.. టీమిండియా ఆటగాడిగా అందుకోలేకపోయినా వరల్డ్‌ కప్‌ ను.. కోచ్‌ గా అందుకుని తన కలను నేరవేర్చుకుంటాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.