వరల్డ్ కప్ కోసం రిటైర్మెంట్‌ వెనక్కి! అతనొస్తే వరల్డ్‌ కప్‌ ఇంగ్లండ్‌దేనా?

వన్డే వరల్డ్‌ కప్‌ మహా సంగ్రామం మరో రెండు నెలల్లో భారత గడ్డపై ప్రారంభం కానుంది. ఈ టోర్నీలో క్రికెట్‌ పుట్టినిల్లు ఇంగ్లండ్‌ డిఫెండింగ్‌ ఛాంపియన్‌గా బరిలోకి దిగనుంది. 2019లో న్యూజిలాండ్‌తో జరిగిన వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో ఇంగ్లండ్‌ గెలిచి.. విశ్వవిజేతగా అవతరించింది. అంతకు ముందు ఆ జట్టుకు అసలు వరల్డ్‌ కప్‌ లేదు. క్రికెట్‌ పుట్టిన దేశానికి వన్డే వరల్డ్‌ కప్‌ లేదనే విమర్శ వారిపై ఉండేది. కానీ, ఆ ముద్రను చేరిపేసుకుంటూ.. ఇంగ్లండ్‌ వరల్డ్‌ ఛాంపియన్‌గా అవసరించింది. అయితే.. ఫైనల్‌లో చోటు చేసుకున్న సంఘటనలు, వాటిపై నెలకొన్న వివాదాల విషయం పక్కనపెడితే.. ఫైనల్‌లో ఓ ఇంగ్లండ్‌ ప్లేయర్‌ మాత్రం అద్భుతంగా ఆడాడు. 2011లో టీమిండియా వరల్డ్‌ కప్‌ గెలవడానికి ఎలా శ్రమించాడు.. 2019లో ఇంగ్లండ్‌కు అతను అలా ఉపయోగపడ్డాడు.

ఇప్పటికే అతనెవరో మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్‌.. బెన్‌ స్టోక్స్‌. ఇంగ్లండ్‌ స్టార్‌ ఆల్‌రౌండర్‌. అయితే.. టెస్ట్‌ క్రికెట్‌కు ఎక్కువ టైమ్‌ కేటాయించాలనే ఉద్దేశంతో స్టోక్స్‌ వన్డే ఫార్మాట్‌కు వరల్డ్‌ కప్‌ తర్వాత రిటైర్మెంట్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. కానీ, ఇప్పుడు బెన్‌ స్టోక్స్‌ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకోనున్నట్లు సమాచారం. ఈ నిర్ణయం దాదాపు ఫైనల్‌ అయినట్లు కూడా తెలుస్తోంది. స్టోక్స్‌ రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకుంటున్నట్లు మరికొద్ది సేపట్లో స్వయంగా ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.

బెన్‌ స్టోక్స్‌ తన నిర్ణయం మార్చుకోవడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు సమాచారం. కేవలం వన్డే వరల్‌ కప్‌ 2023 కోసమే స్టోక్స్‌ తన రిటైర్మెంట్‌ను వెనక్కి తీసుకుంటున్నాడు. స్టోక్స​ లాంటి ఆల్‌రౌండర్‌ ఉండటం ఏ జట్టుకైనా కొండంత బలం. పైగా వరల్డ్‌ కప్‌ ఫేవరేట్స్‌లో ఒకటిగా ఉన్న ఇంగ్లండ్‌ లాంటి టీమ్‌కు స్టోక్స్‌ లాంటి ఆటగాడి అవసరం ఎంతో ఉంది. పైగా స్టోక్స్‌ స్థానాన్ని ఇంగ్లండ్‌ వన్డే టీమ్‌లో ఇంకా ఎవరూ భర్తీ చేయలేకపోయారు. స్టోక్స్‌ ఒక్కడిని పక్కన పెడితే.. ఇంగ్లండ్‌ వన్డే టీమ్‌ పటిష్టంగానే ఉంది. కానీ, స్టోక్స్‌ రాకతో మరింత దుర్బేధ్యంగా మారడం ఖాయం. అందుకే స్టోక్స్‌ రిటైర్మెంట్‌ వెనక్కి తీసుకొని మళ్లీ జట్టులోకి వస్తే.. ఈ వరల్డ్‌ కప్‌ కూడా ఇంగ్లండ్‌దే అంటూ కొంతమంది క్రికెట్‌ అభిమానులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: మరోసారి ఫేక్‌ న్యూస్‌పై స్పందించిన కోహ్లీ! ఈ సారి ఏకంగా పేపర్‌ పేరు పెట్టి మరీ..

Show comments