టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే!

టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌లో టీమిండియా విజయానికి 5 ప్రధాన కారణాలు ఇవే!

IND vs SA, Final, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలవడానికి కారణమైన ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

IND vs SA, Final, T20 World Cup 2024: టీ20 వరల్డ్‌ కప్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో సౌతాఫ్రికాపై టీమిండియా గెలవడానికి కారణమైన ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం..

కల నేరవేరింది.. 17 ఏళ్ల సుదీర్ఘ నిరీక్షణకు తెరపడింది.. అప్పుడెప్పుడో 2007లో ధోని కెప్టెన్సీలో టీమిండియాకు మొట్టమొదటి టీ20 వరల్డ్‌ కప్‌ వచ్చింది. ఆ తర్వాత మళ్లీ అది అందని ద్రాక్షగానే మారింది. కానీ, ఆ పొట్టి ప్రపంచ కప్‌ను మరోసారి అందించాడు రోహిత్‌ శర్మ. వంద కోట్లమందికి పైగా భారత క్రికెట్‌ అభిమానులు హృదయాలను సంతోష పెడుతూ.. టీమిండియా టీ20 వరల్డ్‌ కప్‌ 2024ను సాధించింది. విరాట్‌ కోహ్లీ పెద్ద దిక్కు లాంటి క్రికెటర్‌ తన పాత్రను పోషిస్తూ మ్యాచ్‌ విన్నింగ్‌ ఇన్నింగ్స్‌ ఆడిన వేళ, కుర్రాడు అక్షర్‌ పటేల్‌ సూపర్‌ నాక్‌తో స్కోర్‌ బోర్డును పరుగులు పెట్టించగా.. విజయం ముంగిట్లో నిలిచిన సౌతాఫ్రికాను బుమ్రా, అర్షదీప్‌, హార్ధిక్‌ పాండ్యా అత్యాద్భుతమైన బౌలింగ్‌తో మ్యాచ్‌ను గెలిపించారు. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ఐసీసీ ట్రోఫీని అందించారు. మరి సౌతాఫ్రికాతో జరిగిన ఫైనల్‌ మ్యాచ్‌లో మన విజయానికి కారణమైన ఓ ఐదు ప్రధాన అంశాలేంటో ఇప్పుడు చూద్దాం..

1. విరాట్‌ కోహ్లీ
ఈ టోర్నీలో అత్యంత దారుణంగా విఫలమైన భారత క్రికెటర్లలో విరాట్‌ కోహ్లీ ఒకడు. టీ20 వరల్డ్‌ కప్‌ కంటే ముందు సూపర్‌ ఫామ్‌లో ఉన్న కోహ్లీ.. ఈ మెగా టో​ర్నీ ప్రారంభం అయ్యాక ఫామ్‌ కోల్పోయినట్లు ఆడాడు. ఏదీ అతనికి కలిసి రాలేదు. రోహిత్‌తో కలిసి ఓపెనర్‌గా ఆడటంతో ఒత్తిడి పెరుగుతుందని, అయినా కోహ్లీపై నమ్మకం ఉంచాల్సిందే అని చాలా మంది క్రికెట్‌ అభిమానులు బలంగా నమ్మారు. కెప్టెన్‌ రోహిత్‌ సైతం.. కోహ్లీ బిగ్‌ మ్యాచ్‌ ప్లేయర్‌ అని, ఫైనల్‌ కోసం రన్స్‌ దాస్తున్నాడంటూ సెమీ ఫైనల్‌ తర్వాత పేర్కొన్నాడు. రోహిత్‌ చెప్పిన మాటను అక్షర సత్యం చేశాడు విరాట్‌ కోహ్లీ. ఫైనల్‌లో తొలుత బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా 34 పరుగులకే 3 కీలక వికెట్లు కోల్పోయింది. రోహిత్‌, పంత్‌, సూర్య వెంటవెంటనే పెవిలియన్‌ చేరారు. ఇలాంటి సమయంలో కోహ్లీ ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యత తీసుకున్నాడు. కాస్త స్లోగా ఆడినా.. మ్యాచ్‌లో టీమిండియాను ముందుకు నడిపించాడు. కోహ్లీ అలా ఆడకపోయి ఉంటే పరిస్థితి మరోలా ఉండేది. మరో ఎండ్‌లో అక్షర్‌ పటేల్‌, దూబే వేగంగా ఆడారంటే అందుకు ప్రధాన కారణం కోహ్లీ ఉన్నాడనే ధైర్యం. మొత్తంగా 59 బంతుల్లో 6 ఫోర్లు, 2 సిక్సులతో 76 పరుగులు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు కోహ్లీ. ఈ ఫైనల్‌ మ్యాచ్‌ టీమిండియా గెలిచిందంటే అందుకు కోహ్లీనే ప్రధాన కారణం.

2. భాగస్వామ్యాలు
34 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన తర్వాత.. విరాట్‌ కోహ్లీ – అక్షర్‌ పటేల్‌, కోహ్లీ – శివమ్‌ దూబే మధ్య అద్భుతమైన పార్ట్నర్‌షిప్‌లు నమోదు అయ్యాయి. రోహిత్‌, పంత్‌, సూర్య తక్కువ స్కోర్లకు అవుట్‌ అయిన తర్వాత.. ఇన్నింగ్స్‌ నిర్మించే బాధ్యతను కోహ్లీ తీసుకున్నాడు. అతని అండతో అక్షర్‌, దూబే మంచి ఇన్నింగ్స్‌లు ఆడారు. అక్షర్‌తో కలిసి 4వ వికెట్‌కు 72 పరుగులు జోడించిన కోహ్లీ, దూబేతో కలిసి 5వ వికెట్‌కు 57 పరుగులు జోడించాడు. ఈ రెండు అత్భుతమైన భాగస్వామ్యాలు టీమిండియాను మ్యాచ్‌లో నిలబెట్టాయి. విజయానికి కారణం అయ్యాయి.

