Pekamedalu Movie Review And Rating In Telugu: రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న సినిమా పేరు పేకమేడలు. మధ్యతరగతి జీవితాలను కళ్లకు కడుతూ చిన్న సినిమాగా వస్తున్న ఈ పేకమేడలు సినిమా ఎలా ఉందో తెలియాలంటే.. ఈ రివ్యూ పూర్తిగా చదివేయండి.
Pekamedalu Movie Review And Rating In Telugu: రెండు తెలుగు రాష్ట్రాల్లో బాగా వినిపిస్తున్న సినిమా పేరు పేకమేడలు. మధ్యతరగతి జీవితాలను కళ్లకు కడుతూ చిన్న సినిమాగా వస్తున్న ఈ పేకమేడలు సినిమా ఎలా ఉందో తెలియాలంటే.. ఈ రివ్యూ పూర్తిగా చదివేయండి.
Raj Mohan Reddy
ఇండస్ట్రీలో కొన్ని రోజులుగా గట్టిగా వినిపిస్తున్న సినిమా “పేకమేడలు”. ప్రమోషన్స్ దగ్గర నుండి వెరైటీ చూపించి, ఆడియన్స్ అటెన్షన్ సంపాదించుకున్న “పేకమేడలు”.. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అయితే.. అంతకన్నా ముందే ప్రెస్ కి స్పెషల్ షో వేశారు. మరి.. ప్రమోషన్స్ తో ప్రామిసింగ్ కంటెంట్ అనిపించుకున్న పేకమేడలు మూవీ ఎలా ఉందొ ఈ రివ్యూలో తెలుసుకుందాం.
లక్ష్మణ్ (వినోద్ కిషన్) బీటెక్ చదివినా ఉద్యోగం చేయకుండా, రియల్ ఎస్టేట్ బ్రోకర్ గా కోట్లు సంపాదించాలని ఆశ పడుతుంటారు. అతని భార్య వరలక్ష్మి (అనూష కృష్ణ) మాత్రం చిన్నాచితక పనులు చేస్తూ ఆ ఇంటిని పోషిస్తూ ఉంటుంది. భర్త నుండి సపోర్ట్ లేకపోవడంతో ఏదైనా చిన్న బిజినెస్ స్టార్ట్ చేయాలని వరలక్ష్మి ఆశ పడుతుంది. తన కొడుకుని మంచిగా చదివించుకోవాలని, నలుగురిలో గౌరవంగా బతకాలి అన్నది ఆమె కోరిక. కానీ.., లక్ష్మణ్ మాత్రం ఇవేమి పట్టించుకోకుండా గాలిలో మేడలు కడుతూ ఉంటాడు. సరిగ్గా ఇలాంటి సమయంలో లక్ష్మణ్ కి NRI మహిళగా శ్వేత (రేతిక శ్రీనివాస్) పరిచయం అవుతుంది. లక్ష్మణ్ ఆమెతో పరిచయం పెంచుకుని లైఫ్ లో సెటిల్ అవ్వాలని కలలు కంటాడు. అనుకున్నట్టే ఆమెని ట్రాప్ చేస్తాడు. అయితే.. ఇక్కడ నుండి వారి జీవితాలు ఎలా మారాయి? గాలిలో మేడలు కట్టిన లక్ష్మణ్ సక్సెస్ అయ్యాడా? అతని భార్యగా వరలక్ష్మి ఎన్ని బాధలు పడాల్సి వచ్చింది? చివరికి వీరి సంసారం ఏమైంది? లక్ష్మణ్ కట్టిన పేకమేడలు నిలబడ్డాయా? లేదా? అన్నదే ఈ చిత్ర కథ
శని, ఆదివారాలు బాగా పార్టీలు చేసుకుని, కడుపు అంతా చెడిపోయి.. సోమవారం రోజు ఉత్త పెరుగన్నం తింటుంటే ప్రశాంతంగా అనిపిస్తుంది. పేకమేడలు సినిమా కూడా ఇలాంటి పెరుగన్నంలాంటిదే. సినిమా అంటే వందల కోట్ల పెట్టుబడి, సూపర్ స్టార్ కాస్ట్, గ్రాండియర్ మేకింగ్, మెస్మరైజ్ చేసే విజువల్స్, భారీ సెట్స్ అంటూ లెక్కలు మారిపోయాయి. ఈ మొత్తం హడావిడిలో సినిమాకి బేసిక్ థింగ్ అయిన డ్రామా ఎప్పుడో మిస్ అయిపోయింది. కొన్ని క్యారెక్టర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుని, ఆ పాత్రల ప్రయాణం చుట్టూ కొన్ని ఎమోషన్స్ అల్లుకుని డ్రామా క్రియేట్ చేసుకోగలిగితే ఎంత చిన్న సినిమా అయినా పెద్ద విజయం సాధిస్తుంది. దర్శక రత్న దాసరి నారాయణరావు సక్సెస్ ఫార్ములా ఇది. పేకమేడలు దర్శకుడు నీలగిరి మామిళ్ల ఇదే పంథాలో తన కథ, కథనం సాగేలా చూసుకున్నారు. ఇలా ఎప్పుడైతే తాను చెప్పాలి అనుకున్న కథని సిన్సియర్ గా డీవియేట్ కాకుండా తెరకెక్కించాడో అక్కడే పేకమేడలు సినిమా సక్సెస్ ని అందేసుకుంది. ఆ నిజాయతీ ఉంది కాబట్టే ఈ సినిమాలో ఎమోషన్ క్యారీ అయ్యింది.
