Idream media
Idream media
దివంగత మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి కుటుంబానికి తాను, వైసీపీ అండగా ఉంటుందని సీఎం జగన్‌మోహన్ రెడ్డి పునరుద్ఘాటించారు. గౌతమ్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా సంగం బ్యారేజీకి మేకపాటి గౌతమ్ రెడ్డి సంగం బ్యారేజీగా పేరు పెడతామని స్పష్టం చేశారు. వైసీపీ ముఖ్యనేత, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి – ప్రశాంతి దంపతులు దివంగత మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి సంస్మరణ సభను నెల్లూరు నగరంలో సోమవారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీఎం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి పాల్గొన్నారు. గౌతమ్ రెడ్డికి ఘననివాళులు అర్పించిన సీఎం జగన్.. గౌతమ్ రెడ్డితో తనకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
‘‘ ఇలాంటి పరిస్థితుల మధ్య మాట్లాడాల్సి వస్తుందని ఊహించలేదు. గౌతమ్ మన మధ్య లేడు అంటే నమ్మడానికి మనసుకు కష్టంగా ఉంది. ఇంకా కనిపిస్తూనే ఉన్నాడు. ఇక రాడు, లేడు అనేది జీర్ణించుకోలేక పోతున్నాను. చిన్నప్పటి నుంచి గౌతమ్ నాకు స్నేహితుడు. నేను రాజకీయాల్లో లేకపోయి ఉంటే బహుశా గౌతమ్ కూడా వచ్చి ఉండేవాడు కాదు. 2010లో కాంగ్రెస్ పార్టీతో యుద్ధం మొదలైంది. అప్పుడు రాజమోహన్ రెడ్డి అన్న ఎంపీగా ఉన్నారు. నేను ఎంపీగా ఉన్నాను.గౌతమ్‌తో ఉన్న సన్నిహితమే రాజమోహన్ రెడ్డి అన్న నాతో నడిచేలా చేసింది. ప్రతి అడుగులోనూ నాకు తోడుగా, స్నేహితుడుగా గౌతమ్ అండగా ఉన్నారు. నాకన్నా ఒక ఏడాది పెద్ద అయినా.. నన్నే గౌతమ్ అన్నగా భావించేవాడు. ఎప్పుడూ నన్ను ప్రొత్సహించేవాడు. అలాంటి మంచి వ్యక్తి లేకపోవడం జీర్ణించుకోలేని విషయం. నేను గౌతమ్ చేత రాజకీయాల్లో అడుగులు వేయించాను. మంచి నేతగా ఎదిగాడు. రెండుసార్లు ఎమ్మెల్యేగా, మంత్రిగా ఆరు శాఖల బాధ్యతలు నిర్వర్తించాడు.
పరిశ్రమలు తీసుకురావాలని, తద్వారా ప్రజలకు, ప్రభుత్వానికి, నాకు మంచి పేరు వస్తుందని భావించేవాడు. దుబాయ్ వెళ్లే ముందు కనిపించాడు. వచ్చిన తర్వాత కలిసేందుకు సమయం అడిగాడు. ఆ లోపే ఈ దురదృష్టకరమైన ఘటన జరిగింది. మంచి స్నేహితున్ని పొగుట్టుకున్నాం. నేను, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గౌతమ్ కుటుంబానికి తోడుగా ఉంటుంది. ఆ కుటుంబానికి దేవుడు తోడుగా ఉండాలని, మంచి జరగాలని కోరుకుంటున్నాను. వెళ్లిపోయిన తర్వాత ప్రజల హృదయాల్లో నిలిచి ఉండే నేతల్లో గౌతమ్ గొప్పగా ఉంటాడు. వెలిగొండ జలాలు ఉదయగిరి, ఆత్మకూరుకు తెచ్చి, గౌతమ్‌కు ఘన నివాళి అర్పిస్తాం. మెరిట్స్ కాలేజీని యూనివర్సిటిగా మారుస్తాం. సంగం బ్యారేజీ ప్రారంభోత్సవం రోజున మేకపాటి గౌతమ్ సంగం బ్యారేజీగా నామకరణం చేసి శాశ్వతంగా అందరి మనస్సుల్లో ఉండేలా చేస్తాం’’ అని సీఎం జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు.
గౌతమ్ మరణం తర్వాత వైఎస్ జగన్ కుటుంబం మా కుటుంబం పట్ల ఎంతో శ్రద్ధాశక్తులు చూపించారని మాజీ ఎంపి మేకపాటి రాజమోహన్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. తాను చేసిన ప్రతిపాదనలను సీఎం జగన్ పరిగణలోకి తీసుకుని ఉదయగిరి నియోజకవర్గానికి వెలిగొండ జలాలు ఇవ్వడం, మెరిట్స్ కాలేజీని అగ్రి, హార్టికల్చర్ కాలేజీగా మార్చారని చెప్పారు. భవిష్యత్‌లో ఈ కాలేజీని యూనివర్సిటీగా మార్చాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరారు. ఉదయగిరి డిగ్రీ కాలేజీని నాడు–నేడు రెండో ఫేజ్‌లో అభివృద్ధి చేస్తున్నారని మేకపాటి చెప్పారు. తాము అడగకుండానే సంగం బ్యారేజీని త్వరితగతిన పూర్తి చేసి, దానికి గౌతమ్ పేరు పెడతానని సీఎం జగన్ చెప్పారని మేకపాటి గుర్తు చేశారు. తన కేబినెట్‌లో గౌతమ్‌కు అవకాశం ఇచ్చి, తన ప్రతిభాపాటవాలు నిరూపించుకునే అవకాశం సీఎం జగన్ ఇచ్చారని కొనియాడారు. తమ కుటుంబం వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి కుటుంబం పట్ల కృతజ్ఞతతో ఉంటుందని పేర్కొన్నారు.