Idream media
Idream media
పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టంలోని లొసుగులపై ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ లొసుగులే రిటైల్‌గా కాకుండా హోల్‌సేల్‌గానే పార్టీ ఫిరాయింపులకు మార్గం సుగమం చేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ చట్టాన్ని పటిష్టం చేసేందుకు సవరణలు అవసరమని చెప్పారు. బెంగళూరు ప్రెస్‌క్లబ్ స్వర్ణోత్సవాలను పురస్కరించుకుని ‘నవభారత నిర్మాణంలో మీడియా పాత్ర’ అనే అంశంపై సదస్సు నిర్వహించారు.
సదస్సులో ఆయన మాట్లాడుతూ పార్టీ మారాలనుకునే ప్రజా ప్రతినిధులు ముందుగా తమ పదవులకు రాజీనామా చేసి, తిరిగి ఎన్నిక కావాలని సూచించారు. పార్టీ ఫిరాయింపు కేసులను స్పీకర్లు, చైర్‌పర్సన్లు, కోర్టులు సైతం ఏళ్ల తరబడి సాగదీస్తున్నాయంటూ వెంకయ్యనాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘ఫిరాయింపులపై చర్య తీసుకునే అధికారం చైర్మన్, స్పీకర్‌లకు ఉంది. అయితే, అత్యధిక కేసుల్లో వారు సమర్థవంతంగా ఆ అధికారాన్ని వినియోగించుకోవడం లేదు. ఫిరాయింపులపై కోర్టులు సహా ప్రిసైడింగ్ అధికారి, స్పీకర్ గరిష్ఠంగా 6 నెలల్లో నిర్ణయం తీసుకునేలా చట్టంలో స్పష్టత ఉండాలి. మూడు నెలల్లోనే నిర్ణయం తీసుకోవాలనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఆ కేసుల్లో నేను అలాగే వ్యవహరిస్తున్నా’ అన్నారు.
అలాగే, కొంతకాలంగా పాత్రికేయ విలువలు దిగజారుతున్న తీరుపట్ల ఉపరాష్ట్రపతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నీతి, నిర్భీతి, నిజాయితీ కలిగిన పత్రికా స్వేచ్ఛ ద్వారానే ప్రజాస్వామ్య మనుగడ సాధ్యమన్నారు. వార్తలతో అభిప్రాయాలను జోడించకుండా వాస్తవాలను యథాతథంగా ఇవ్వడమే అత్యుత్తమమని చెప్పారు. వివక్ష రహితంగా వాస్తవాలను అందించడమే నిజమైన జర్నలిజమని తెలిపారు. కరోనా వేళ ప్రాణాలు కోల్పోయిన పాత్రికేయులకు నివాళులర్పించారు. పత్రికా స్వేచ్ఛపై జరిగే ఎలాంటి దాడి అయినా జాతీయ ప్రయోజనాలను దెబ్బతీసేదేనని, అలాంటి ఘటనలను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉందని చెప్పారు. పంచాయతీరాజ్ దినోత్సవం(ఏప్రిల్ 24) సందర్భంగా స్థానిక సంస్థలను బలోపేతం చేయాల్సిన అవసరం ఉందని వెంకయ్యనాయుడు నొక్కి చెప్పారు. స్థానిక సంస్థలకు నిధులు, విధులు, అధికారాలను బదిలీ చేయాలని సూచించారు.