3. అద్భుత బౌలింగ్‌
సౌతాఫ్రికాపై టీమిండియా ఫైనల్‌ మ్యాచ్‌ గెలిచిందంటే.. కోహ్లీ తర్వాత ఎక్కువ క్రెడిట్‌ బౌలర్లకే ఇవ్వాలి. అందులోనూ ముఖ్యంగా జస్ప్రీత్‌ బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యాలే ఈ మ్యాచ్‌ను గెలిపించారు. ఎందుకంటే.. 30 బంతుల్లో 30 పరుగులు కావాల్సిన సమయం, క్రీజ్‌లో క్లాసెన్‌, మిల్లర్‌ లాంటి హిట్టర్లు ఉన్నారు. అప్పటికే క్లాసెన్‌ పిచ్చికొట్టుడు కొడుతున్నారు. ఇక ఓటమి ఖాయం అనుకున్న సమయంలో బుమ్రా వేసిన బౌలింగ్‌తో మ్యాచ్‌ మనవైపు తిరిగి, ఒత్తిడికి వణికిపోయే సౌతాఫ్రికా మ్యాచ్‌లో చేజార్చకుంది. 16 ఓవర్‌లో 4 పరుగులు, 18వ ఓవర్‌లో కేవలం 2 పరుగులు ఒక వికెట్‌తో బుమ్రా మ్యాచ్‌ను మలుపుతిప్పాడు. పాండ్యా క్లాసెన్‌, మిల్లర్‌లను అవుట్‌ చేసి.. విజయం ఖాయం చేశాడు.

4. సూర్య సూపర్‌ క్యాచ్‌
సౌతాఫ్రికాకు చివరి 6 బంతుల్లో 16 పరుగులు కావాలి. అప్పటికే బుమ్రా, అర్షదీప్‌ సింగ్‌ ఓవర్లు అయిపోయాయి. హార్ధిక్‌ పాండ్యా చేతుల్లో బంతి ఉంది. ఎదురగా డేంజరస్‌ బ్యాటర్‌ మిల్లర్‌ ఉన్నాడు. దాంతో ఇంకా విజయం కష్టమే అనే భావనలో క్రికెట్‌ అభిమానులు ఉన్నారు. కానీ, పాండ్యా వేసిన చివరి ఓవర్‌ తొలి బంతిని మిల్లర్‌ లాంగ్‌ ఆఫ్‌ మీదుగా భారీ షాట్‌ కొట్టాడు.. ఆల్‌మోస్ట్‌ సిక్స్‌ వెళ్లిపోయిన బాల్‌ను సూర్యకుమార్‌ యాదవ్‌ సూపర్‌ మ్యాన్‌లా వచ్చి.. అద్భుతమైన క్యాచ్‌ అందుకున్నాడు. దాంతో మిల్లర్‌ పెవిలియన్‌ చేరడంతో మ్యాచ్‌ భారత చేతుల్లోకి వచ్చేసింది. ఆ బాల్‌ సిక్సు పోయి ఉంటే.. కచ్చితంగా మ్యాచ్‌ ఫలితం మరోలా ఉండేది. అందుకే ఈ మ్యాచ్‌ గెలవడానికి సూర్య పట్టిన క్యాచ్‌ కూడా ప్రధాన కారణం.

5. రోహిత్‌ కెప్టెన్సీ
ఇక చివరిగా కచ్చితంగా చెప్పుకోవాల్సిన విషయం రోహిత్‌ శర్మ కెప్టెన్సీ.. సౌతాఫ్రికా విజయానికి 30 బంతుల్లో 30 పరుగులు అవసరమైన సమయంలో కూడా ఏ మాత్రం ఆత్మ విశ్వాసం కోల్పోకుండా.. సరైన సయమంలో బుమ్రాను బౌలింగ్‌కు రప్పించడం, తర్వాత అర్షదీప్‌ సింగ్‌, హార్ధిక్‌ పాండ్యాను అద్భుతంగా వాడుకుని.. సరైన బౌలింగ్‌ మార్పులు, ఫర్ఫెక్ట్‌ ఫీల్డ్‌ సెట్‌తో రోహిత్‌ శర్మ తన మార్క్‌ను చూపించాడు. ఈ ఆటగాడిని ఎక్కడైతే పెట్టాలో అక్కడే పెట్టి మ్యాచ్‌ను సౌతాఫ్రికాను నుంచి లాక్కున్నాడు రోహిత్‌. సూర్యను సరైన లాంగ్‌ ఆఫ్‌లో ఫీల్డింగ్‌ పెట్టకపోయి ఉంటే మ్యాచ్‌ మనం గెలిచే వాళ్లం కాదు అని చాలా మంది భావిస్తున్నారు. మరి ఫైనల్‌లో విజయానికి కారణమైన ఈ ఐదు అంశాలపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

Show comments