ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్).. ఈ పేరు తెలియని క్రికెట్ అభిమాని ఉండరంటే ఏమాత్రం అతిశయోక్తి కాదు. అంతలా ఆధునిక క్రికెట్‌పై ఈ టోర్నమెంట్ ప్రభావం చూపిస్తోంది. టెస్టులు, వన్డేలకు అలవాటైన సంప్రదాయ క్రికెట్ అభిమానులకు పొట్టి ఫార్మాట్లోని అసలైన మజాను రుచి చూపించింది ఐపీఎలే. ఈ మెగా టోర్నీ వల్ల టీ20లకు విశ్వవ్యాప్తంగా క్రేజ్ విపరీతంగా పెరిగింది. ఐపీఎల్ సక్సెస్‌తో ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పొట్టి లీగ్‌లు పుట్టుకొచ్చాయి. డబ్బుకు డబ్బు, ఆటగాళ్లకు క్రేజ్ లభిస్తుండటంతో ఇలాంటి టోర్నీల నిర్వహణకు చాలా దేశాలు ఆసక్తి చూపిస్తున్నాయి. ఐపీఎల్ ద్వారా క్రికెటర్ల సంపాదన పదింతలు అయింది. స్టార్ క్రికెటర్లే కాదు.. డొమెస్టిక్ ప్లేయర్లకు కూడా ఈ లీగ్ వల్ల ఎంతో లాభం చేకూరింది.
ఆటగాళ్ల ప్రదర్శనను బట్టి వేలంలో వారిని రూ.కోట్లు కుమ్మరించి కొంటున్నాయి ఫ్రాంచైజీలు. అడ్వర్టయిజ్‌మెంట్స్, స్పాన్సర్లు, ప్రసార హక్కుల రూపంలో భారత క్రికెట్ బోర్డుపై కూడా కాసుల వర్షం కురుస్తోంది. ఐపీఎల్లో అద్భుతమైన ప్రదర్శనతో తమ దేశ జాతీయ జట్లలో చోటు దక్కించుకున్న క్రికెటర్లూ ఉన్నారు. ఊరు, పేరు తెలియని ప్లేయర్లు ఈ పొట్టి లీగ్‌లో బాగా ఆడి డబ్బులతో పాటు కెరీర్లో మంచి అవకాశాలు దక్కించుకున్న సందర్భాలు కూడా అనేకం ఉన్నాయి. డబ్బుతో పాటు పేరుప్రతిష్టలు, జాతీయ జట్టులో చోటు సంపాదించుకునేందుకు ఒక వేదికగా మారిన ఐపీఎల్లో ఆడాలనేది చాలా మంది ప్లేయర్ల డ్రీమ్. అలాంటి ఒక ఆటగాడి కల ఇప్పుడు నెరవేరబోతోంది.
ఒక ఆంధ్రా క్రికెటర్‌ను ఈ అదృష్టం వరించింది. అనంతపురం జిల్లాకు చెందిన వర్ధమాన క్రికెటర్ కేహెచ్ వీరారెడ్డికి అరుదైన ఛాన్స్ దక్కింది. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్)లో బెస్ట్ పెర్ఫార్మెన్స్తో రాయలసీమ కింగ్స్ విజయానికి కారణమైన వీరారెడ్డి.. ఆ టోర్నీలో ఎమర్జింగ్ ప్లేయర్‌గా అవార్డు దక్కించుకున్నాడు. రెండో అత్యధిక రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డు కూడా నెలకొల్పాడు. ఈ క్రమంలోనే అతడికి ఐపీఎల్లో ఆడే ఛాన్స్ దక్కిందని తెలుస్తోంది. తమ టీమ్‌లో ఆడాలంటూ ముంబై ఇండియన్స్‌తో పాటు రాజస్థాన్ రాయల్స్ నుంచి వీరారెడ్డికి పిలుపు అందిందట. రాజస్థాన్ పిలుపుపైనే అతడు మక్కువ చూపిస్తున్నట్లు సమాచారం. ఒకవేళ వచ్చే ఏడాది ఐపీఎల్లో గనుక వీరారెడ్డి అరంగేట్రం చేస్తే ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి మెగా లీగ్‌లో ఆడిన తొలి క్రికెటర్‌గా ఖ్యాతి గడించడం ఖాయం.
ఇదీ చదవండి: వరల్డ్ కప్2023లో నెట్ బౌలర్‌గా ఫుడ్ డెలివరీ బాయ్!