iDreamPost
android-app
ios-app

Asia Cup: బంగ్లాపై భారత్‌ ఓటమి! పరాజయానికి 5 ప్రధాన కారణాలు!

  • Published Sep 16, 2023 | 8:14 AM Updated Updated Sep 16, 2023 | 8:14 AM
  • Published Sep 16, 2023 | 8:14 AMUpdated Sep 16, 2023 | 8:14 AM
Asia Cup: బంగ్లాపై భారత్‌ ఓటమి! పరాజయానికి 5 ప్రధాన కారణాలు!

ఆసియా కప్‌ 2023లో భాగంగా సూపర్‌ 4లో బంగ్లాదేశ్‌తో జరిగిన నామమాత్రపు మ్యాచ్‌లో ఇండియా ఓటమి చవిచూసింది. ఇప్పటికే ఫైనల్‌కు చేరిన టీమిండియా.. సూపర్‌ 4 స్టేజ్‌లో బంగ్లాదేశ్‌తో జరిగిన చివరి మ్యాచ్‌లో భారీ మార్పులతో బరిలోకి దిగింది. తిలక్‌ వర్మ, ప్రసిద్ధ్‌ కృష్ణ లాంటి ప్లేయర్లకు రోహిత్‌ అవకాశం కల్పించాడు. విరాట్‌ కోహ్లీ, బుమ్రా, సిరాజ్‌లకు రెస్ట్‌ ఇచ్చారు. ఈ మ్యాచ్‌లో టీమిండియా కెప్టెన్‌ రోహిత్‌ టాస్‌ గెలిచి.. బంగ్లాను తొలుత బ్యాటింగ్‌కు ఆహ్వానించాడు. ఆరంభంలోనే బంగ్లాను భారత బౌలర్లు వణికించినా.. షకీబ్‌ బంగ్లా ఇన్నింగ్స్‌ను నిలబెట్టాడు. నిర్ణీత 50 ఓవర్లలో బంగ్లా 8 వికెట్ల నష్టానికి 265 పరుగుల మంచి స్కోర్‌ చేసింది. ఈ టార్గెట్‌ను ఛేదించే క్రమంలో టీమిండియా 49.5 ఓవర్లలో 259 పరుగులు చేసి ఆలౌట్‌ అయింది. దీంతో బంగ్లా 6 పరుగులతో విజయం సాధించింది. మరి ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధానంగా నిలిచిన 5 కారణాలంటే ఇప్పుడు విశ్లేషిద్దాం..

1. రోహిత్‌, తిలక్‌ వైఫల్యం
266 పరుగుల టార్గెట్‌ను ఛేదించేందుకు బరిలోకి దిగిన టీమిండియాకు ఆరంభంలోనే బంగ్లా బౌలర్లు షాక్‌ ఇచ్చారు. కెప్టెన్‌ రోహిత్‌ శర్మను తాంజిమ్ హసన్ సాకిబ్ డకౌట్‌గా పెవిలియన్‌కు పంపాడు. ఆ వెంటనే వన్‌డౌన్‌లో వచ్చిన తిలక్‌ వర్మ సైతం 5 పరుగులకే వెనుదిరిగాడు. తిలక్‌కు ఇదే తొలి వన్డే మ్యాచ్‌. ఈ ఇద్దరు విఫలం కావడంతో టీమిండియా ఇన్నింగ్స్‌పై భారీ ఒత్తిడి పడింది. గిల్‌.. సెంచరీతో చెలరేగినా.. అతని చిన్న చిన్న భాగస్వామ్యాలు నెలకొల్పడమే సరిపోయింది. టాపార్డర్‌ నుంచి గిల్‌ ఒక్కడే ఆటడంతో లక్ష్య ఛేదన కష్టమైంది.

2. బౌలింగ్‌
ఈ మ్యాచ్‌లో టీమిండియా బౌలింగ్‌ విభాగం ఆరంభంలో అదరగొట్టినా తర్వాత పట్టు సడలించింది. 28 పరుగులకే 3, 59 రన్స్‌కే 4 వికెట్ల కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన బంగ్లాదేశ్‌ 50 ఓవర్లు బ్యాటింగ్‌ చేసి ఆలౌట్‌ కాకుండా 265 పరుగుల చేసిందంటేనే అర్థం అవుతుంది. టీమిండియా బౌలింగ్‌ వైఫల్యం. పేసర్లు మొహమ్మద్‌ షమీ, శార్దుల్‌ ఠాకూర్‌ ఎర్లీ వికెట్స్‌ అందించినా.. స్పిన్నర్లు అంత ఎఫెక్ట్‌ చూపించలేకపోయారు. దాంతో బంగ్లా కోలుకుంది. శార్దుల్‌ 3 వికెట్లు పడగొట్టినా పరుగులు భారీగానే సమర్పించుకున్నాడు.

3. దారుణమైన ఫీల్డింగ్‌
టీమిండియా బౌలర్ల కంటే కూడా ఫీల్డర్లే జట్టుకు ఎక్కువ నష్టం చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 4 క్యాచ్‌లను నేలపాలు చేశారు. ఇలాంటి ఫీల్డింగ్‌తో బౌలర్లను తప్పుబట్టడం కూడా సరికాదు. కానీ, బౌలింగ్‌తో పాటు టీమిండియా చెత్త ఫీల్డింగ్‌ కూడా ఓటమి కారణమైంది. తిలక్‌ వర్మ, సూర్యకుమార్‌ యాదవ్‌, కేఎల్‌ రాహుల్‌, రోహిత్‌ శర్మ.. క్యాచ్‌లు వదిలేసి బంగ్లా బ్యాటర్లకు లైఫులు ఇచ్చారు. పైగా ఇది నామమాత్రపు మ్యాచ్‌ కావడంతో.. ఆటగాళ్లలో ఆలసత్వం కనిపించింది.

4. మిడిల్డార్‌ చెత్త ప్రదర్శన
అప్పటికే రోహిత్‌ శర్మ, తిలక్‌ వర్మ వైఫల్యంతో ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి జట్టు కష్టాల్లో ఉన్న సమయంలో బాధ్యతాయుతంగా ఆడాల్సిన మిడిల్డార్‌ బ్యాటర్లు దారుణంగా విఫలం అయ్యారు. కేఎల్‌ రాహుల్‌(19), ఇషాన్‌ కిషన్‌(5), సూర్యకుమార్‌ యాదవ్‌(26), జడేజా(7) పరుగులు మాత్రమే చేసి.. ఓటమికి కారణంగా నిలిచారు. వీరిలో ఏ ఇద్దరు బ్యాటర్లు అయినా.. కనీసం 40, 50 పరుగులు చేసినా.. ఫలితం మరోలా ఉండేది. ఇక చివర్లో అక్షర్‌ పటేల్‌ 42 పరుగులతో పోరాడినా.. మ్యాచ్‌ గెలిపించలేకపోయాడు.

5. జట్టులో మార్పు
బంగ్లాదేశ్‌తో మ్యాచ్‌ నామమాత్రమే కావడం, గెలిచినా ఓడినా ఏం కాదు అన్న భావనతో.. టీమిండియా భారీ మార్పులతో బరిలోకి దిగింది. ముఖ్యంగా బౌలింగ్‌ విభాగం చాలా వీక్‌గా కనిపించింది. షమీ ఒక్కడే పర్వాలేదనిపించాడు. శార్దుల్‌ 3 వికెట్లు తీసినా.. పరుగులు కూడా భారీగానే సమర్పించుకున్నాడు. అక్షర్‌, జడేజా, ప్రసిద్ధ్‌ పెద్దగా ప్రభావం చూపలేకపోయారు. తిలక్‌ వర్మ పార్ట్‌టైమ్‌ బౌలర్‌గా 4 ఓవర్లు వేసి 21 పరుగులిచ్చాడు. బ్యాటింగ్‌లో కోహ్లీ, పాండ్యాకు రెస్ట్‌ ఇచ్చింది టీమిండియా. వారిస్థానాల్లో ఆడిన తిలక్‌, సూర్య విఫలం అయ్యారు. ఇలా టీమ్‌లో చేసిన భారీ మార్పు కూడా ఓటమికి కారణమైంది. మరి బంగ్లాదేశ్‌ చేతిలో టీమిండియా ఓడిపోవడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

ఇదీ చదవండి: ఇది బ్యాటింగ్ కాదు.. అంతకు మించి! క్లాసెన్ బీభత్సం.. ఆసీస్ బౌలర్లకు పీడకల