iDreamPost
android-app
ios-app

మహిళలకు పెద్దపీట వేశాం – సీఎం జగన్‌

మహిళలకు పెద్దపీట వేశాం – సీఎం జగన్‌

సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా చేయూతనందిస్తూ మహిళలకు పెద్దపీట వేశామని సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విజయవాడ ఇందిరా గాంధీ మున్సిపల్‌ స్టేడియంలో నిర్వహించిన వేడుకల్లో పాల్గొన్న సీఎం జగన్‌మోహన్‌ రెడ్డి మహిళలను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా మహిళా సాధికారతకు తమ ప్రభుత్వం చేసిన కృషిని ఆయన వివరించారు.

” కాపు నేస్తం ద్వారా ఇప్పటివరకు రూ.982 కోట్లు సాయం చేశాం. 34 నెలల కాలంలో మహిళల చేతికి రూ.లక్షా 18 వేల కోట్లు అందించాం. దేశంలోనే తొలిసారిగా వైఎస్సార్‌ ఈబీసీ నేస్తం ద్వారా సాయం అందిస్తున్నాం. ప్రతి గ్రామ సచివాలయంలో మహిళా పోలీస్‌ నియామకం విప్లవాత్మక మార్పు. డిప్యూటీ సీఎం, హోం మంత్రి పదవులు కూడా మహిళలకే ఇచ్చాం. గ్రామ, వార్డు సచివాలయాల్లో 51శాతం మహిళలే పని చేస్తున్నారు.

సంపూర్ణ పోషణ పథకానికి రూ.2వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. మహిళల రక్షణ కోసం దిశ చట్టం, దిశ యాప్‌, దిశ పీఎస్‌లు తీసుకొచ్చాం. దేశంలో ఎక్కడా లేని విధంగా దిశ యాప్‌ రూపొందించాం. కోటి 13 లక్షల మంది మహిళలు దిశ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. అన్ని జిల్లాల్లో దిశ ఫోరెన్సిక్ ల్యాబ్‌లు ఏర్పాటు చేశాం.

31 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేదు. విద్యా దీవెన, వసతి దీవెన కల్పించిన ప్రభుత్వం దేశంలోనే ఎక్కడా లేదు. విద్యా దీవెన ద్వారా రూ.6,260 కోట్లు నేరుగా అందించాం. గత ప్రభుత్వం బకాయి పెట్టిన రూ.1800 కోట్లు కూడా చెల్లించాం. ఇలాంటి పథకాలు గత ప్రభుత్వం ఏనాడు అమలు చేయలేదు. సంపూర్ణ పోషణ పథకం ద్వారా 34.16లక్షల మంది మహిళలకు మేలు చేకూరుతోంది.

రెండున్నర ఏళ్లుగా అధికారాన్ని మహిళల కోసం వినియోగించాం. వైఎస్సార్‌ ఆసరా వడ్డీ పథకం దేశంలో ఎక్కడా లేదు. వాలంటీర్లుగా 53 శాతం మహిళలే ఉన్నారు. అమ్మఒడి పథకం ద్వారా ఇప్పటివరకు రూ.13వేల కోట్లు ఇచ్చాం. క్రమం తప్పకుండా సున్నా వడ్డీ చెల్లిస్తున్నాం. వైఎస్సార్‌ సున్నా వడ్డీ కింద రూ.2,354కోట్లు నేరుగా జమ చేశాం. వైఎస్సార్‌ చేయూత ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ మహిళలకు ఆర్థిక సాయం అందిస్తున్నాం. ఈ పథకం ద్వారా ఇప్పటివరకు రూ. 9,180 కోట్లు సాయం అందించాం. ప్రతి నెల ఒకటో తేదీన చేతిలో పెన్షన్‌ పెడుతున్న ప్రభుత్వం ఎక్కడా లేదు. ​

మహిళలకు 51 శాతం పదవులు కేటాయించాలని చట్టం చేశాం. మహిళల కోసం చట్టం చేసిన తొలి ప్రభుత్వం మనదే. దేశ చరిత్రలోనే ఇంతమంది మహిళా ప్రజాప్రతినిధులతో సభ జరిగి ఉండదు. జెడ్పీ ఛైర్‌ పర్సన్‌లుగా 54శాతం మంది మహిళలే ఉ‍న్నారు. 13 జెడ్పీ చైర్మన్‌లలో ఏడుగురు మహిళలే. మహిళలకు 51 శాతం పదవులు ఇచ్చిన ఏకైక రాష్ట్రం ఏపీనే. మున్సిపల్‌ ఛైర్‌పర్సన్‌లుగా 64 శాతం మహిళలే ఉన్నారు. నామినేటెడ్‌ పోస్టులు, కాంట్రాక్టులు మహిళలకు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని” సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేర్కొన్నారు.