iDreamPost
android-app
ios-app

SRH నుంచి వెళ్తూ వెళ్తూ.. కీలక వ్యాఖ్యలు చేసిన బ్రియన్‌ లారా

  • Author Soma Sekhar Published - 05:07 PM, Fri - 11 August 23
  • Author Soma Sekhar Published - 05:07 PM, Fri - 11 August 23
SRH నుంచి వెళ్తూ వెళ్తూ.. కీలక వ్యాఖ్యలు చేసిన బ్రియన్‌ లారా

వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను సన్ రైజర్స్ హెడ్ కోచ్ గా తొలగించిన విషయం తెలిసిందే. ఇక ఈ దిగ్గజం స్థానంలో న్యూజిలాండ్ లెజెండరీ స్పిన్నర్, మాజీ క్రికెటర్ అయిన డేనియల్ వెట్టోరిని హెడ్ కోచ్ గా నియమించుకుంది SRH. రెండేళ్లు సన్ రైజర్స్ టీమ్ కు కోచ్ గా పనిచేసిన బ్రియన్ లారా వెళ్తూ వెళ్తూ.. జట్టు గురించి కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓ టీమిండియా యంగ్ ప్లేయర్ ను ప్రశంసలతో ముంచెత్తాడు. ఆ యువ ఆటగాడిని కాపాడుకోండి అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. మరి వెస్టిండీస్ దిగ్గజాన్నే మెస్మరైజ్ చేసిన ఆ యంగ్ ప్లేయర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

ఐపీఎల్ 2023 సీజన్ ను దారుణంగా ముగించింది సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు. ఈ సీజన్ లో పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో నిలిచి, విమర్శల పాలైంది. దీంతో ప్రక్షళన చేపట్టింది సన్ రైజర్స్ యాజమాన్యం. అందులో భాగంగానే హెడ్ కోచ్ గా ఉన్న వెస్టిండీస్ దిగ్గజం బ్రియన్ లారాను తొలగించి.. న్యూజిలాండ్ లెజెండరీ ఆల్ రౌండర్ డానియల్ వెట్టోరిని నూతన హెడ్ కోచ్ గా నియమించుకుంది. ఇక రెండేళ్ల పాటు సన్ రైజర్స్ కు హెడ్ కోచ్ గా పనిచేసిన లారా.. జట్టులో ప్రతి ఒక్కరితో మంచి బాండింగ్ ను ఏర్పరచుకున్నాడు. దీంతో వెళ్తూ వెళ్తూ.. టీమిండియా ఆటగాడు, ఫాస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ పై ప్రశంసలు కురిపించాడు.

తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ తో లారా మాట్లాడుతూ..”టీమిండియాలో ప్రస్తుతం అతడో సెన్సేషనల్ క్రికెటర్. ఏదైనా అతి త్వరగా నేర్చుకునే టాలెంట్ ఉమ్రాన్ సొంతం. వరల్డ్ క్లాస్ బ్యాటర్లను సైతం వణికించే బౌలింగ్ చేయడంలో అతడు దిట్ట. ఇక వసీం అక్రమ్, మాల్కోలమ్ మార్షల్, మిచెల్ హోల్డింగ్ లాంటి దిగ్గజాలకు ప్రత్యేక శైలి ఉండగా.. ఉమ్రాన్ మాత్రం వారికి భిన్నంగా ఫాస్ట్ బౌలింగ్ తో బ్యాటర్లను బెంబేలెత్తించగలడు. అతడు ఇండియా తయ్యరు చేసిన బెస్ట్ బౌలర్. అతడిని కాపాడుకోండి” అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

ఇక అతడు డేల్ స్టైన్ లాంటి బౌలర్లతో సావాసం చేశాడు కాబట్టి.. అతడి నుంచి ఎన్నో మెలకువలు నేర్చుకునే ఉంటాడని లారా చెప్పుకొచ్చాడు. బ్యాటర్ల ఫుట్ వర్క్ ను బట్టి బంతులను సంధించడంలో ఉమ్రాన్ నేర్పరి అంటూ కితాబిచ్చాడు లారా. అతడు ఇలాగే తన ప్రదర్శన కొనసాగిస్తూ.. కొద్దిగా ఓపిక పడితే అతడికి అద్భుతమైన భవిష్యత్ ఉందని తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు ఈ విండీస్ దిగ్గజం. మరి ఉమ్రాన్ మాలిక్ పై బ్రియన్ లారా ప్రశంసలు కురిపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

ఇదికూడా చదవండి: పృథ్వీ షాపై బాడీ షేమింగ్‌ కామెంట్లు! సిగ్గుపడండి..