క్రికెట్‌ను ఇష్టపడే వాళ్లు కొన్ని కోట్ల మంది ఉన్నారు. భారత్, పాకిస్థాన్ శ్రీలంక లాంటి కొన్ని దేశాల్లోనైతే ఈ ఆటను ఓ మతంలా భావించే వారికి కొదువే లేదు. ఇది వయసుతో సంబంధం లేని క్రీడగా చెప్పొచ్చు. ఒక్కసారి క్రికెట్ ఆడితే దాంతో ఒక అనుబంధం అనేది ఏర్పడిపోతుంది. అది అంత త్వరగా మనల్ని వీడిపోదు. అందుకే చాలా మంది చిన్నప్పుడే కాదు కాలేజీలో ఉన్నప్పుడు, ఆ తర్వాత ఉద్యోగాలు చేస్తూ కూడా ఖాళీ దొరికినప్పుడు ఆడుతూనే ఉంటారు. వీలు చిక్కినప్పుడల్లా బ్యాట్ పట్టుకొని గ్రౌండ్లోకి దిగిపోతారు.
ఎంత క్రికెట్ ఆడినా ఒక వయసు వరకే అని చెప్పొచ్చు. అది మామూలు ప్రేక్షకులు అయినా లేదా ప్రొఫెషనల్ ప్లేయర్లు అయినా 50 ఏళ్లు పైబడ్డాక గ్రౌండ్లో దిగడం, ఆడటం, పరిగెత్తడం అంటే అంత సులువు కాదు. కానీ ఇది కూడా సాధ్యమేనని ఒక సీనియర్ ఆటగాడు నిరూపించాడు. సహచర ప్లేయర్లతో కలసి ఆటను ఆస్వాదించొచ్చని చూపించాడు. స్కాట్లాండ్కు చెందిన మాజీ ఆటగాడు అలెక్స్ స్టీల్ 83 ఏళ్ల వయసులో తనకు గేమ్‌పై ఉన్న మక్కువను చాటుకున్నారు. ఒకవైపు అనారోగ్యం తీవ్రంగా బాధిస్తున్నా.. క్రికెట్ ఫీల్డ్‌లోకి దిగి అదరగొట్టారు. ఒక స్థానిక క్లబ్‌తో జరిగిన మ్యాచ్‌లో తన శరీర వెనుక భాగంలో ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని మరీ ఆయన వికెట్ కీపింగ్ చేశారు.
అలెక్స్ స్టీల్ వికెట్ కీపింగ్ చేస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన నెటిజన్స్.. ఆటపై ఆయనకు ఉన్న అంకితభావం చూసి ప్రశంసల్లో ముంచెత్తుతున్నారు. కాగా, 2020లో ఇండియోపతిక్ పల్మనరీ ఫైబ్రోసిస్ అనే ఊపిరితత్తులకు సంబంధించిన వ్యాధి బారిన పడ్డారు అలెక్స్. అప్పటి నుంచి ఆయన ఆక్సిజన్ సపోర్ట్‌తోనే తన లైఫ్‌ను ముందుకు సాగిస్తున్నారు. ఈ వ్యాధితో బాధపడేవారు మూడ్నాలుగు ఏళ్లు మాత్రమే జీవించే ఛాన్స్ ఉంది. ఇక, 1967లో స్కాట్లాండ్ తరఫున అరంగేట్రం చేశారు స్టీల్. మొత్తంగా ఆయన తన కెరీర్లో 14 ఫస్ట్‌క్లాస్ మ్యాచ్‌లు ఆడి 621 రన్స్ చేశారు. ఇందులో రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి.