iDreamPost
android-app
ios-app

క్రాక్ రివ్యూ

  • Published Jan 09, 2021 | 9:58 PM Updated Updated Jan 09, 2021 | 9:58 PM
క్రాక్ రివ్యూ

మాస్ మహారాజాగా అభిమానులు దర్శక నిర్మాతలు పిలుచుకునే రవితేజ కొత్త సినిమా క్రాక్ మునుపెన్నడూ లేని అనూహ్యమైన పరిస్థితుల్లో ఈ రోజు విడుదలైంది. ఉదయం నుంచి షోలు వాయిదా పడుతూ వచ్చి ఆఖరికి రాత్రి చివరి ఆట దాకా ప్రేక్షకుల సహనాన్ని పరీక్షించి ఎట్టకేలకు బోణీ చేసింది. టీజర్ ట్రైలర్ నుంచే అంచనాలు రేపుతూ వచ్చిన క్రాక్ హీరోకి దర్శకుడు గోపిచంద్ మలినేనితో హ్యాట్రిక్ మూవీ. అందుకే అంచనాలతో పాటు పాజిటివ్ వైబ్రేషన్స్ కనిపిస్తూ వచ్చాయి. బలుపు తర్వాత రవితేజతో శృతి హాసన్ నటించిన రెండో సినిమా క్రాక్ ఎలా ఉందో రివ్యూలో చూసేయండి మరి

కథ

ఒంగోలుని తన గుప్పిట్లో పెట్టుకుని రౌడీయిజం చేసే కటారి కృష్ణ(సముతిరఖని)ని ఓ కానిస్టేబుల్ హత్య కేసులో అనుమానించిన సిఐ వీరశంకర్(రవితేజ) అప్పటి నుంచి అతనికి కొరకరాని కొయ్యగా మారతాడు. వేటపాలెంలో ఓ బెస్తవాళ్ల గ్యాంగ్ తో చాటుగా హత్యలు చేయించే కృష్ణ కూతురి ప్రేమ విషయంలో శంకర్ అండగా నిలబడతాడు. అక్కడి నుంచి ఇద్దరి మధ్య రావణకాష్టం భగ్గుమంటుంది. బ్యాక్ గ్రౌండ్ అంటే చాలు పూనకం వచ్చేలా ఊగిపోయే శంకర్ అక్కడే కాక కర్నూలు, కడపలోనూ ఇలాంటి గూండాలనే డీల్ చేస్తాడు. ఇంతకీ ఇతని లక్ష్యం ఏంటి, చివరికి కటారి కృష్ణను ఏం చేశాడు అనేదే మిగిలిన స్టోరీ

నటీనటులు

రవితేజ ఎనర్జీని వాడుకోవడం తెలియాలే కానీ ఆ సూత్రాన్ని ఔపసోన పడితే తెరమీద జరిగే తప్పొప్పులు మొత్తం తనే కాచుకుంటాడనేది అందరికీ తెలిసిన వాస్తవం. ఈ విషయంలో చేసే పొరపాట్లకే కొందరు దర్శకులు తమ హీరో కూడా మూల్యం చెల్లించేలా డిజాస్టర్లు ఇచ్చారు. కానీ రెండుసార్లు విజయవంతంగా ఇతన్ని డీల్ చేసిన గోపీచంద్ మలిలేని ఇందులో వాటిని మించి రాబట్టుకున్నాడు. వీరశంకర్ గా అవుట్ ఆంట్ అవుట్ మాస్ పెర్ఫార్మన్స్ తో రవితేజ చాలా కాలం తర్వాత తన స్థాయికి తగ్గ యాక్టింగ్ తో ఆకట్టుకున్నాడు. ముఖంలో కాస్త కళ తగ్గినట్టు అనిపించినా టైమింగ్, గెడ్డంతో కవర్ చేశాడు. ఇది కదా మేము కోరుకున్నదని అభిమానులు ఫీలయ్యేలా మెప్పించాడు.

శృతిహాసన్ ది రెగ్యులర్ పాత్రే. మాస్ ని మెప్పించడం కోసం పెట్టిన రెండు డ్యూయెట్లు ఒక రొమాంటిక్ సాంగ్ కోసం తప్పించి ఎక్కువ వేరియేషన్స్ డిమాండ్ చేసే క్యారెక్టర్ కాదు. కానీ అసలు హై లైట్ గా నిలిచింది మాత్రం సముతిరఖని. చాలా సెలెక్టివ్ గా తెలుగు సినిమాలు చేస్తున్న ఇతన్ని ఈ పాత్ర అంతగా ఆకట్టుకోవడానికి బహుశా ఇందులో ఉన్న డెప్త్ కారణం అయ్యుంటుంది. దానికి తగ్గట్టే కటారిగా చెలరేగిపోయాడు. అతని అనుచరిణిగా చేసిన వరలక్ష్మి శరత్ కుమార్ గుర్తుండిపోతుంది. రాని భాషలోనూ ఇంత క్వాలిటీ యాక్టింగ్ ఇవ్వడమే వీళ్ళను ప్రత్యేకంగా నిలబెడుతోంది. వంశీ చాగంటికి కాస్త స్కోప్ దొరికింది. రవి శంకర్, చిరాగ్ జని, సుధాకర్ కొమాకుల, మౌర్యాని, జీవా, సప్తగిరి, చమ్మక్ చంద్ర, అలీ, గోపరాజు రమణ, మహేష్ కత్తి తదితరులవి చిన్నపాత్రలే కానీ సందర్భానుసారంగా వచ్చి చేసుకుని వెళ్లాయి.