పేకమేడలు ఫస్ట్ ఆఫ్ లో ఎలాంటి మెరుపులు ఉండవు. కేవలం క్యారెక్టర్స్ బిహేవియర్స్ ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ పోయే కొన్ని సీన్స్ మాత్రమే కనిపిస్తూ ఉంటాయి. అయితే.. ఈ మొత్తం సీక్వెన్స్ లో హీరో, హీరోయిన్ పోటీపడి నటించడంతో ఆ సన్నివేశాలు అన్నీ పండాయి. ఇక కథలోకి ఎప్పుడైతే NRI మహిళగా రేతిక శ్రీనివాస్ క్యారెక్టర్ వస్తుందో.. అక్కడ నుండి సినిమా వేగం అందుకుంటుంది. నిజానికి ఇక్కడ దర్శకుడు డీవియేట్ అయిపోయి.., రేతిక శ్రీనివాస్ తో రొమాంటిక్ సీన్స్ తెరకెక్కించేసి సినిమాని కమర్షియల్ ట్రాక్ ఎక్కించేసి ఉండవచ్చు. కానీ.., నీలగిరి మామిళ్ల ఆ ఛాన్స్ తీసుకోలేదు. అతను లక్ష్మణ్, వరలక్ష్మి కథ మాత్రమే చెప్తూ వచ్చాడు. లక్ష్మణ్ మనిషిగా ఎంత దిగజారిపోయాడో చూపించడంతో ఫస్ట్ ఆఫ్ ముగుస్తుంది.
సెకండాఫ్ మొదలైన దగ్గర నుండి కథనం స్పీడ్ అందుకుంటుంది. ఇదే సమయంలో లక్ష్మణ్ పాత్రలో నెగిటివ్ షేడ్ పెరిగిపోతూ, వరలక్ష్మి క్యారెక్టర్ హైలెట్ అవుతూ వస్తుంది. ఒకానొక సమయంలో కథలోని బరువు అంతా హీరోయిన్ పాత్రపై పడిపోతుంది. అంత వెయిట్ లో అనూష కృష్ణ చేసిన యాక్టింగ్ మాత్రం నిజంగా సూపర్బ్. ముఖ్యంగా ప్రీ క్లయిమ్యాక్స్ లో భర్తని ఎదిరించే సీన్ అద్భుతంగా వచ్చింది. అందులో అనూష కృష్ణది అవార్డు విన్నింగ్ పర్ఫార్మెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇక క్లైమ్యాక్స్ లో దర్శకుడు రెండు ప్రధానమైన క్యారెక్టర్స్ ని హ్యాండిల్ చేసిన విధానం అద్భుతంగా ఉంది.
పేకమేడలు సినిమాకి ప్రధాన బలం వినోద్ కిషన్, అనూష కృష్ణ నటన. మధ్యతరగతి జీవితాల బతుకులు ఎలా ఉంటాయో కళ్ళకి కట్టినట్టు నటించి చూపించారు. వీరి తరువాత ప్రధాన పాత్రలు అంటూ సినిమాలో ఎవరివి లేవు. మిగతా అందరూ ఇలా వచ్చి, అలా మురిసిపోయారు. టెక్నికల్ గా మాత్రం పేకమేడలు టీమ్ ని మెచ్చుకోవాల్సిందే. నమ్మిన కథకి, ఒక బడ్జెట్ అనుకుని ఉన్నంతలోనే మ్యాజిక్ చేశారు. హరిచరణ్ సినిమాటోగ్రఫీ బెస్ట్ ఫీల్ ఇచ్చింది. ఇక్కడ ఆర్ట్ వర్క్ ని కూడా మెచ్చుకోవాలి. ఇక మ్యూజిక్ లో మెరుపులు లేకపోయినా.. బ్యాగ్రౌండ్ స్కోర్ మాత్రం ఆకట్టుకుంది. కథలోని ఎమోషన్ ని డిస్టర్బ్ చేయకుండా, అవసరమైన దగ్గర మాత్రం ఆర్ఆర్ ఇవ్వడం నిజంగా గొప్ప విషయం. దర్శకుడిగా నీలగిరి మామిళ్ల నిజాయతీ నచ్చింది. అతను కథని నమ్మిన విధానం బాగుంది. చివరగా నిర్మాత రాకేశ్ వర్రేని ఎంత పొగిడినా తక్కవే. తాను కూడా ఓ స్ట్రగులింగ్ యాక్టర్ అయ్యి, మంచి కథకి ఇంత అండగా నిలబడటం నిజంగా మెచ్చుకోవాల్సిన విషయం.
చివరి మాట: పేకమేడలు.. చిన్న సినిమా కాదు, మంచి సినిమా
రేటింగ్: 3/5