మరోసారి బజ్ బాల్ ఆట చూపించిన స్టోక్స్! అరుదైన రికార్డ్ కొల్లగొట్టాడు..

  • Author Soma Sekhar Published - 11:44 AM, Sat - 8 July 23
  • Author Soma Sekhar Published - 11:44 AM, Sat - 8 July 23
మరోసారి బజ్ బాల్ ఆట చూపించిన స్టోక్స్! అరుదైన రికార్డ్ కొల్లగొట్టాడు..

ఇంగ్లాండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ పోరు రోజురోజుకు రసవత్తరంగా మారుతోంది. వివాదాలు, మాటలు, గొడవలతో ఈసారి యాషెస్ యుద్దాన్ని తలపిస్తోంది. ఇక ఇప్పటికే ఈ సిరీస్ లో 2-0తో ఆధిక్యంలో ఉంది ఆసీస్. తాజాగా లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారుతోంది. రెండో రోజు రెండో సెషన్ లోనే ఇంగ్లాండ్ ఆలౌట్ కావడంతో.. ఆసీస్ కు 26 పరుగుల స్వల్ప ఆధిక్యం లభించింది. ఇక ఈ మ్యాచ్ లో బజ్ బాల్ క్రికెట్ ను మరోసారి రుచి చూపించాడు ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్. సిక్స్ లు, ఫోర్లలతో ఆసీస్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. ఈ క్రమంలోనే ఓ అరుదైన రికార్డును నెలకొల్పాడు స్టోక్స్.

బెన్ స్టోక్స్.. ఇంగ్లాండ్ సారథిగా పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ఆ జట్టు ఆట స్వరూపాన్నే మార్చేశాడనే చెప్పాలి. బజ్ బాల్ క్రికెట్ తో టెస్ట్ క్రికెట్ ఆటనే మార్చి.. కొత్త ట్రెండ్ సృష్టించాడు. అదీకాక తన వెరైటీ ఫీల్డ్ సెటప్ తో దిగ్గజాలను సైతం ఆశ్చర్యపరిచాడు. ఇక యాషెస్ సిరీస్ లో భాగంగా.. లీడ్స్ వేదికగా జరుగుతున్న మూడో టెస్ట్ రసవత్తరంగా మారింది. సెషన్, సెషన్ కు ఆట మారుతూ వస్తోంది. ఇక ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ సారథి బెన్ స్టోక్స్ మెుదటి నుంచి చెప్తున్నట్లుగానే మరోసారి బజ్ బాల్ క్రికెట్ ను ఆసీస్ బౌలర్లకు రుచిచూపించాడు. క్రీజ్ లో ఉన్నంతసేపు దాటిగా ఆడాడు.

తొలుత క్రీజ్ లో కుదురుకోవడానికి సమయం తీసుకున్న స్టోక్స్.. మార్క్ వుడ్(24) అవుట్ అవ్వగానే ఒక్కసారిగా గేర్ మార్చాడు. తొలుత 69 బంతుల్లో 29 పరుగులు మాత్రమే చేసిన స్టోక్స్.. ఆ తర్వాత తాను ఎదుర్కొన్న 39 బంతుల్లో 61 రన్స్ చేశాడు. స్టోక్స్ మెుత్తంగా 108 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్స్ లతో 80 పరుగులు చేశాడు. కానీ మరో ఎండ్ నుంచి స్టోక్స్ కు సహకారం లభించలేదు. చివరవరకు క్రీజ్ లో నిలిచి లాస్ట్ వికెట్ గా వెనుదిరిగాడు. ఈ క్రమంలోనే స్టోక్స్ ఓ అరుదైన మెలురాయిని చేరుకున్నాడు. టెస్ట్ క్రికెట్ లో 6వేల పరుగులతో పాటుగా, వంద వికెట్లు తీసిన మూడో ఆల్ రౌండర్ గా చరిత్రకెక్కాడు.

ఇప్పటి వరకు స్టోక్స్ 94 టెస్టుల్లో 6008 పరుగులు చేయడంతో పాటుగా 197 వికెట్లు పడగొట్టాడు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా దిగ్గజం జాక్వెస్ కలిస్ (13,289 రన్స్, 292 వికెట్ల)తో తొలి స్థానంలో ఉండగా.. విండీస్ దిగ్గజం గార్ ఫీల్డ్ సోబర్స్ (8032 రన్స్, 235 వికెట్ల)తో రెండో స్థానంలో ఉన్నాడు. ఇక మ్యాచ్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 263 పరుగులకు ఆలౌట్ కాగా.. రెండో ఇన్నింగ్స్ లో 116/4 రన్స్ తో 142 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. ఇక ఇంగ్లాండ్ తొలి ఇన్నింగ్స్ లో 237 పరుగులకు ఆలౌట్ అయ్యింది. ఇంకా మూడు రోజుల ఆట మిగిలి ఉండటంతో.. మ్యాచ్ రసవత్తరంగా మారింది.

Show comments