iDreamPost

విండీస్‌దే సిరీస్‌! చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి 4 ప్రధాన కారణాలు

  • Published Aug 14, 2023 | 9:58 AMUpdated Aug 14, 2023 | 9:58 AM
  • Published Aug 14, 2023 | 9:58 AMUpdated Aug 14, 2023 | 9:58 AM
విండీస్‌దే సిరీస్‌! చివరి మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి 4 ప్రధాన కారణాలు

వెస్టిండీస్‌తో జరిగిన ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో టీమిండియా ఓడిపోయింది. 2-3 తేడాతో విండీస్‌ వీరులు సిరీస్‌ను కైవసం చేసుకున్నారు. దాదాపు 17 ఏళ్ల తర్వాత భారత్‌.. విండీస్‌తో సిరీస్‌ కోల్పోయింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో వెస్టిండీస్‌, తర్వాత రెండు మ్యాచ్‌ల్లో భారత్‌ గెలిచి.. 2-2తో సమంగా ఉండగా.. ఆదివారం అమెరికాలోని ఫ్లోరిడాలో జరిగిన సిరీస్‌ డిసైడర్లో టీమిండియా దారుణ ఓటమిని చవిచూసింది. ఈ మ్యాచ్‌లో టీమిండియా మిస్టర్‌ 360 రాణించినా.. మిగతా బ్యాటర్లు, బౌలర్లు విఫలం కావడంతో టీమిండియాకు ఓటమి తప్పలేదు. అయితే.. ఈ మ్యాచ్‌లో టీమిండియా ఓటమికి ప్రధానంగా 4 కారణాలు ఉన్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం..

1. ఓపెనర్ల వైఫల్యం
నాలుగో మ్యాచ్‌ల్లో టీమిండియా ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌ ఎలాంటి అద్భుతమైన ప్రదర్శన ఇచ్చారో మనం చూశాం. కానీ, ఈ మ్యాచ్‌లో అంతే దారుణంగా విఫలం అయ్యారు. ఈ మ్యాచ్‌ ఫార్మాట్‌లోనైనా ఓపెనింగ్‌ జోడీ ఇచ్చే ఆరంభంపైనే ఎక్కువగా గెలుపోటములు ఆధారపడి ఉంటాయి. అయితే.. ఈ మ్యాచ్‌లో జైస్వాల్‌ 5, గిల్‌ 9 పరుగులు మాత్రమే చేసి అవుట్‌ అయ్యారు. వీరిద్దరూ పెద్దగా పరుగులు చేయకుండా వెంట వెంటనే అవుట్‌ కావడంతో ఆ ప్రభావం మిగతా బ్యాటర్లపై పడింది.

2. సూర్యకుమార్‌ యాదవ్‌కు లభించని మద్దతు
ఓపెనర్లు టీమ్‌ స్కోర్‌ 17 పరుగుల వద్దే పెవిలియన్‌ చేరడంతో.. వన్‌ డౌన్‌లో వచ్చిన సూర్యపై పెద్ద బాధ్యత పడింది. ఇన్నింగ్స్‌ను నిర్మించాల్సిన పనిని తన భుజాలపై ఎత్తుకున్న సూర్య.. వందకు వంద శాతం పోరాటం చేశాడు. ఆరంభంలో కొద్ది సేపు తెలుగు తేజం తిలక్‌ వర్మ(27) నుంచి కాస్త సపోర్ట్‌ లభించినా.. అది ఎక్కువ సేపు నిలువలేదు. తిలక్‌ ఉన్నంత సేపు టీమిండియ ఇన్నింగ్స్‌ కోలుకుంటున్నట్లు అనిపించినా.. తిలక్‌ అవుటైన తర్వాత.. సూర్య ఒక్కడే ఇన్నింగ్స్‌ను నడిపించాడు. అతనికి మిగతా బ్యాటర్ల నుంచి కనీస మద్దతు లభించలేదు.

3. చెత్త బ్యాటింగ్‌
ఓ వైపు సూర్యకుమార్‌ యాదవ్‌ పోరాడుతుంటే.. మిగతా బ్యాటర్లు మరీ నిర్లక్ష్యంగా బ్యాటింగ్‌ చేశారు. ఓపెనర్లు యశస్వి జైస్వాల్‌, శుబ్‌మన్‌ గిల్‌, సంజు శాంసన్‌, హార్దిక్‌ పాండ్యా, అక్షర్‌ పటేల్‌ చెత్త బ్యాటింగ్‌తో టీమిండియా ఓటమికి ప్రధాన కారణంగా నిలిచారు. సూర్యకుమార్‌ యాదవ్‌ తర్వాత.. కాస్తా కూస్తో తిలక్‌ వర్మ పర్వాలేదనిపించాడు. సూర్య 45 బంతుల్లో 4 ఫోర్లు, 3 సిక్సులతో 61 పరుగులతో రాణిస్తే.. తిలక్‌ వర్మ 18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సులతో 27 పరుగులు చేసి పర్వాలేదనిపించాడు. కానీ, మిగతా బ్యాటర్లు దారుణంగా ఆడారు. ముఖ్యంగా సూర్య, తిలక్‌ కలిసి ఇన్నింగ్స్‌ను నిలబెట్టిన తర్వాత కూడా సంజు, పాండ్యా ఆ ఫ్లోను కొనసాగించలేదు. టీమిండియా చివరి ఐదు వికెట్లను కేవలం 35 పరుగుల తేడాతో కోల్పోయింది.

4. వర్షం
భారత్‌ బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో రెండు సార్లు వర్షం అంతరాయం కలిగించింది. 16, 20వ ఓవర్ల సమయంలో వర్షం వచ్చింది. దీంతో టీమిండియా చివరి ఓవర్లలో వీలైనన్ని ఎక్కువ పరుగులు చేయలేకపోయింది. పైగా వెస్టిండీస్‌లానే స్పిన్నర్లతో బౌలింగ్‌ ఆరంభించి.. సాధ్యమైనంత ఎక్కువ వికెట్లను పవర్‌ప్లేలో తీసుకోవాలనే ప్లాన్‌పై కూడా వర్షం నీళ్లు చల్లింది. వర్షం కారణంగా అవుట్‌ ఫీల్డ్‌ తడిగా ఉండటం, బాల్‌పై గ్రిప్‌ దొరకపోవడంతో పేసర్లతోనే పాండ్యా బౌలింగ్‌ ఎటాక్‌ను ప్రారంభించాడు. ఇది కూడా టీమిండియా ఓటమికి ఒక కారణంగా నిలిచింది.

ఇదీ చదవండి: కెప్టెన్ పాండ్యాపై ప్రశంసలు.. మీరు మారిపోయార్ సార్ అంటూ..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి