పాకిస్థాన్‌ను చిత్తుగా ఓడించిన ఆఫ్ఘనిస్థాన్‌! భారత్‌తో ఫైనల్‌కు రెడీ

అంతర్జాతీయ క్రికెట్‌లో అప్పుడప్పుడు సంచలనాలు సృష్టించే ఓ సాధారణ జట్టుగా ఉన్న ఆఫ్ఘనిస్థాన్‌.. ఏషియన్‌ గేమ్స్‌లో మాత్రం ఛాంపియన్‌ జట్టులా ఆడుతోంది. సెమీ ఫైనల్‌లో ఏకంగా పాకిస్థాన్‌ లాంటి పటిష్టమైన జట్టును ఓడించి.. ఆసియా క్రీడల్లో ఫైనల్‌కు దూసుకెళ్లింది ఆఫ్ఘాన్‌ టీమ్‌. శనివారం ఫైనల్‌లో టీమిండియాతో గోల్డ్‌ మెడల్‌ కోసం తలపడేందుకు సిద్ధమైంది. అయితే.. హాంగ్‌జౌలోని పింగ్‌ఫెంగ్ క్యాంపస్ క్రికెట్ ఫీల్డ్ మైదానంలో జరిగిన సెమీస్‌లో.. తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్థాన్‌ కేవలం 115 పరుగులకే కుప్పకూలింది. ఆఫ్ఠాన్‌ బౌలర్లు ఫరీద్‌ అహ్మద్‌ 3, కైస్ అహ్మద్ 2, జహీర్‌ ఖాన్‌ 2 వికెట్లతో చెలరేగడంతో పాక్‌ 18 ఓవర్లలో 115 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది.

పాకిస్థాన్‌ బ్యాటర్లలో ఓమైర్‌ ఉస్మాన్‌ 24 పరుగులతో టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. మిగతా బ్యాటర్లంతా దారుణంగా విఫలం కావడంతో.. పాక్‌ తక్కువ స్కోర్‌కే పరిమితం అయింది. అయితే.. పాకిస్థాన్‌కి ఉన్న బలమైన బౌలింగ్‌ ఎటాక్‌తో 115 పరుగుల టార్గెట్‌ను కాపాడుకుంటుందని అంతా భావించారు. అందుకు తగ్గట్లే.. బ్యాటింగ్‌ ఆరంభించిన ఆఫ్ఘానిస్థాన్‌ను ఆరంభంలోనే కష్టాల్లోకి నెట్టింది. 35 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘాన్‌.. ఆ తర్వాత పుంజుకుని లక్ష్యం దిశగా సాగింది. కానీ, ఇన్నింగ్స్‌ 71 పరుగుల వద్ద వరుసగా రెండు వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘాన్‌.. మ్యాచ్లో మళ్లీ పాక్‌కు ఛాన్స్‌ ఇచ్చేలా కనిపించింది. కానీ, కెప్టెన్‌ గుల్బద్దీన్‌ నైబ్‌ అద్భుతంగా ఆడి.. తన టీమ్‌ను ఏషియన్‌ గేమ్స్‌ ఫైనల్‌కు చేర్చాడు. 19 బంతుల్లో ఒక ఫోర్‌, 3 సిక్సులతో 26 పరుగులతో ఒత్తిడిలో మంచి ఇన్నింగ్స్‌ ఆడాడు.

అంతకుముందు.. నూర్‌ అలీ జద్రాన్‌ 33 బంతుల్లో 4 ఫోర్లు, 2 సిక్సులతో 39 పరుగులు చేసి.. అద్భుత ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆ తర్వాత బ్యాటర్లు విఫలమైనా.. కెప్టెన్‌ గుల్బద్దీన్‌ సూపర్‌ ఇన్నింగ్స్‌తో గెలిపించాడు. ఈ విజయంతో ఆఫ్ఘనిస్థాన్‌కు రజతం ఖాయమైంది. ఫైనల్‌లో భారత్‌పై గెలిస్తే.. గోల్డ్‌ మెడల్‌ వారి సొంతం అవుతుంది. లేదంటే.. సిల్వర్‌తో సరిపెట్టుకోవాల్సి వస్తుంది. ఇక సెమీస్‌లో ఆఫ్ఘాన్‌ చేతిలో ఖంగుతిన్న పాకిస్థాన్‌ బ్రాంజ్‌ మెడల్‌ కోసం శనివారం ఉదయం బంగ్లాదేశ్‌తో మూడో స్థానం కోసం పోటీ పడనుంది. మరి ఆఫ్ఘనిస్థాన్‌ జట్టు.. పాకిస్థాన్‌ను ఓడించి ఏషియన్‌ గేమ్స్‌ ఫైనల్‌కు చేరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇండియాను అవమానించే కుట్ర! పాక్‌ ఫ్యాన్స్‌.. ఈ లెక్కలు చూడండ్రా బాబు!

Show comments