ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి తెరకెక్కించిన చిత్రం ‘మలైకోటై వాలిబన్’
ప్రముఖ నటుడు మోహన్‌లాల్ హీరోగా దర్శకుడు లిజో జోస్ పెల్లిస్సేరి తెరకెక్కించిన చిత్రం ‘మలైకోటై వాలిబన్’
Dharani
విభిన్నమైన పాత్రలు, కథలు చేయాలంటే మలయాళ నటీనటులకే సాధ్యం. తాజాగా మమ్ముట్టి నటించిన భ్రమయుగం సినిమా చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది. అలానే మరో నటుడు మోహన్‌లాల్ కూడా వైవిధ్యభరితమైన పాత్రలను ఎంచుకుంటూ.. ఎప్పటికప్పుడు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారు. ఇక తాజాగా మోహన్‌లాల్ నటించిన పీరియాడికల్ సినిమా మలైకోటై వాలిబాన్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ‘డిస్నీ+ హాట్‌స్టార్’లో స్ట్రీమింగ్ అవుతుంది ఈ సినిమా. ఈ ఏడాది జనవరి 25న ఈ సినిమా విడుదల కాగా.. తెలుగులో మాత్రం రిలీజ్ కాలేదు. తాజాగా హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. మరి ఈ చిత్రం ఎలా ఉందంటే..
మలైకోటై వాలిబన్ కథ విషయానికి వస్తే.. మల్లయోధుడైన వాలిబన్ (మోహన్‌లాల్) సోదరుడితో కలిసి గ్రామాల్లో తిరుగుతూ.. మల్లయోధులతో పోరాడి విజయం సాధిస్తూ.. ముందుకు సాగుతుంటాడు. దాంతో అతడికి అభిమానులతో పాటు శత్రువులు కూడా పెరుగుతారు. మరి ఆ శత్రుత్వం ఎక్కడికి దారి తీసింది.. ఓ సంస్థానంలో ఆంగ్లేయుల చెరలో బందీలుగా ఉన్న వారిని వాలిబన్ ఎలా విడిపించాడు.. అతడి సోదరుడు ఎందుకు మరణించాడు.. అసలు వాలిబన్ ఫ్లాష్‌బ్యాక్ ఏంటి.. అతడు ఎలా మలైకోటై వాలిబన్గా మారాడు అనే విషయాలు తెలియాలంటే సినిమా చూడాలి.
మలైకోటై వాలిబన్ ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఫిల్మ్. నిజాలు తెలుసుకోకుండా.. ఇతరులు చెప్పే అబద్దాలు నమ్మి.. వాటి ఆధారంగా పెంచుకునే పగ, ప్రతీకారం ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనే అంశాలను దర్శకుడు లిజో ఈ చిత్రంలో చెప్పే ప్రయత్నం చేశాడు. ఇది కొత్త కథ కాదు.. అలాంటప్పుడు స్క్రీన్‌ప్లే బలంగా ఉండాలి. వాలిబన్ సినిమా అక్కడే కాస్త తడబడింది. పైగా అసలు కథలోకి ప్రేక్షకుడిని తీసుకెళ్లేందుకు దర్శకుడు చాలా సమయం తీసుకున్నాడు. మోహన్‌లాల్ ఇంట్రడక్షన్ సీన్ కూడా పెద్దగా ఆకట్టుకునేలా లేదు. ఫస్టాఫ్‌లో ఒకటి, రెండు సన్నివేశాలు తప్ప మిగతావేవి గుర్తుపెట్టుకునేలా ఉండవు. డైలాగ్స్ పదే పదే రిపీట్ అవుతుంటాయి. ఇలాంటి సినిమాలో పాటలు పెద్దగా ఉపయోగపడవు. సినిమా నిడివి పెరగడం తప్ప.
సెకండాఫ్‌లో కథ పరుగులు పెడుతుంది అయితే ప్రేక్షకులు ఆశించిన ట్విస్ట్ మాత్రం కనిపించదు. డ్యాన్సర్ ప్రేమను వాలిబన్ తిరస్కరించడం మరో మలుపు. అలానే వాలిబన్ సోదరుడి లవ్‌ట్రాక్ కూడా కూడా కథలో కీలకంగా ఉంటుంది. వాలిబన్ మల్లయోధుడిగా ఎందుకు మారాల్సి వచ్చింది, అతడి గురువు గతమేంటో తెలిశాక ప్రేక్షకులు ఆశ్చర్యపోతారు వావ్ అనాల్సిందే. క్లైమాక్స్‌ను బాగా డిజైన్ చేశారు. సీక్వెల్ ఉందని చెప్పడంతో దాన్ని దృష్టిలో పెట్టుకునే ఫస్ట్ పార్ట్‌ని సాగదీసినట్లు అనిపించింది.
ఈ సినిమాలో వాలిబన్ పాత్రే తెరపై ఎక్కువ కనిపిస్తుంది. మోహన్‌లాల్ ఆ పాత్రకు న్యాయం చేశారు. వేషధారణ, అభినయం ఆకట్టుకుంటాయి. నర్తకిగా సోనాలీ కులకర్ణి, వాలిబన్ గురువుగా హరీశ్ పేరడి అలరిస్తారు. వాలిబన్ సోదరుడు తదితర పాత్రధారులు తన పాత్ర పరిధి మేరకు నటించాడు. టెక్నికల్ అంశాలకు వస్తే.. ప్రశాంత్ పిళ్లై అందించిన మ్యూజిక్ పెద్దగా ప్రభావం చూపలేకపోయింది. మధు నీలకందన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్‌పై దీపు జోసెఫ్ ఇంకాస్త శ్రద్ధ పెట్టి ఉండాల్సింది. ‘జల్లికట్టు’తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న దర్శకుడు లిజో జోస్ వాలిబన్ సినిమాతో మెప్పించలేకపోయారు.
చివరిగా: వాలిబన్