ఓ మనిషికి తాను చనిపోబోతున్నాను అని ముందే తెలిస్తే.. అతడు ఎలాంటి మానసిక సంఘర్షణ ఎదుర్కొంటాడో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. అదీకాక చాలా సినిమాల్లో మనం ఇలాంటి సంఘటనలు చూసే ఉన్నాం. ఇక తనకు వచ్చిన వ్యాధి గురించి తెలిస్తే.. చుట్టుపక్కల వారు చూపించే సానుభూతి భరించలేడు ఆ వ్యక్తి. ఇలాంటి సానుభూతి తనకు అవసరం లేదని, తనకు వచ్చిన అరుదైన వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదని తెలిపాడు ఓ దిగ్గజ క్రికెటర్. ఈ వ్యాధి కారణంగా నేను ఎక్కువ కాలం బ్రతకలేనంటూ ప్రకటన కూడా చేశాడు. మరి అరుదైన వ్యాధి బారినపడ్డ ఆ దిగ్గజ క్రికెటర్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అతడో దిగ్గజ క్రికెటర్.. క్రికెట్ చరిత్రలో ఎన్నో రికార్డులను తన పేరిట సువర్ణాక్షరాలతో లిఖించుకున్నాడు. అదీకాక ఆ దిగ్గజం పేరుమీద ఓ ప్రతిష్టాత్మకమైన టెస్ట్ సిరీస్ కూడా నడుస్తోంది. ప్రస్తుతం ఆ దిగ్గజ క్రికెటర్ అరుదైన వ్యాధి బారిన పడ్డాడు. దాంతో తాను ఎక్కువ కాలం బ్రతకలేనంటూ ఓ భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు. ఆ దిగ్గజం మరెవరో కాదు ఆస్ట్రేలియా క్రికెట్ చరిత్ర గతిని మార్చిన ‘అలెన్ బోర్డర్’. తనకు పార్కిన్సన్ వ్యాధి సోకిందని ఇక ఎక్కువ కాలం బ్రతకలేనని స్వయంగా అలెన్ బోర్డర్ ఒక ప్రకటనలో తెలిపారు. ఆ ప్రకటనలో బోర్డర్ ఈ విధంగా చెప్పుకొచ్చారు.
“నాకు పార్కిన్సన్ వ్యాధి ఉన్నట్లు 2016లో తేలింది. న్యూరోసర్జన్ వద్దకు వెళ్తే నాకు ఈ వ్యాధి ఉన్నట్లు తెలిపాడు. అయితే నేను ఎక్కువగా వ్యక్తిగత గోప్యత పాటిస్తాను. దాంతో ఈ వ్యాధి గురించి ఎవరికీ చెప్పలేదు. ఒక వేళ చెప్తే.. వారి సానుభూతిని నేను భరించలేను. అయితే ఏదో ఒకరోజు ఈ విషయాన్ని వారు తెలుసుకుంటారని మాత్రం తెలుసు. అయితే నేను ఎంతో మందికంటే మెరుగ్గా ఉన్నాను. ఇప్పుడు నాకు భవిష్యత్ గురించి భయం లేదు” అని అలెన్ బోర్డర్ ఓ భావోద్వేగపూరిత ప్రకటన చేశాడు.
ఇక ఈ నెల 27వ తేదీతో 68వ వసంతంలోకి అడుగుపెట్టబోతున్నాడు అలెన్ బోర్డర్. కాగా.. తాను 80 సంవత్సరాలు జీవిస్తే అద్భుతమేనని, తాను మరో సెంచరీ సాధించలేనని మాత్రం కచ్చితంగా చెప్పగలనని అలెన్ పేర్కొన్నాడు. ఇక అలెన్ బోర్డర్ కెరీర్ విషయానికి వస్తే.. ఆస్ట్రేలియా తరపున 156 టెస్టుల్లో 11,174 పరుగులు చేయగా.. 273 వన్డేల్లో6524 రన్స్ చేశాడు. కాగా తన కెరీర్ లో 30 సెంచరీలు, 99 అర్ధసెంచరీలు సాధించాడు. అలెన్ నాయకత్వంలోనే ఆసీస్ తొలిసారి 1987లో వరల్డ్ కప్ ను సాధించింది. అలెన్ బోర్డర్-సునీల్ గవాస్కర్ పేరుమీద.. బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ జరుగుతున్న విషయం తెలిసిందే.