iDreamPost
android-app
ios-app

పాక్ ను గడగడలాడించిన కుంబ్లే.. ఆ అద్భుతానికి 25 ఏళ్లు!

  • Published Feb 07, 2024 | 12:33 PM Updated Updated Feb 07, 2024 | 4:38 PM

Anil Kumble took 10 wickets: సరిగ్గా ఇదే రోజు(ఫిబ్రవరి 7) దాయాది పాకిస్తాన్ టీమ్ ను గడగడలాడిస్తూ.. భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు అనిల్ కుంబ్లే. ఈ సంచలన బౌలింగ్ కు నేటితో 25 ఏళ్లు పూర్తి అయ్యాయి.

Anil Kumble took 10 wickets: సరిగ్గా ఇదే రోజు(ఫిబ్రవరి 7) దాయాది పాకిస్తాన్ టీమ్ ను గడగడలాడిస్తూ.. భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు అనిల్ కుంబ్లే. ఈ సంచలన బౌలింగ్ కు నేటితో 25 ఏళ్లు పూర్తి అయ్యాయి.

పాక్ ను గడగడలాడించిన కుంబ్లే.. ఆ అద్భుతానికి 25 ఏళ్లు!

ప్రపంచ క్రికెట్ చరిత్రలో కొన్ని మ్యాచ్ లకు, కొన్ని ఇన్నింగ్స్ లకు ప్రత్యేక చరిత్ర ఉంటుంది. ఆ చరిత్రను ఎవ్వరూ మర్చిపోలేరు. అలాంటి హిస్టరీనే 25 సంవత్సరాల క్రితం క్రియేట్ చేశాడు టీమిండియా దిగ్గజ స్పిన్నర్ అనిల్ కుంబ్లే. సరిగ్గా ఇదే రోజు(ఫిబ్రవరి 7) దాయాది పాకిస్తాన్ టీమ్ ను గడగడలాడిస్తూ.. భారత జట్టుకు చిరస్మరణీయ విజయాన్ని అందించాడు. ఈ సంచలన బౌలింగ్ కు నేటితో 25 ఏళ్లు పూర్తి అయ్యాయి. దీంతో బీసీసీఐ ప్రత్యేక వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది. ఆ మ్యాచ్ లో కుంబ్లే సృష్టించిన విధ్వంసాన్ని మరోసారి గుర్తుకు తెచ్చుకుందాం పదండి.

అది 1999 ఫిబ్రవరి 7 ఢిల్లీ వేదికగా ఇండియా-పాకిస్తాన్ జట్ల మధ్య టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. ఈ మ్యాచ్ చరిత్రలో ఓ మైల్ స్టోన్ గా నిలిచిపోతుందని బహుశా ఎవ్వరూ అనుకోలేదేమో? ఈ మ్యాచ్ లో అద్భుత ప్రదర్శనతో ప్రపంచ రికార్డును నెలకొల్పడమే కాక.. టీమిండియాకు అద్భుతమైన విజయాన్ని అందించాడు స్పిన్ దిగ్గజం అనిల్ కుంబ్లే. గింగిరాలు తిరిగే బంతులతో పాక్ ఆటగాళ్ల భరతం పట్టాడు. ఈ మ్యాచ్ లో 420 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన పాక్ కు ఓపెనర్లు సయీద్ అన్వర్, షాహిద్ అఫ్రిదీ జోడీ అదిరిపోయే సెంచరీ ఆరంభాన్ని అందించింది. దీంతో టీమిండియా శిబిరంలో ఆందోళన రేకెత్తింది.

ఈ క్రమంలో అనిల్ కుంబ్లే అద్భుతం చేశాడు. పాక్ ఆటగాళ్లను ఒకరి వెంట ఒకరిని పెవిలియన్ కు చేర్చాడు. ఏకంగా 10 మంది ప్లేయర్లను ఔట్ చేసి ప్రపంచ క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్ గా రికార్డుల్లోకి ఎక్కాడు. కుంబ్లే కంటే ముందు 1956లో ఇంగ్లాండ్ కు చెందిన జిమ్ లేకర్ 10 వికెట్లు తీశాడు. కుంబ్లే అద్భుతానికి నేటితో సరిగ్గా 25 ఏళ్లు పూర్తి కావడంతో.. ఆ సంచలన ప్రదర్శనను మరోసారి గుర్తు చేసుకుంటున్నారు క్రికెట్ లవర్స్.  ఈ మ్యాచ్ లో కుంబ్లే 26.3 ఓవర్లు బౌలింగ్ చేసి 9 మెయిడెన్లతో 10 వికెట్లు కూల్చాడు. ఇక ఆ మ్యాచ్ విషయానికి వస్తే.. ఇండియా తొలి ఇన్నింగ్స్ లో 252 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 339 పరుగులు చేయగా.. పాక్ తొలి ఇన్నింగ్స్ లో 174 పరుగులు, రెండో ఇన్నింగ్స్ లో 212 రన్స్ కు ఆలౌట్ అయ్యింది. దీంతో 208 పరుగుల తేడాతో టీమిండియా చిరస్మరణీయ విజయం సాధించింది.

ఇదికూడా చదవండి: Aiden Markram: వీడియో: జాంటీ రోడ్స్ కూడా ఇలా పట్టడేమో? మార్క్రమ్ మైండ్ బ్లోయింగ్ క్యాచ్!