డైరెక్టర్ అండ్ టీమ్

టాలీవుడ్ లో ఇప్పటిదాకా కొన్ని వందల వేల ఖాకీ కథలు సినిమాలుగా వచ్చాయి. ఇవన్నీ ఒకే సూత్రం ప్రకారం నడుస్తాయి. ఒక సిన్సియర్ పోలీస్ ఆఫీసర్, అతనికి అడ్డుతగిలి అసాంఘిక శక్తిగా మారే ఒక లోకల్ రౌడీ లేదా గూండా. వీళిద్దరి మధ్య జరిగే డ్రామానే ప్రతిదాంట్లోనూ కనిపిస్తుంది. క్రాక్ దానికి భిన్నమేమీ కాదు. అయితే ఈ ఫార్ములాలో వెళ్తే రొటీన్ అవుతుందని ముందే గుర్తించిన గోపిచంద్ మలినేని చాలా తెలివిగా ఒక క్రైమ్ బ్యాక్ డ్రాప్ ని ఎంచుకుని దానికి ఇంటరెస్టింగ్ స్క్రీన్ ప్లే జోడించడం చాలా ప్లస్ అయ్యింది. లేదంటే ఇలాంటి బ్యాక్ డ్రాప్ లో ఎన్ని చూశామో అని నిట్టూర్చాల్సి వచ్చేది.

టేకాఫ్ ఆసక్తిగానే మొదలుపెట్టినప్పటికీ ఆ తర్వాత ఓ నలభై నిముషాలు అవసరం లేని ప్రహసనాలు, హీరో హీరోయిన్ లవ్ ట్రాక్, పాటతో టైం వేస్ట్ చేసినట్టు అనిపించినా ఇది కమర్షియల్ సినిమా కాబట్టి గోపిచంద్ పూర్తిగా ఫార్ములా నుంచి బయటికి రాలేకపోయాడు. అందుకే కటారి కృష్ణ ఎంట్రీ దాకా చాలా సోసోగా సాగుతుంది. ఆ తర్వాత మంచి టెంపోతో కథనం నడిపించిన విధానం ఆకట్టుకుంది. చేపలుపట్టే వాళ్ళను కిల్లర్స్ గా చూపించడం ఆ మధ్య నాగశౌర్య అశ్వద్ధామలో చూసినట్టు అనిపించినా ఆ గ్యాంగ్ కోసం సెట్ చేసిన క్యాస్టింగ్, అల్లుకున్న సన్నివేశాలు చాలా బాగా వచ్చాయి. ఇక్కడ ఫైట్ మాస్టర్ రామ్ లక్ష్మణ్ ల కృషి స్పష్టంగా కనిపిస్తుంది.

అలా అని క్రాక్ స్పెషల్ అండ్ డిఫరెంట్ మూవీ ఏమి కాదు. మొత్తంగా చూసుకుంటే చాలా సింపుల్ గానే అనిపిస్తుంది. కానీ గోపీచంద్ మలినేని మాస్ ఆడియన్స్ ని టార్గెట్ పెట్టుకుని రవితేజని ఏ మీటర్ లో చూపిస్తే నచ్చుతుందో సరిగ్గా ఆ కొలతల ప్రకారమే రాసుకుంటూ వెళ్ళాడు. ఆ కోణంలో చూస్తే ఇతను సక్సెస్ అయినట్టే. అయితే క్రాక్ బెస్ట్ పోలీస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా నిలబెట్టడానికి ఇదొక్కటే సరిపోలేదు. సెకండ్ హాఫ్ లో కొంత సేపు హీరో విలన్ క్లాష్ మీద సింగల్ అజెండాతో నడవడం, కొన్ని ట్విస్టులు ఈజీగా గెస్ చేసేలా ఉండటం కొంత మైనస్ అయ్యాయి. అలా అని వీటిని మరీ లోపాలు అనలేం కానీ ఏదో మిస్ అవుతున్న ఫీలింగ్ అక్కడక్కడా కలుగుతుంది.

