iDreamPost
android-app
ios-app

టీ20 క్రికెట్ లో పెను సంచలనం.. 400కు పైగా స్కోర్, ఇద్దరు సెంచరీలు..

  • Author Soma Sekhar Published - 03:38 PM, Sat - 14 October 23
  • Author Soma Sekhar Published - 03:38 PM, Sat - 14 October 23
టీ20 క్రికెట్ లో పెను సంచలనం.. 400కు పైగా స్కోర్, ఇద్దరు సెంచరీలు..

‘రికార్డులకు ఆయుష్షు తక్కువ’ అన్న సామెతను మనం వినే ఉంటాం. ఇక ఈ సామెత క్రికెట్ లో ఎక్కువగా వాడుతూ ఉంటాం. ఎందుకంటే ప్రపంచంలో ఏదో ఒకమూల రోజుకో రికార్డు బద్దలవుతూనే ఉంటుంది. తాజాగా అంతర్జాతీయ టీ20 క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. చిలీతో తాజాగా జరిగిన మ్యాచ్ లో రికార్డు స్థాయిలో 427 పరుగులు చేసింది అర్జెంటీనా మహిళల జట్టు. దీంతో పురుషుల, మహిళల క్రికెట్ లో ఇదే అత్యధిక స్కోర్ గా రికార్డుల్లోకి ఎక్కింది. అదీకాక ఈ మ్యాచ్ లో ఇద్దరు ప్లేయర్స్ సెంచరీలతో విరుచుకుపడ్డారు. ఈ రికార్డు బ్రేక్ మ్యాచ్ కు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..

ఇంటర్నేషనల్ టీ20 క్రికెట్ లో పెను సంచలనం నమోదు అయ్యింది. ఈ రికార్డు సాధిస్తారని ఎవరూ కూడా ఊహించి ఉండరు. తాజాగా చిలీతో జరిగిన టీ20 మ్యాచ్ లో అర్జెంటీనా మహిళల జట్టు దుమ్మురేపింది. చిలీ బౌలర్లను దంచికొడుతూ.. నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒక వికెట్ మాత్రమే కోల్పోయి 427 పరుగుల భారీ స్కోర్ చేసింది. జట్టులో ఇద్దరు ప్లేయర్లు శతకాలతో కదం తొక్కారు. అనంతరం 428 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన చిలీ జట్టు కేవలం 63 పరుగులకే ఆలౌట్ అయ్యి.. 364 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది.

కాగా అంతర్జాతీయ టీ20 పురుషుల, మహిళల క్రికెట్ లో ఇదే అత్యధిక స్కోర్ కావడం విశేషం. గతంలో ఈ రికార్డు(మహిళల) బహ్రెయిన్ జట్టు పేరిట ఉంది. ఆ జట్టు 2022లో సౌదీ అరేబియాపై 318 పరుగులు చేసింది. తాజాగా ఈ రికార్డును అర్జెంటీనా బద్దలు కొట్టింది. ఇక పురుషుల క్రికెట్ విషయానికి వస్తే.. అంతర్జాతీయ టీ20ల్లో ఇప్పటి వరకు అత్యధిక స్కోర్ చేసిన రికార్డు నేపాల్ పేరిట ఉంది. ఇటీవల జరిగిన ఏషియన్ గేమ్స్ లో నేపాల్ 314 పరుగుల భారీ స్కోర్ చేసింది. మరి టీ20లో నమోదైన ఈ సంచలనంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.