సమీక్ష - మనకు కథలు దొరక్కపోతే పెద్దగా ఇబ్బంది పడక్కరలేదు. రామయణం, భారతం రెడీ రిఫరెన్స్ గా వుంటాయి.
సమీక్ష - మనకు కథలు దొరక్కపోతే పెద్దగా ఇబ్బంది పడక్కరలేదు. రామయణం, భారతం రెడీ రిఫరెన్స్ గా వుంటాయి.
వి రాజా
సమీక్ష – మనకు కథలు దొరక్కపోతే పెద్దగా ఇబ్బంది పడక్కరలేదు. రామయణం, భారతం రెడీ రిఫరెన్స్ గా వుంటాయి. ఎన్నిసార్లు ఎన్ని విధాలుగా అయినా తీసుకోవచ్చు. ఎన్ని సార్లు చూసినా మన ప్రేక్షకులు చూస్తారులే అనే ధీమా. దర్శకుడు మురళి అబ్బూరు కూడా అలాగే ధీమా పడ్డారు. పైగా భారతాన్ని అటు ఇటు చేసి తీయడం ఎందుకు డైరక్ట్ గానే తీసేద్దాం అని డిసైడ్ అయ్యారు. భారతంలోని గాంధారి, శకుని, దుర్యోధనుడు, కర్ణుడు, ఇలా అన్ని పాత్రలను సినిమాలోకి తీసుకువచ్చేసారు. ఇలా తీసుకువచ్చి అల్లుకున్న కథేంటీ అంటే..
రామాపురం అనే గ్రామంలో భారతం మిట్ట అనే దగ్గర ఏటా ద్రౌపది కొలువు పేరుతో 18 రోజులు పూజలు చేయడం ఆచారం. ఆ గ్రామానికి అనాధగా వస్తాడు లెనిన్ (అఖిల్). ఆ ఊరి పెద్దమ్మ చేరదీస్తుంది. ఆమె కొడుకు స్నేహితుడు అవుతాడు. ఆ ఊరిలో వున్న మరో పెద్ద మనిషి పెద్ద కూతుర్ని ఈ పెద్దమ్మ కొడుక్కి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటారు. రెండో కూతురు భారతి (భాగ్యశ్రీ)ని లెనిన్ ప్రేమిస్తాడు. పలు మలుపులు తరువాత ఆ ఇద్దరికీ పెళ్లవుతుంది. అదే టైమ్ లో ఆ ప్రాంత ఎమ్మెల్యే ఈ మొత్తం కుటుంబం మీద పగపడతాడు. దాంతో కురుక్షేత్రం ప్రారంభం అవుతుంది. ఇది ఎక్కడకు దారితీసింది అన్నది సినిమా. నిజానికి కథను క్లుప్తంగా చెప్పడం కష్టం..సాధ్యం కాదు కూడా. ఎందుకంటే అన్ని పాత్రలు, అన్ని లేయర్లు, అన్ని సన్నివేశాలు సినిమా నిండా పరుచుకుంటాయి. అందువల్ల ఈ సినిమా ఎలా వుంది అన్నది క్లుప్తంగా చెప్పడం బెటర్.
దర్శకుడు భారతాన్ని అడాప్ట్ చేసుకుంటే కథ రాసుకోవడం వరకు ఓకె. కానీ లెక్కకు మించిన ఆ పాత్రలను హ్యాండిల్ చేయడంలో కానీ, అన్నింటికి సరైన దశ, దిశ నిర్ణయించడం లో కూడా, ఆ పాత్రలతో సరైన బలమైన భావోద్వేగాలు నిండిన సన్నివేశాలు రాసుకోవడం లో కానీ విఫలమయ్యారు. అందువల్ల బలమైన భావోద్వేగాలు, డ్రామా పండాల్సిన సన్నివేశాలు అన్నీ నాసిరకంగా తేలిపోయాయి. సినిమా స్క్రీన్ ప్లే లో కూడా కాస్త తడబాటు కనిపించింది. ప్రేక్షకులకు షాకింగ్ మూమెంట్ ఇవ్వాల్సిన సన్నివేశాలు కూడా పెద్దగా ప్రభావితం చేయకుండానే తేలిపోయాయి.