ఎంత పోలీస్ కథలైనా హీరోతో ప్రేక్షకులు కనెక్ట్ అయ్యే భావోద్వేగాలు చాలా ముఖ్యం. విక్రమార్కుడులోనూ గొప్ప కథ లేనప్పటికీ అందులో రాజమౌళి ఎలివేషన్ ప్లస్ ఎమోషన్ రెండింటిని పర్ఫెక్ట్ గా బ్యాలన్స్ చేయడంతో బ్లాక్ బస్టర్ గా నిలిచింది. క్రాక్ లో ఇది అంత గొప్పగా పండలేదు. అయినప్పటికీ రవితేజ గత మూడు నాలుగు సినిమాల మాదిరి బ్యాడ్ రిమార్క్స్ ఎక్కువ పడకుండా గోపీచంద్ మలినేని చాలా జాగ్రత్తలు తీసుకున్న విషయం అర్థమవుతుంది. తమన్ నేపధ్య సంగీతం చాలా సీన్స్ లో హీరో ఎలివేషన్ లో పై స్థాయికి తీసుకెళ్లి ఎన్నో మైనస్సులను కవర్ చేసింది. ఒక క్రమపద్ధతిలో సన్నివేశాలను డిజైన్ చేసుకోవడంలో గోపీచంద్ పనితనం ఆకట్టుకుంటుంది.

తమన్ మరోసారి తన ట్రేడ్ మార్క్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో ఆడుకున్నాడు. సాంగ్స్ కన్నా ఎక్కువ బిజిఎం ఆకట్టుకుంటుంది. మంచి సౌండ్ సిస్టం ఉన్న థియేటర్లో ఇతని పనితనం తెలుస్తుంది. కానీ పాటలు మాత్రం రొటీన్ గానే అనిపిస్తాయి. జికె విష్ణు ఛాయాగ్రహణం ఈ మధ్య చూసిన సినిమాల్లో బెస్ట్ అవుట్ పుట్ అనిచెప్పొచ్చు . కెమెరా యాంగిల్స్ ని సెట్ చేసుకున్న తీరు, విజువల్స్ ని చూపించిన విధానం చాలా బాగుంది. ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్స్ కి ఉండాల్సిన మూడ్ క్యారీ అయ్యేలా మంచి వర్క్ చేశారు. రామ్ లక్ష్మణ్ పోరాటాలు క్రాక్ కి ప్రధాన బలంగా నిలిచాయి. సాయి మాధవ్ బుర్ర సంభాషణలు మాములుగానే ఉన్నాయి. ఎక్కువ మెరుపులు లేవు. నవీన్ నూలి ఎడిటింగ్ అక్కడక్కడా ల్యాగ్ విషయంలో జాగ్రత్త పడి ఉంటే ఇంకాస్త వేగం పెరిగేది. నిర్మాత మధు నిర్మాణ విలువలు మాత్రం భారీగా ఉన్నాయి. కథను నమ్మి అడిగినంత ఖర్చు చేశారు.

ప్లస్ గా అనిపించేవి

రవితేజ మాస్ ఎనర్జీ
సముతిరఖని పాత్ర
తమన్ బిజిఎం
ఛాయాగ్రహణం
యాక్షన్ ఎపిసోడ్స్

మైనస్ గా తోచేవి

మొదటి నలభై నిముషాలు
ఊహించగలిగే ట్విస్టులు
రెండు పాటలు
హీరోయిన్ ట్రాక్

కంక్లూజన్

తమ హీరో నుంచి ఎలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ అభిమానులు కోరుకుంటున్నారో చాలా కాలం తర్వాత క్రాక్ రూపంలో అది దొరికింది. కెరీర్ బెస్ట్ క్యాటగిరీలో వేయలేకపోయినా గత కొన్నేళ్లతో రవితేజ చేసిన డిజాస్టర్ల కంటే ఇది ఎన్నో వందల రెట్లు నయమనిపించేలా ఉంది. ఓ మోస్తరు అంచనాలు పెట్టుకున్నా అసంతృప్తితో బయటికి రాకుండా గోపిచంద్ టేకింగ్ ఈ సినిమాను గట్టెకెక్కించింది. కథాకథనాల విషయంలో మరీ ఎక్కువ వైవిధ్యం ఆశించకుంటేనే క్రాక్ ఓకే అనిపిస్తాడు. ముందే చెప్పినట్టు పర్లేదు అనే కంటెంట్ ఉన్నా చాలు రవితేజ తన ఎనర్జీతో జనాన్ని రప్పిస్తాడని చాలాసార్లు ఋజువయ్యింది కాబట్టి క్రాక్ కూడా హిట్ క్యాటగిరీలో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

ఒక్క మాటలో – ‘మాస్’కి కిక్కిచ్చే క్రాక్