iDreamPost
android-app
ios-app

ప్రపంచంలో అందరు బౌలర్లను దంచికొట్టా.. కానీ ఆ టీమిండియా బౌలర్ అంటే భయం: AB డివిలియర్స్

  • Author Soma Sekhar Published - 04:23 PM, Tue - 4 July 23
  • Author Soma Sekhar Published - 04:23 PM, Tue - 4 July 23
ప్రపంచంలో అందరు బౌలర్లను దంచికొట్టా.. కానీ ఆ టీమిండియా బౌలర్ అంటే భయం: AB డివిలియర్స్

ప్రపంచంలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారు. కానీ వారిలో కొంతమంది మాత్రమే వరల్డ్ క్రికెట్ పై తమదైన ముద్రను వేశారు. అలా ప్రపంచ క్రికెట్ లో తనకంటూ కొన్ని పేజీలను లిఖించుకున్నాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. మిస్టర్ 360 గా వరల్డ్ క్రికెట్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక అతడు క్రీజ్ లో ఉన్నాడంటే.. ప్రత్యర్థి బౌలర్లకు వణుకే. తన విధ్వంసకరమైన బ్యాటింగ్ తో గ్రౌండ్ నలువైపులా అలవోకగా బౌండరీలు కొట్టగలడు ఏబీడి. మరి ఇలాంటి బ్యాటర్ ను కూడా భయపెట్టిన బౌలర్లు ఉన్నారంటే మీరు నమ్ముతారా? ఇక తనను భయపెట్టిన బౌలర్ల పేర్లను తాజాగా బయటపెట్టాడు ఏబీడి. మరి ఈ మిస్టర్ 360ని భయపెట్టిన ఆ బౌలర్లు ఎవరో? అందులో టీమిండియా బౌలర్ ఎవరో? ఇప్పుడు తెలుసుకుందాం.

ప్రపంచ క్రికెట్ కు వెరైటీ షాట్లను పరిచయం చేశాడు సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్. మిస్టర్ 360 గా గ్రౌండ్ నలువైపులా.. ఎలాంటి బంతినైనా కొట్టగల అరుదైన బ్యాటర్ ఏబీడి. మరి ఇలాంటి స్టార్ బ్యాటర్ ఓ ముగ్గురి బౌలర్లను చూస్తే.. భయం వేసింది అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఆ ముగ్గురి బౌలర్లలో ఇద్దరు స్పిన్నర్లు కావడం విశేషం. మరో బౌలర్ టీమిండియా పేసర్ కావడం గమనార్హం. ఈ క్రమంలోనే జియో సినిమాలో టీమిండియా మాజీ ఆటగాడు రాబిన్ ఉతప్పతో కలిసి ఏబీడి ఆసక్తికర విషయాలు వెల్లడించాడు.

డివిలియర్స్ మాట్లాడుతూ..”ప్రపంచ క్రికెట్ లో నేను ఎదుర్కొన్న అత్యంత కఠినమైన బౌలర్లు షేన్ వార్న్, రషీద్ ఖాన్, జస్ప్రీత్ బుమ్రాలు మాత్రమే. 2006లో తొలిసారి నేను ఆసీస్ పర్యటనకు వెళ్లినప్పుడు షేన్ వార్న్ బౌలింగ్ లో తీవ్ర ఇబ్బంది పడ్డాను. అదీకాక వార్న్ బౌలింగ్ కన్నా.. అంతటి దిగ్గజ ఆటగాడితో ఆడుతున్నాను అన్న ఊహే నన్ను భయపెట్టేది. అప్పటికి నాకు అనుభవం కూడా తక్కువే. కానీ వార్న్ చాలా తెలివిగల వాడు. నా బలహీనతను వెంటనే గుర్తుపట్టేశాడు. చిన్నచిన్న విషయాలను కూడా వార్న్ వెంటనే గుర్తించగలడు.. అది అతడి స్టైల్. ఇక నేను ఎదుర్కొన్న మరో కఠినమైన బౌలర్ రషీద్ ఖాన్. అతడి బౌలింగ్ లో వరుసగా హ్యాట్రిక్ సిక్స్ లు కొట్టినా గానీ.. నాలుగో బంతికి బ్యాటర్ ను ఔట్ చేయాలని చూస్తాడు. రషీద్ ఖాన్ లో ఉన్న ప్రత్యేకత అది” అని ఏబీడి చెప్పుకొచ్చాడు.

ఇక వీరిద్దరి కంటే డివిలియర్స్ ను ఎక్కువగా భయపెట్టింది టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా అని స్వయంగా వెల్లడించాడు మిస్టర్ 360. బుమ్రా బౌలింగ్ లో ఆడటం నాకు ఎప్పుడూ సవాలే అని ఏబీడి పేర్కొన్నాడు. బుమ్రాలో పోటీ తత్వం ఎక్కువని, ఇక అతడి బౌలింగ్ అన్నా,అతడన్నా నాకు గౌరవం అని చెప్పుకొచ్చాడు డివిలియర్స్. ప్రపంచంలో ఎంతో మంది బౌలర్లను దంచి కొట్టాను కానీ బుమ్రా బౌలింగ్ అంటే నాకు ఇప్పటికీ భయం అని డివిలియర్స్ తెలిపాడు.