సినిమా తొలిసగం ఆరంభమైన దగ్గర నుంచి విశ్రాంతి కి కాస్త ముందు వరకు సినిమా చాలా రెగ్యులర్ ఫార్మాట్ లో ముందుకు వెళ్తుంది. పీరియాడిక్ గెటప్ లు, కలర్ టోన్ తప్పిస్తే కొత్తదనం ఏమీ వుండదు. నిజానికి అక్కడ పాత్రలను పరిచయం చేసినపుడో, వాటిని ముందుకు నడిపినపుడో ద్వితీయార్థంలో రాబోయే సన్నివేశాలకు లింక్ చేస్తూ అంతరార్ధం వున్న సంభాషణలో, చిన్న ఇండికేషన్ లో ఇస్తే వేరుగా వుండేది.
కానీ ఏ ట్విస్ట్ కూడా అస్సలు రివీల్ కాకూడదని,ప్రతి ట్విస్ట్ షాకింగ్ గా వుండాలని అనుకున్నాడు దర్శకుడు. అందుకే తొలిసగాన్ని సరిగ్గా వినియోగించుకుండానే వదిలేసాడు. విశ్రాంతి దగ్గర నుంచి సినిమా కాస్త గాడినపడుతుంది. మలి సగం ప్రారంభం అయ్యాక కొంత సేపటికి మళ్లీ సినిమా కాస్త వెనక్కు జారుతోంది అనిపిస్తుంది. కానీ తరువాత మళ్లీ ముందుకు వెళ్తుంది. ఈ ద్వితీయార్థం అంతా కథలోని పాత్రలు దేనికవి, వాటి అంతట అవి ముందుకు ఎటువంటి కంట్రోలు లేకుండా వెళ్లిన భావన కలుగుతుంది. ఇలా వదిలేయడం వల్ల ఏ పాత్రకు కూడా పూర్తి న్యాయం జరగలేదు.
వాస్తవానికి భారతాన్ని అడాప్ట్ చేసుకున్నా, బలమైన కథ రాసుకోలేకపోయారు. పాత్రలు సృష్టించారు తప్ప వాటి చుట్టూ బలమైన కథ లేదు. విలనీకి బలమైన రీజన్ లేదు. ఆ విలనీకి తగిన నటులను తీసుకోలేదు. ఎంతసేపూ హీరో పాత్ర పండిందా లేదా అన్నది చూసుకోవడానికే సరిపోయింది. బలమైన కథ లేక, విలనీ లేక, కారణం లేక ఇంక హీరో పాత్ర ఎంత పండితే ఏం లాభం?
ద్వితీయార్థం మొత్తం సీరియస్ సన్నివేశాలంతో పొడుచుకోవడం, నరుక్కోవడం, రక్తపాతంతో నింపేసారు. అందువల్ల ప్రేక్షకుడు మమేకం అయి చూడడానికి ఏం వుంటుంది? ఏమీ వుండదు. అఖిల్ బాగా చేసాడు..బాగా చేసాడు అనుకోవడంతోనే సరిపోతుంది. థమన్ ఈ సినిమాకు మంచి అవుట్ పుట్ ఇచ్చారు. బ్యాక్ గ్రవుండ్ స్కోర్ బాగుంది. పాటలు కూడా బాగున్నాయి. కానీ చాలా వరకు పాటలు కథలో ఇమడలేదు. రెండో సగంలో వచ్చిన పాట కథనానికి బ్రేక్ వేసింది.
మొత్తం మీద లెనిన్ సినిమా ఆఫ్ బేక్ డ్ అన్నట్లు తయారైంది. బలమైన సంభాషణలు, భావోద్వేగాలు నిండిన సన్నివేశాలు, వాటిని రక్తికట్టించే నటులు వుండాలి. ఆపై సరైన కథ వుండాలి. అప్పుడు భారతాన్ని అనుసరించినా, రామాయాణాన్ని స్ఫూర్తిగా తీసుకున్నా పని జరుగుతుంది. లేదంటే లెనిన్ లా మిగులుతుంది.